logo

బిల్లుల మంజూరులో జాప్యం వద్దు

పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రహదారుల శాఖల అధికారులు బిల్లులు సకాలంలో మంజూరు చేయకుంటే చిన్న, మధ్య తరహా గుత్తేదారులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు.

Published : 03 Jul 2022 02:10 IST

మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పక్కన జడ్పీ అధ్యక్షుడు, సీఈవో

కర్నూలు జిల్లా పరిషత్‌, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రహదారుల శాఖల అధికారులు బిల్లులు సకాలంలో మంజూరు చేయకుంటే చిన్న, మధ్య తరహా గుత్తేదారులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. పనులు చేసేందుకు వారు తమ ఆస్తులు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. జడ్పీ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.

గుత్తేదారులకు సామగ్రి కొరత ఉంది.. ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇనుము, ఇసుక, సిమెంట్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

అలగనూరు జలాశయం, వెలగమాను డ్యాంపై పురోగతి గురించి కాటసాని ప్రశ్నించారు. వీటిపై నివేదిక సిద్ధం చేస్తున్నామని కేసీసీ డీఈఈ చెన్నకేశవనాయక్‌ తెలిపారు. స్థాయీ సంఘ సమావేశాలకు ఇతర శాఖల ఎస్‌ఈలు హాజరవుతున్నపుడు, నీటిపారుదల ఎస్‌ఈలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కాటసాని కోరారు.

సీఈవో వెంకటసుబ్బయ్య, జడ్పీ ఉపాధ్యక్షుడు దిల్‌షాద్‌ నాయక్‌, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.

ప్రకృతి సాగుపై మరింత అవగాహన

జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఛైర్మన్‌ పాపిరెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని తొలి దశలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించే విధంగా డ్వామా, డీఆర్‌డీఏ, వ్యవసాయశాఖల సమన్వయంతో రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. సేంద్రియ వ్యవసాయానికి తనవంతు సహకారం అందిస్తామని, స్థలంతోపాటు 25 ఆవులను కేటాయిస్తామని నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డి తెలిపారు. ఉభయ జిల్లాల్లో ఉపాధి పనులు ఆశించినంతగా నిర్వహించడం లేదని జడ్పీ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

యువజన సేవలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించలేదని, కేవలం జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు నిర్వహిస్తున్నామని సెట్కూరు సీఈవో రమణ తెలిపారు.

జిల్లాలో వర్షపాతం నమోదు ఇంతవరకు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. అనంతరం పశుసంవర్ధకశాఖ ప్రగతి, ప్రభుత్వ పథకాలను జేడీ డాక్టరు రామచంద్రయ్య వివరించారు. పశువులకు బీమా సొమ్ము విడుదలకు 10 నెలలు పడుతోందని, ఈ అంశంపై పరిశీలించాలని సభ్యులు కోరారు. జిల్లాలో ఉద్యానశాఖ ప్రగతిపై ఏడీ రఘునాథరెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని