logo
Published : 28 Jun 2022 02:24 IST

స్పందన అర్జీలు గడువులోగా పరిష్కరించాలి

బాధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్న జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : స్పందనకు వచ్చే అర్జీలు గడువు కంటే ముందుగానే బాధితుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయనతోపాటు డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ బీకే వెంకటేశులు తదితరులు సోమవారం బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ నెలలో వివిధ శాఖలకు సంబంధించి 110 అర్జీలు రీఓపెన్‌ అయ్యాయి.. వాటిలో అత్యధికంగా వ్యవసాయ శాఖలో 38, మిగిలినవి రెవెన్యూ, పీఆర్‌, మున్సిపాలిటీ తదితర శాఖలవి ఉన్నాయని జేసీ మండిపడ్డారు. పంటల బీమా పరిహారానికి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఒక్క సర్వీసు అందించని సచివాలయాలు 32 వరకు ఉన్నాయని, సదరు సిబ్బందికి తాఖీదులు జారీ చేయాలని ఎంపీడీవోలను జేసీ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియకు సంబంధించి రేపటిలోగా కలెక్టర్‌కు దస్త్రం పంపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను విన్నవించారు.


70-80 సార్లు తిరిగినా న్యాయం జరగలేదు

సి.బెళగల్‌ మండలం కంబదహాల్‌లో సర్వే నంబరు 114లో 2.66 ఎకరాల పట్టా భూమిని 2016లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఆరేళ్లైందని, ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేయడం లేదని ఉప్పరి ఓంకారం అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడం లేదని, తహసీల్దారు కార్యాలయం చుట్టూ 70-80 సార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అయినా రెవెన్యూ అధికారులు కనికరం చూపడం లేదన్నారు. 2016 నుంచి తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని స్పందనలో అధికారులకు మొరపెట్టుకున్నారు.


దౌర్జన్యం చేస్తున్నారు..  

తమది నందవరం మండలం మాచాపురం గ్రామమని, సర్వే నంబరు 143లో 1.50 ఎకరాలను శంకరమ్మ నుంచి కొనుగోలు చేశామని, 1బీ ఆన్‌లైన్‌ అడంగల్‌, పాసు పుస్తకాలు ఉన్నాయని వీరేష్‌ అనే వ్యక్తి తెలిపారు. అదే గ్రామానికి చెందిన బోయ గోవిందు తమ పొలాన్ని ఆక్రమించుకుని తమపై దాడి చేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌కు విన్నవించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


ఎర్ర గుర్తు తొలగించండి

గోనెగండ్ల మండల కేంద్రంలో సర్వే నంబరు 155లో 1.55 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎర్ర గుర్తుతో పెట్టారని గోనెగండ్లకు చెందిన ఆదాము స్పందనలో జేసీకి విన్నవించారు. పొలానికి పైభాగంలో, కింది భాగంలో ఇరువురి భూ యజమానుల సమస్యల కారణంగా మధ్యలో ఉన్న తమ పొలాన్ని రెడ్‌మార్క్‌లో పెట్టారని, తను పంట రుణం కోసం వెళ్తే రుణం ఇవ్వమని బ్యాంకర్లు చెప్పారన్నారు. రెడ్‌ మార్క్‌లో పెట్టడం వల్ల తన భూమికి రుణం ఇవ్వడం లేదని బాధితుడు జేసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సమస్యను పరిష్కరించాలని తహసీల్దారుకు సిఫారసు చేశారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts