logo

శస్త్రచికిత్సలకు మత్తు విఘాతం

కర్నూలు సర్వజన వైద్యశాలలో ‘మత్తు’ (అనస్థీషియా) ఔషధాల కొరత శస్త్రచికిత్సలకు ఆటంకంగా మారింది. న్యూరో సర్జరీ విభాగంలో శుక్రవారం ముగ్గురికి శస్త్రచికిత్సలు  నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని

Published : 02 Jul 2022 01:56 IST

సర్వజన వైద్యశాలలో  ఔషధాల కొరత

సర్వజన ఆసుపత్రిలో రోగులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కర్నూలు సర్వజన వైద్యశాలలో ‘మత్తు’ (అనస్థీషియా) ఔషధాల కొరత శస్త్రచికిత్సలకు ఆటంకంగా మారింది. న్యూరో సర్జరీ విభాగంలో శుక్రవారం ముగ్గురికి శస్త్రచికిత్సలు  నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని డ్రగ్‌ స్టోర్‌ అధికారులు చెబుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా   ఉంది. మత్తు ఔషధం కొరతతో నెల రోజులుగా కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. విధిలేని పరిస్థితిలో వాయిదా వేయాల్సి వస్తోందని అనస్థీషియా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

నిత్యం 100 నుంచి 120 ఆపరేషన్లు

సర్వజన వైద్యశాలకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. నిత్యం 100 నుంచి 120 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. నెలకు 3 వేలు.. ఏడాదికి 25 వేల నుంచి 30 వేల వరకు ఆపరేషన్లు జరుగుతాయి. జనవరి నుంచి మే వరకు పరిశీలిస్తే 8,107 మేజర్‌, 6,545 మైనర్‌ శస్త్రచికిత్సలు జరిగాయి. ఇటీవల మత్తు ఇంజెక్షన్ల కొరత నెలకొనడంతో శస్త్రచికిత్సలు వాయిదా వేస్తూ ఉన్నారు.

నెల రోజులుగా సరఫరా లేదు - శర్మ, డ్రగ్‌ స్టోర్‌ ఇన్‌ఛార్జి

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి గత నెల రోజులుగా మత్తు మందు ఔషధాలు సరఫరా కావడం లేదు.. శస్త్రచికిత్సలకు ఇబ్బందులు లేకుండా స్థానికంగా ( లోకల్‌ పర్చేజ్‌ కింద) గత 15 రోజులుగా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాం.

పెరిగిన ధరలు.. ఆగిన సరఫరా

* శస్త్రచికిత్స చేసే సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు.. కండరాలు వదులుగా ఉండేలా భిన్నరకాలు ఔషధాలు వినియోగిస్తారు. పెద్దాస్పత్రిలో ప్రధానంగా అత్యవసర విభాగం, గైనిక్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, న్యూరోసర్జరీ, ఈఎన్‌టీ, యూరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ వంటికి కీలక విభాగాలు ఉన్నాయి.

* రెండోదశ కొవిడ్‌ అనంతరం అనస్థీషియా ఔషధాల ధరలు 50 నుంచి 100 శాతం మేర పెరిగాయి. ఫలితంగా గుత్తేదారులు గత కొంతకాలంగా వెక్యురోనియమ్‌, ఎట్రాక్యూరియమ్‌, ఫెటినల్‌ తదితర ఔషధాలు సరఫరా చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి సరఫరా కాకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఆసుపత్రిలో పైన పేర్కొన్న మత్తు మందులు నిత్యం నాలుగు వందల వైల్స్‌ వరకు వినియోగిస్తారు. శస్త్రచికిత్స అయ్యేలోపు రోగికి సుమారు రెండు మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎట్రాక్యూరియమ్‌ మందు ప్రతి పది నిమిషాలకోసారి ఇస్తారు. కండరాలు వదులుగా ఉండేందుకు దీనిని వినియోగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని