logo
Published : 03 Jul 2022 02:10 IST

ప్రవేశాలకు నిరీక్షణ

 మూడు రోజుల్లో ఆదర్శ పాఠశాలలు పునఃప్రారంభం 

కర్నూలు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకుగాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల గడువు పెంచి తీసుకున్నారు. జూన్‌ చివరి వారంలో ప్రవేశాలకు సంబంధించి లాటరీ పద్ధతిలో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ప్రవేశాలు చేపట్టలేదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు. ఈనెల 4వ తేదీన ప్రారంభం కావాల్సిన బడులు ప్రధాని మోదీ పర్యటనతో 5వ తేదీకి మార్పు చేశారు. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో సీట్లు 80 శాతం పూర్తయినట్లు సమాచారం. అయితే ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌, 6వ తరగతి ప్రవేశాలు ఎప్పుడు చేపడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. లాటరీ నిర్వహణ కోసం అర్హుల జాబితా ఆయా పాఠశాలలకు రాలేదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ఇంటర్‌కి తగ్గిన దరఖాస్తులు

జిల్లా పరిధిలో మొత్తం 16 ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇందులో ఆరో తరగతి సీట్లు 1,600 అయితే 2,994 దరఖాస్తులు, ఇంటర్‌లో 2,560 సీట్లు ఉంటే 2,076 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్‌లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువగా రావడంతో భర్తీ చేసే పనిలో పడ్డారు ప్రధానోపాధ్యాయులు. 5న బడులు ప్రారంభం కావాల్సి ఉండగా ఆదోనిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆదర్శ పాఠశాలల్లో చేపట్టే ప్రవేశాలపై అధికారులకే స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనిపై ఆదర్శ పాఠశాల ఏడీ శివప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన పూర్తయిన మరుసటి రోజు లాటరీ పద్ధతిలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తున్నామన్నారు.

వసతులు అరకొరే

ఒక్కో పాఠశాలల్లో ఆరో తరగతికి 80 నుంచి వంద సీట్లు, ఇంటర్‌లో 80 నుంచి 160 సీట్ల వరకు స్థాయి పెంచారు. అయితే వసతి గృహాల్లో సీట్ల సంఖ్య పెంచకపోవడం గమనార్హం. ఆదర్శ వసతి గృహాల్లో 9 నుంచి ఇంటర్‌ చదివే బాలికలకు వందమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. సీట్ల సంఖ్య పెరిగినా వసతి గృహంలో సీట్ల కేటాయింపు పెంచకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు సీట్ల సంఖ్య పెంచాలని విద్యార్థినులు కోరుతున్నారు.

వీటిలో ఎక్కువ

కర్నూలు జిల్లా పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో పెద్దపాడులో ఉన్న ఆదర్శ పాఠశాలకు అధికంగా 209 దరఖాస్తులు వచ్చాయి. దీంతోపాటు పత్తికొండలో ఉన్న పాఠశాలకు 200 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆస్పరి, గోనెగండ్ల, ఓర్వకల్లు, ఆలూరు, కోడుమూరు, కృష్ణగిరి, మద్దికెర, పెద్దకడబూరు ఆదర్శ పాఠశాలలకు వంద నుంచి 150 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన ఆరు ఆదర్శ పాఠశాలల్లో వందలోపే దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఇంటర్‌లో ఆలూరులో ఉన్న ఆదర్శ పాఠశాలకు 369, గోనెగండ్లకు 365, పెద్దకడబూరుకు 245 పెద్దపాడుకు 241, పత్తికొండకు 237 మంది విద్యార్థినులు దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన 11 ఆదర్శ పాఠశాలల్లో 70 నుంచి 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్‌లో 2,560 సీట్లు ఉంటే 2,076 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని