logo

నేతల సిఫోర్సు

ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. బదిలీలకు రెండు రోజులే గడువు ఉండటంతో పంచాయతీ ఉద్యోగులు నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అడిగిన వారందరికీ ‘సిపార్సు’ లేఖలు ఇస్తున్నారు. తాము కోరుకున్న కేంద్రానికి బదిలీపై వెళ్లేందుకు

Published : 29 Jun 2022 02:35 IST

 ఉద్యోగుల బదిలీలకు పెద్దఎత్తున పైరవీలు

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. బదిలీలకు రెండు రోజులే గడువు ఉండటంతో పంచాయతీ ఉద్యోగులు నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అడిగిన వారందరికీ ‘సిపార్సు’ లేఖలు ఇస్తున్నారు. తాము కోరుకున్న కేంద్రానికి బదిలీపై వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు నేతలకు ‘సొమ్ములు’ సమర్పించుకుంటున్నారు. జడ్పీ, మండల పరిధిలో 301 మందికి స్థాన చలనం కలగనుంది. చాలామంది ఉద్యోగులు నేతల సిఫార్సు లేఖలతోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి సంబంధిత ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో దరఖాస్తు ఇవ్వడంతో జడ్పీ కార్యాలయానికి సిఫార్సు లేఖలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి.
బదిలీలపై కసరత్తు
సిఫార్సు లేఖలతోపాటు సంబంధిత నేతల నుంచి జడ్పీ అధికారులపై పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు గత రెండు రోజులుగా జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు బదిలీలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలను పక్కనబెడితే ఏ సమస్య వస్తుందన్న ఆందోళనతోపాటు.. పరిగణనలోకి తీసుకుంటే నిబంధన మేరకు ఎలా బదిలీలు చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.
  ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నేతలకు మరింత కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమకు అనుకూలమైన కార్యదర్శులను కొందరు నేతలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. మరికొందరు కార్యదర్శులు తమకు ఇష్టమైన కేంద్రానికి బదిలీ చేయించుకునేందుకు నేతల వద్దకు క్యూ కట్టారు. ఇప్పటికే లేఖలతో కూడిన దరఖాస్తులు డీపీవో కార్యాలయానికి అందజేశారు.
* ఉభయ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల్లో 200 మంది కార్యదర్శులకు స్థాన చలనం కలగనుంది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉమ్మడి జిల్లాలో బదిలీలకు అవకాశముండటంతోపాటు పంచాయతీ గ్రేడుల ఆధారంగా కార్యదర్శులను బదిలీ చేయాల్సి ఉంది. కాగా నిబంధనలు పక్కన పెట్టి మరీ తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
* కార్యదర్శులను బదిలీ చేసే అధికారం కలెక్టరుకు ఉండటంతో సిఫార్సు లేఖలు డీపీవో కార్యాలయానికి చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 53 ఈవోఆర్డీలకుగాను 20 మందికి స్థాన చలనం కలగనుంది. ఇప్పటికే కొందరు ఈవోఆర్డీలు పరస్పర బదిలీలు (మ్యూచువల్‌) చేయించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని