logo
Published : 28 Jun 2022 02:24 IST

పథకాలు పునరుద్ధరించేంత వరకు పోరాటం

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన దుల్హన్‌, విదేశీ విద్య, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, చేతివృత్తులకు ఇచ్చే రాయితీ రుణాలను మళ్లీ పునరుద్ధరించే వరకు పోరాటాలు ఆగవని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్  స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని ఖలీల్‌ థియేటరు ఆవరణలో సోమవారం ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధ]న కమిటీ కన్వీనర్, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల పథకాలను తిరిగి కొనసాగించాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఫరూక్  ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క దుల్హన్‌ పథకంతోనే ముస్లింలకు మేలు జరగదన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇస్తే పేదలు వ్యాపారాలు చేసుకుని బాగుపడతారని చెప్పారు. ఎన్నికల ముందు ముస్లింలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటి అమలుకు నీళ్లొదిలిన సీఎం జగన్‌కు ముస్లిం సమాజం తగిన బుద్ధి చెబుతుందన్నారు. హామీలు నెరవేర్చేవరకూ ముస్లింలందరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెదేపా మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ధ్వజమెత్తారు. దుల్హన్‌ పథకం రద్దును వ్యతిరేకిస్తూ ముస్లింలు అబుల్‌ కలాం ఆజాద్ సెంటరులో  నిరసన తెలిపేందుకు అనుమతి కోరగా తిరష్కరించారని మండిపడ్డారు.  ప్రభుత్వ పథకాల సాధన కమిటీ కన్వీనర్ ఎన్‌ఎండీ ఫిరోజ్‌, ఆవాజ్‌ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్‌వలి, సద్దాం, జమాతే ఇస్లామీ హింద్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ సమద్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌ కార్యదర్శి మస్తాన్‌ఖాన్‌, తెదేపా కౌన్సిలర్లు జైనాబీ, శ్రీదేవి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లా ఖాజాహుసేన్‌, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఎండీ యూనిస్‌ దీక్షల్లో కూర్చున్నారు. వారికి  మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.

* రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, పట్టణ తెదేపా అధ్యక్షుడు ఖలీల్‌, ఆవాజ్‌ కమిటీ పట్టణ అధ్యక్షుడు బాబుల్లా, మైనార్టీ హక్కుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, తెదేపా రాష్ట్ర లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి పీడీ హుసేన్‌బాబు, మైనార్టీ నాయకులు, మహిళలు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts