logo

బడి ఖర్చు భారమే

కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టింది. రెండేళ్ల నష్టాన్ని పూడ్చుకొనేందుకు ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి. 20 శాతం నుంచి 40 శాతం వరకు ఫీజులు భారీగా పెంచేశాయి. యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, బ్యాగ్‌లు, పుస్తకాలు

Published : 29 Jun 2022 02:35 IST

 20 నుంచి 40 శాతం పెరిగిన ఫీజులు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే: కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టింది. రెండేళ్ల నష్టాన్ని పూడ్చుకొనేందుకు ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి. 20 శాతం నుంచి 40 శాతం వరకు ఫీజులు భారీగా పెంచేశాయి. యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, బ్యాగ్‌లు, పుస్తకాలు.. ఇవన్నీ తమ వద్దే కొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీటి ధరలూ 20 శాతం పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు వెంటనే చెల్లిస్తే రాయితీ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 407 ప్రాథమిక, 549 ప్రాథమికోన్నత, 397 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2021-22 ఏడాదిలో 2,58,367 మంది విద్యార్థులు చదువుకున్నారు.
తల్లిదండ్రుల కమిటీలేవీ?
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం గతంలో ఉన్నతాధికారులు కమిటీ వేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణకు ఉత్తర్వు జారీ అయింది. ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం.. ఫీజుల విషయంలో కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులు తయారుచేసిన నివేదికలో.. పాఠశాల యాజమాన్య ప్రతినిధి ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా, ముగ్గురు ఉపాధ్యాయులు, ఐదుగురు తల్లిదండ్రులు సభ్యులుగా ఉండాలని పేర్కొంది. జిల్లాలో ఏ ప్రైవేటు పాఠశాలను పరిశీలించినా తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసినట్లు దాఖలాలు లేవు. విద్యా శాఖ పర్యవేక్షణ కరవవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇంధన ధరలు పెరగడంతో
డీజిల్‌ ధరలు పెరిగాయంటూ బస్సుల ఫీజులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు భారీగా పెంచేశాయి. గతంలో 5 కి.మీ. పరిధిలో ఉంటే రూ.2 వేలు తీసుకుంటుండగా ప్రస్తుతం అదనంగా రూ.వెయ్యి వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటో తరగతి విద్యార్థికి ఏకంగా రూ.25 వేలు ఫీజు నిర్ణయించారు. ఫీజులతోపాటు రవాణా ఖర్చులు పెంచేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.
అన్నీ అక్కడే కొనుగోలు
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పడం లేదు. పిల్లలకు అవసరమైన దుస్తులు, పుస్తకాలు, బూట్లు, టై, బెల్టు ఇతరత్రాలు అన్నీ సదరు పాఠశాలలో కొనుగోలు చేయాల్సిందే. బయట మార్కెట్లో కొనుగోలు చేస్తామంటే ఒప్పుకోవడం లేదు. నిబంధనల ప్రకారం పాఠశాలలో ఇలాంటివి అమ్మేందుకు వీలు లేదు.  ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఆయా విద్యాలయాల్లోనే కౌంటర్లు పెట్టి వస్తువులు విక్రయిస్తున్నా జిల్లా విద్యాశాఖ   చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఒక్కో ప్రైవేటు బడిలో సుమారు 300 నుంచి 3 వేల వరకు విద్యార్థులు చదువుకుంటున్నట్లు అంచనా.


రెండే రెన్యువల్‌ చేసుకున్నాయి
- రంగారెడ్డి, డీఈవో

ఫీజుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రెండు పాఠశాలలు గుర్తింపునకు సంబంధించి రెన్యువల్‌ చేసుకున్నాయి. గుర్తింపు లేని పాఠశాలలు.. గుర్తింపు తీసుకోవాలని తాఖీదులు అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని