logo

అనాథ రక్షక్‌

చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు చాగలమర్రి పట్టణానికి చెందిన వల్లంకొండు సాయిసుదర్శన్‌రావు. తన కాళ్లపై తాను నిలబడుతూనే పది మందికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. మెడికల్‌ స్టోర్స్‌లో చిరు ఉద్యోగం చేస్తూనే

Published : 29 Jun 2022 02:35 IST

చాగలమర్రి, న్యూస్‌టుడే: చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు చాగలమర్రి పట్టణానికి చెందిన వల్లంకొండు సాయిసుదర్శన్‌రావు. తన కాళ్లపై తాను నిలబడుతూనే పది మందికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. మెడికల్‌ స్టోర్స్‌లో చిరు ఉద్యోగం చేస్తూనే అనాథ రక్షక్‌ సేవా ఫౌండేషన్‌ను స్థాపించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడ ఆహార పదార్థాలు మిగిలినా పేదలకు మిగిలినా పంచిపెడుతున్నారు. వృద్ధ, అనాథాశ్రమాలకు వెళ్తూ సేవలందిస్తున్నారు. గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, రక్తం అత్యవసరమైన వారికి రక్తదానం చేస్తూ పలువురితో చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవా ఫౌండేషన్‌ స్థాపించిన రెండేళ్లకే ఆరుసార్లు ఉత్తమ పురస్కారాలు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.
సాయిసుదర్శన్‌రావు చాగలమర్రి మండలంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలు వృథా కాకుండా నిరుపేదలకు చేర్చి వారి ఆకలిని తీర్చుతున్నారు. పట్టణంలో పేదలు, అనాథలు, యాచకులుండే ఆరు ప్రదేశాల్లో ఈ ఆహార పదార్థాలను పంచుతున్నారు. అర్ధరాత్రి తనకు ఫోన్‌ చేసినా శ్రమ అనుకోకుండా స్నేహితులు యువతేజ, నాసిర్‌ పఠాన్‌, అబ్దుల్లా, దొడియం చిన్నసుబ్రహ్మణ్యం, సాదిక్‌ సహాయంతో తానే సొంతంగా వెళ్లి పేదలకు పంచి పెడుతుంటారు. అలాగే కొవిడ్‌ మొదటి వేవ్‌లో కరోనా బాధితులకు దగ్గరుండి మందులు చేరవేశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారికి మెడిసిన్‌, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. చాలా మంది ఇళ్లకు వెళ్లి ఆక్సిమీటర్‌తో వారి ఆక్సిజన్‌ స్థాయిల్ని పరీక్షించడం, వారికి వైద్యులు తెలిపిన మందులు తెచ్చి ఇవ్వడం చేశారు.
* 2019లో అహోబిలంలో నరసింహ స్వామి సేవావాహిని ట్రస్టు చేతుల మీదుగా ఉత్తమ సేవా కార్యకర్తగా పురస్కారం అందుకున్నారు.
* 2021లో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా అవార్డు తీసుకున్నారు.
* 2021లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నేస్తం సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం పొందారు.
* 2021లో నెల్లూరు జిల్లా కావలిలో ఆపద్బాంధవ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సేవా పురస్కారం అందుకున్నారు.
* 2022లో హైదరాబాద్‌లో జయజయసాయి ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నారు.


భవిష్యత్తులో ఆశ్రమాలు పెట్టాలన్నదే లక్ష్యం  
ఎంత సంపాదించినా వెంట తీసుకుపోయేది ఏమీ ఉండదు. మన చుట్టూ సమాజానికి మంచి చేయడంలో దైవత్వం ఉంటుంది. మానవ సేవే మాధవ సేవగా నమ్మి ముందుకెళ్తున్నాను. భవిష్యత్తులో వృద్ధాశమం, అనాథాశ్రమం పెట్టాలన్నదే నా లక్ష్యం. ఆశ్రమాన్ని స్థాపించి అక్కడే సేవలందిస్తూ ఉంటాను.
- వల్లంకొండు సాయి సుదర్శన్‌రావు, అనాథ రక్షక్‌ సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని