logo

పేదల భూములపై పెద్దల పెత్తనం

తరతరాల నుంచి వచ్చిన భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి పొలం తప్పితే  మరో ఆధారం లేదు. ఆక్రమణదారుల చూపు వారి భూములపై పడింది. అధికార.. రాజకీయ అండదండతో ఆన్‌లైన్‌లో తమ పేరిట  నమోదు చేయించుకున్నారు.

Published : 28 Jun 2022 02:24 IST

న్యాయం కోసం బాధితుల విన్నపం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: తరతరాల నుంచి వచ్చిన భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి పొలం తప్పితే  మరో ఆధారం లేదు. ఆక్రమణదారుల చూపు వారి భూములపై పడింది. అధికార.. రాజకీయ అండదండతో ఆన్‌లైన్‌లో తమ పేరిట  నమోదు చేయించుకున్నారు. పేదల ఆస్తులు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. న్యాయం చేయండని బాధితులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని సోమవారం బాధితులు కలెక్టరేట్‌లో విన్నవించారు.


తొమ్మిదేళ్లుగా నిరాశే..

భర్త, కుమారుడు మృతిచెందడంతో డోన్‌ మండలం మల్యాలకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు అంకాలు వెంకమ్మ ఒక్కరే జీవనం సాగిస్తున్నారు. ఆమె పేరిట 13 ఎకరాలు ఉంది. ఆ భూమిపై పెద్దల కన్ను పడింది. రాజకీయ అండతో ఒక నాయకుడు ఆన్‌లైన్‌లో తన పేరిట నమోదు చేయించుకున్నారు. న్యాయం కోసం వెంకమ్మ తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గ్రామ వీఆర్వో నుంచి తహసీల్దారు వరకు అందరినీ వేడుకున్నారు. కర్నూలు కలెక్టరేట్‌ చుట్టూ ఏళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. గతేడాది రూ.4 లక్షల పెట్టుబడి పెట్టి పొలంలో కంది సాగు సాగు చేస్తే వర్షానికి దెబ్బతినింది. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పంట నష్టపరిహారం పొలం లాక్కున్న నాయకుడి ఖాతాలోనే జమైంది. ‘‘ రెండేళ్ల కిందట కింద పడటంతో నడవడం కష్టంగా మారింది... వాకర్‌ సాయంతో అడుగులు వేస్తూనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ఆధారం అన్యాక్రాంతం

పాణ్యం మండలం పిన్నాపురానికి చెందిన ఎల్లమ్మ వయసు 60 ఏళ్లు. చాలాకాలం కిందట బతుకుదెరువు కోసం గడిగరేవులకు వెళ్లారు. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఆరుగురు సంతానం. ఎల్లమ్మకు ఇద్దరు పిల్లలు. ఆమెకు పిన్నాపురంలో రెండు ఎకరాల పొలం ఉండగా.. గ్రామానికి చెందిన కొందరు ఆన్‌లైన్‌లో తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఎనిమిది మంది సంతానం, ఇద్దరు పెద్దలు ఉన్న కుటుంబానికి రెండు ఎకరాల పొలమే ఆధారం. ఆ పొలాన్ని అక్రమంగా కొందరు దస్త్రాల్లో ఎక్కించుకున్నారు. ‘‘ న్యాయం చేయాలని నాలుగేళ్లుగా కర్నూలు కలెక్టరేట్‌, పాణ్యం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. అనారోగ్యంతో నడవడమే కష్టంగా ఉంది.. తమకు న్యాయం చేయమని కోరితే అధికారులు కసురుకుంటున్నారని’’ ఆమె న్యూస్‌టుడేతో వాపోయారు.

కొలత వేయరు.. కలత తీర్చరు

బండిఆత్మకూరు మండలం జీసీ పాలేనికి చెందిన శ్రీదేవి, రామలక్ష్మిలకు రెండెకరాల పొలంతో పాటు మరికొందరి పొలం ఆక్రమణకు గురైందని నాలుగేళ్ల కిందట బండిఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాటి నుంచి నేటి వరకు కనీసం కొలతలు వేయడానికీ ఎవరూ రావడం లేదు. సర్వే సంఖ్య 469లో 10.99 ఎకరాల భూమిలో ఎకరాన్నర వరకు ఆక్రమించారు.. కొలతలు వేసి న్యాయం చేయాలని అడిగితే సరిగ్గా కొలువకుండా వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. అధికారులు పొలం కొలతలు వేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని