logo

రూ.కోటి స్థలంపై కన్నేసిన అధికారం

డోన్‌ పట్టణంలో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు తెగించేస్తున్నారు. ఇటీవల పట్టణ సమీపంలో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని గుడి పేరుతో ఓ నాయకుడు ఆక్రమించేందుకు పావులు కదిపారు. దొరపల్లెగుట్ట సమీపంలో ఓ వ్యక్తికి చెందిన పట్టా పొలంలోకి వెళ్లిన ఓ

Updated : 02 Jul 2022 07:18 IST

357 సర్వే నంబరులో జేసీబీతో చదును చేశారు ఇలా

డోన్‌, న్యూస్‌టుడే: డోన్‌ పట్టణంలో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు తెగించేస్తున్నారు. ఇటీవల పట్టణ సమీపంలో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని గుడి పేరుతో ఓ నాయకుడు ఆక్రమించేందుకు పావులు కదిపారు. దొరపల్లెగుట్ట సమీపంలో ఓ వ్యక్తికి చెందిన పట్టా పొలంలోకి వెళ్లిన ఓ నాయకుడు ఆ భూమి తనదేనంటూ ఆక్రమించేశాడు. ఇలా ప్రైవేటు వ్యక్తుల పొలాల్లోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా 357 సర్వే నంబరులో ఖాళీ ఉన్న రూ.కోటి విలువైన స్థలంపై అధికారం కన్నేసి కాలు మోపేందుకు సన్నద్ధమైంది.

పట్టపగలే చదును పనులు

డోన్‌ పట్టణంలో జాతీయ రహదారి పక్కన 357 సర్వే నంబరులో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో సాగు చేసుకోవడానికి ఐదుగురికి ఎనిమిది ఎకరాల వరకు ఇచ్చారు. మరికొంత వాగులో కలిసింది. ఆ పక్కనే ఉన్న స్థలం ఖాళీగా ఉంది. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం... సమీపంలో వెంచర్‌ వేయడంతో ఇక్కడ సెంటు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతోంది. 70 సెంట్లకుపైగా పొలంలో 20 సెంట్ల వరకు వాగు వెళ్తుంది... మిగతా 50 సెంట్ల వరకున్న స్థలం రూ.కోటి వరకు పలుకుతోంది. ఖాళీ స్థలంపై అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకుల కన్ను పడింది. చేతిలో అధికారం ఉంది కదా ! పట్టపగలే జేసీబీతో చదును చేయించే పనులు చేపట్టారు. 60 అడుగుల వరకున్న వాగును పక్కనున్న స్థలాన్ని ఆక్రమించేందుకు మట్టిని తోలారు.

మాదంటే... మాదంటూ

357 సర్వే నంబరులో వాగు వెళ్తుండగా పక్కన కొంత ఖాళీ స్థలం ఉంది. అది చుక్కల భూమి( ఎవరికీ ఎలాంటి పట్టాలు) అని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.కొన్నేళ్ల కిందట పట్టాలు ఇచ్చారు.. తాము చదును చేసుకున్న స్థలంలో పునాదులు తవ్వే పనులు చేపట్టగా అధికార పార్టీ నాయకులు అడ్డుతలుగుతున్నారని కొందరు మహిళలు, పేదలు వాపోయారు. ఆ స్థలం తమదేనంటూ అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్నారు.

ఆ భూమిలోకి ఎవరు వెళ్లినా చర్యలు తప్పవు  - నరేంద్రనాథ్‌రెడ్డి, తహసీల్దార్‌

పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న 357 సర్వే నంబరులో ఉన్న స్థలంలో సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఇందులో కొంత భాగంలో వాగు వెళ్తుంది. అక్కడ ఎవరికీ ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. రెవెన్యూ దస్త్రాల్లో ఎవరూ లేరు. ఎవరైనా స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు, వాగు పోరంబోకులు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని