logo

నెమ్మదిగా సాగుతోంది

ఖరీఫ్‌ కాలం మొదలై నెలదాటింది. మేలో ముందస్తు వర్షాలు మురిపించినా తర్వాత చినుకు జాడ లేదు. తొమ్మిది మండలాలు మినహా జిల్లా అంతటా వర్షపాతం లోటు ఉంది. ఇప్పటి వరకు 37,299 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి.

Published : 02 Jul 2022 01:56 IST

37,299  హెక్టార్లలో పంటల సాగు

కర్నూలు సచివాలయం, గూడూరు న్యూస్‌టుడే: ఖరీఫ్‌ కాలం మొదలై నెలదాటింది. మేలో ముందస్తు వర్షాలు మురిపించినా తర్వాత చినుకు జాడ లేదు. తొమ్మిది మండలాలు మినహా జిల్లా అంతటా వర్షపాతం లోటు ఉంది. ఇప్పటి వరకు 37,299 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. జూన్‌ సాధారణ వర్షపాతం 77.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 74.9 మి.మీ.లు కురిసింది. చిప్పగిరి, వెల్దుర్తి, ఆలూరు, ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో సాధారణం కంటే వంద శాతం అధికంగా నమోదైంది.

పత్తికే ప్రాధాన్యం

* ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు 4.10 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 37,299 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అందులోనూ తెల్ల బంగారానిదే పైచేయిగా నిలిచింది. ఈ సీజన్‌లో మొత్తం 29 రకాల పంటల సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 13 రకాల పంటలు సాగు చేశారు.

* వర్షాలు సరిగా లేకపోవడంతో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణంగా విత్తులు విత్తిన 3 నుంచి 7 రోజుల్లో వర్షం పడితే విత్తిన పంట ఇబ్బందులు లేకుండా సజావుగా మొలకలు వస్తాయి. మేలో కురిసిన వర్షాలకు చాలామంది వివిధ పంటలు వేశారు. వర్షాలు లేకపోవడంతో మొలకలు వాడిపోయి ఎండిపోయే పరిస్థితి నెలకొంది.


మంత్రాలయం మండలం మాలపల్లికి చెందిన కౌలు రైతు నాగేంద్ర రెండెకరాల్లో పత్తి సాగు చేశారు. ‘‘ మొలకలు బాగున్నాయి.. చినుకు జాడ లేకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. కూలీ భారం భరించలేక భార్య లక్ష్మి, కుమారుడు శివరాజ్‌తో కలిసి పొలంలో కలుపు తీసేందుకు దుక్కి దున్నతున్నట్లు.. రెండ్రోజుల్లో వర్షంరాకపోతే మొలకలన్నీ వాడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనాడు, కర్నూలు


అంతా ఎండిపోయింది

- వేల్పుల చిన్న తిమ్మన్న, గుడిపాడు

వరుణుడు కరుణిస్తాడన్న నమ్మకంతో ముందస్తుగా పడిన వర్షానికి మూడెకరాల పొలంలో పత్తి సాగు చేశా. 15 రోజులు గడుస్తున్నా వర్షం కురవలేదు. ఎకరాకు 3 ప్యాకెట్ల చొప్పున 9 ప్యాకెట్లు, 500 గ్రాముల ప్యాకెట్‌ రూ.800 ప్రకారం రూ.7,200 వెచ్చించా. కాడి ఖర్చు, విత్తనం కూలీలు అన్ని కలిపి రూ.15 వేలు వెచ్చించా. వర్షం రాకపోవడంతో విత్తిన పత్తి మొలకెత్తకుండా ఎండిపోయింది. మళ్లీ వర్షాలు పడితే రెండోసారి మరో రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని