logo
Published : 29 Jun 2022 02:15 IST

కష్టకాలంలో ఇదే తీరువా

రైతులకు జారీ చేసిన నోటీసు
శిస్తు చెల్లించాలని రైతులకు తాఖీదులు  
వడ్డీతో సహా ఇవ్వాలంటున్న అధికారులు

కర్నూలు సచివాలయం, మంత్రాలయం, ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. విత్తనాలు, ఎరువులకు అన్నదాతలు అప్పులు చేస్తున్నారు. కష్ట‘కాలం’లో ఉండగా నీటి తీరువా పన్ను(శిస్తు) చెల్లించాలని అధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. ఆరేళ్ల బకాయిలు వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలని రెవెన్యూ అధికారులు పేర్కొనడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. సాగు నీరు అందకున్నా పన్ను చెల్లించాల్సిందేనని తాఖీదులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో రూ.20,12,66,463, కర్నూలులో రూ.15,68,30,660 వసూలు కావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంది.
ప్రత్యేక బృందాలు
ఉమ్మడి జిల్లాలో 8.89 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి.  ఎకరా వరికి రూ.200, చెరకు రూ.350, చెరువుల కింద రూ.500 చొప్పున నీటి తీరువా చెల్లించాల్సి ఉంది.  వసూళ్ల ప్రక్రియ సాధారణంగా నవంబరు, మార్చిలో చేపడతారు. కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో నీటి తీరువా(శిస్తు) పన్ను వసూళ్లు జరగక బకాయిలు పేరుకుపోయాయి. వసూలుకు  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆన్‌లైన్‌లో  వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శిస్తు వసూళ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో మ్యాపింగ్‌ చేశారు. రైతులు వీఆర్వోల వద్దకు వెళ్తే సచివాలయాలు లేదా మీసేవా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడికెళ్తే సర్వర్‌ సమస్యలున్నాయని చెబుతున్నారు. గతంలో రైతులు వీఆర్వోల వద్దకు వెళ్లి పన్నులు చెల్లించి రసీదు తీసుకునేవారు. ఆన్‌లైన్‌ విధానంపై చాలామందికి అవగాహన కరవైంది. దీంతోపాటు సర్వర్‌ మొరాయింపు, గతంలో చెల్లించినవి చెల్లించనట్లు చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆన్‌లైన్‌ ఆటంకాలు సాగకపోయిన ఇవ్వాల్సిందే
నంద్యాల డివిజన్‌ పరిధిలో కేసీ, ఎస్సార్బీసీ కాలువల కింద నీటి తీరువా వసూలుకు వీఆర్వోలు, గ్రామ సేవకులు రైతులను కలుస్తున్నారు. మొత్తం రూ.11,87,66,136 నీటి తీరువా ఉండగా అందులో రూ.81,56,602 వసూలు చేశారు. పాతబకాయిలకు వడ్డీ రూపంలో రూ.51,84,264 కలపడం గమనార్హం. ఆయా కాలువల కింద వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. అయినా పన్నులు చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి తుంగభద్ర ఆయకట్టు పరిధిలోనూ ఉంది.


పాత బకాయిలపై వడ్డీ
- రమణ, ఎస్‌.లింగందిన్నె, ఆళ్లగడ్డ

కేసీ కాలువ నీటిని 10 ఏళ్లుగా వాడుకోవడం లేదు. 247(2) సర్వే నంబరులో మూడు ఎకరాలకు బోరు నీటితోనే పంటలు పండించుకుంటున్నా. అయినా నీటి తీరువా చెల్లించాల్సిందేనని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. గత్యంతరం లేక మూడేళ్ల బిల్లు చెల్లించా. పాత బకాయిలపై వడ్డీ విధించడం దారుణం.


రూ.2 లక్షలు అప్పు చేశా
- బోయ ఎల్లప్ప, నాగలాపురం, పెద్దకడబూరు

గ్రామంలో నాకు 12.21 ఎకరాలు ఉంది. వర్షాధారంగా పంటలు సాగు చేసుకుంటున్నా. రెవెన్యూ అధికారులు నీటి తీరువా పన్ను కింద అసలు, వడ్డీ కలిపి      రూ.2,05,621 చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఈ భూమిలో గతేడాది పత్తి సాగు చేసినా వర్షాభావంతో పంట చేతికి రాలేదు. రూ.2 లక్షలను అప్పుచేసి చెల్లించే పరిస్థితి ఎదురైంది.


పంటలు లేవు.. పన్నులు ఎలా
- జంగం గంగమ్మ, సింగరాజనహళ్లి, మంత్రాలయం

ముఫ్పై ఏళ్ల కిందట ల్యాండ్‌ సీలింగ్‌ కింద ప్రభుత్వం ఎకరం మెట్ట (వర్షాధారం) భూమిని మంజూరు చేసింది. దీనికి నీటి తీరువా పన్ను కింద రూ.22,557 చెల్లించాలని తాఖీదులు ఇచ్చారు. పంటలే పండని భూమికి పన్ను చెల్లించాలనడం భావ్యం కాదు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని