logo

తీగ సాగుతోంది... ప్రాణం జారుతోంది

నగర పరిధిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న జగదీశ్‌ (28) విధులు ముగించుకుని తిరిగి నగరానికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులు వీచాయి. ఆ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్తు తీగలు తెగి ద్విచక్ర వాహనంపై పడటంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు.

Published : 02 Jul 2022 01:56 IST

ఈనాడు- కర్నూలు, న్యూస్‌టుడే వెంకటరమణ కాలనీ

కర్నూలు రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో బహుళ అంతస్తుల సముదాయం వద్ద పరిస్థితి ఇది

* నగర పరిధిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న జగదీశ్‌ (28) విధులు ముగించుకుని తిరిగి నగరానికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులు వీచాయి. ఆ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్తు తీగలు తెగి ద్విచక్ర వాహనంపై పడటంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. గతేడాది మే 23న చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటోపై తీగలు పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యుఒడికి చేరారు. ఇలాంటి ప్రమాదాలు ఉమ్మడి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి.

* కాలం చెల్లిన విద్యుత్తు తీగలు యమపాశాల్లా మారుతున్నాయి. ఒరిగిన స్తంభాలు.. చేతికందే ఎత్తులో ఊగుతున్న తీగలు  ప్రమాద సంకేతాలిస్తున్నా శాఖ సిబ్బందికి కనిపించడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభంకావడంతో ఈదురుగాలులకు ఎక్కడ తీగలు తెగి మీదపడతాయోనని ప్రజలు వణికిపోతున్నారు.    

కాలం చెల్లినవే  ఎక్కువ

* కర్నూలు, డోన్‌, నంద్యాల, ఆదోని డివిజన్ల పరిధిలో గృహ వినియోగం, వ్యవసాయానికి ఉపయోగించుకునే త్రీఫేజ్‌ ఎల్‌టీ (లో టెన్షన్‌) 26,218 కి.మీ, 11 కేవీ హైటెన్షన్‌ (హెచ్‌టీ) 25 వేల కి.మీ మేర ఉన్నాయి.

* ప్రస్తుతం డిస్కంలో ప్రతి విద్యుత్తు పరికరం జీవిత కాలం 25 ఏళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా విద్యుత్తు తీగలు 25 ఏళ్ల వరకు జీవితకాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇరవై ఐదేళ్లకు పైబడినవి  ఉమ్మడి జిల్లాలో వందల కి.మీ మేర ఉండి ఉంటాయి.

* నియంత్రిక ( ట్రాన్సుఫార్మర్‌) సామర్థ్యాన్ని బట్టి ఎల్‌టీ తీగల్లో 40 ఆమ్స్‌ దాటకూడదు. ఒక్కోసారి హైవోల్టేజీ  ప్రసరించడంతో పరివర్తకం వద్ద తెగి పడుతున్నాయి. కాలం చెల్లిన తీగలు కావడంతో చిన్నపాటి గాలులకే తెగిపడి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

నిర్వహణ ‘గాలి’  కొదిలేశారు

* ప్రతి సెక్షన్‌ పరిధిలో నిర్వహణకు రూ.25 వేలు డిస్కం అందజేస్తోంది. నిర్వహణలో భాగంగా తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలు కత్తిరించి వదిలేస్తున్నారు. ఇందుకోసం రెండో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు.

* వదులుగా ఉండి వేలాడుతున్న తీగలు సరిచేయడం లేదు. కాలంచెల్లి తెగేందుకు సిద్ధంగా ఉన్నవి  గుర్తించి కొత్తవి బిగించాల్సి ఉంది. ఏ ఒక్కటీ పట్టించుకోవడం లేదు. సమస్యలు వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే తీగ తెగిన చోట మళ్లీ జాయింట్‌ (అతుకులు)వేసి వదిలేస్తున్నారు.

* పాత కాలం నాటి తీగలు ఎన్ని కి.మీ ఉన్నాయో గుర్తించి వాటి స్థానంలో ఎల్‌టీ అయితే 34-40 స్వ్కేర్‌ ఎంఎం, హెచ్‌టీ అయితే 55 స్క్వేర్‌ ఎంఎం మందంతో కొత్త తీగలు బిగించాలి. ఎక్కడా ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

ప్రణాళిక కాగితాలకే  పరిమితం

* ప్రివెంటీవ్‌ నిర్వహణ పేరుతో వర్షాకాలం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వేసవిలో  విద్యుత్తు లైన్ల పరిస్థితిపై సర్వే చేయాలి. దెబ్బతిన్న స్తంభాలు మార్చడం.. పగిలిన పిన్‌.. డిస్క్‌ ఇన్సులేటర్లు కొత్తవి బిగించడం.. కిందకు సాగిన తీగలను లాగి కట్టడం వంటి చర్యలు చేపట్టాలి. కాలం చెల్లిన విద్యుత్తు తీగలు గుర్తించి వాటి స్థానంలో కొత్తవి వేయాలి.

* వేసవిలో ముందస్తు చర్యలు చేపడితే వర్షాకాలం ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు స్తంభాలు పడిపోయినా అందుకు తగ్గ సామగ్రి అందుబాటులో ఉండేలా సిద్ధంగా ఉండాలి. ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితమవుతోంది.

నిబంధనల అమలు  ‘దూరం’

ఎల్‌టీ లైన్‌ అయితే స్తంభాల మధ్య దూరం 40-50 మీటర్లు, 11 కేవీ అయితే 50-60 మీటర్లు దూరం ఉండొచ్చు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల దూరం ఎక్కువగా ఉండటంతో తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. విద్యుత్తు లైను మలుపు తిరిగినచోట్ల.. డీపీ పోల్స్‌ వద్ద స్టే సెట్లు స్తంభాలకు వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేసినా రైతులు సాగు సమయంలో పొలంలో అడ్డొస్తున్నాయని తొలగిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో స్తంభాలు ఒక్కసారిగా ఒరిగి నేలమట్టం అవుతున్నాయి.

పరిహారం  పరిహాసం

విద్యుత్తు ప్రమాదాల్లో మనుషులు మృతి చెందితే ఈఆర్‌సీ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు, పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు చెల్లించాలి. 2018-19లో 19 మందికి రూ.52.70 లక్షలు, 2019-20లో 41 మందికి రూ.1.40 కోట్లు పరిహారం అందజేశారు. 2020-21లో 153 మంది ,  2021-22లో 136 మంది మృతిచెందారు. అప్రమత్తంగా ఉండాలని క్ష్రేతస్థాయి సిబ్బంది చెప్పాం.. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని ఎస్‌ఈ(ఆపరేషన్స్‌) కె.శివప్రసాద్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని