logo
Published : 28 Jun 2022 02:24 IST

తమ్ముడు, ప్రియుడితో కలిసి... భర్తను అంతమొందించిన భార్య

వివరాలు వెల్లడిస్తున్న నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి

పాణ్యం గ్రామీణ, న్యూస్‌టుడే : పాణ్యానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జవహర్‌హుసేన్‌ను అతని భార్యనే హత్య చేసినట్లు నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. పాణ్యం సీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాల ఆయన వెల్లడించారు. పాణ్యానికి చెందిన జవహర్‌హుసేన్‌ బనగానపల్లి మండలంలోని చెరువుపల్లె పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 13 ఏళ్ల క్రితం పాణ్యానికి చెందిన షేక్‌ హసీనాతో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. జవహర్‌హుసేన్‌కు దైవభక్తి ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కన గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక సమావేశాలకు తరచూ వెళ్లేవారు. ప్రతి శుక్రవారం తన ఇంట్లో   ధార్మిక బోధనలు చేసేవారు. వీటిని వినేందుకు స్థానికుడైన మహబూబ్‌బాషా వెళుతుండే వారు. ఈ క్రమంలో జవహర్‌ భార్య షేక్‌ హసీనాకు మహబూబ్‌బాషాతో పరిచయం ఏర్పడి  వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం జవహర్‌హుసేన్‌కు తెలియడంతో పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి మహబూబ్‌బాషాను పాణ్యం మండలం నుంచి ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురానికి పంపివేశారు. ఆ తర్వాత వారు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. తమకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని హసీనా నిర్ణయించుకుంది.

భర్త తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని తన తమ్ముడు ఇద్రూస్‌కు చెప్పి.. ప్రియుడు మహబూబ్‌బాషాతో కలిసి హత్య చేసేందుకు కుట్న పన్నారు. మే 13న రాత్రి మద్దూరులో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి ఇంటికొచ్చి నిద్రిస్తున్న జవహర్‌హుసేన్‌ కాళ్లను ముగ్గురూ కలిసి తాడుతో కట్టివేసి.. గొంతు నులిమి హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆస్తమాతో ఊపిరాడక తన భర్త పలకడం లేదంటూ ఉదయాన్నే హసీనా బంధువులకు సమాచారం అందించింది. అనంతరం శాంతిరాం వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు వివరించారు. మృతుడి సోదరుడు షేక్‌ కరీముల్లా ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా అప్పట్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో జవహర్‌హుసేన్‌ది హత్య అని తేలడంతో.. భయపడిన నిందితులు సోమవారం ఆర్‌ఐ జంగం మహేశ్వరరెడ్డి వద్ద లొంగిపోయి నేరాన్ని ఒప్పుకొన్నట్లు డీఎస్పీ వివరించారు. వారిని పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సుధాకర్‌రెడ్డి వద్ద హాజరుపరచగా ముగ్గురి వాంగ్మూలాన్ని తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి మూడు చరవాణులు, తాడును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను నంద్యాల న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts