logo

సివిల్స్‌లో గెలిచి.. ఐపీఎస్‌గా మెరిసి

ఇంజినీరుగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ఎంటెక్‌ పూర్తిచేసిన యువకుడు.. తన నిర్ణయం మార్చుకుని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా సొంతంగా

Updated : 06 Aug 2022 02:59 IST

శిక్షణ లేకుండానే సత్తాచాటిన శశిశేఖర్‌

తల్లి వసంతలక్ష్మితో శశిశేఖర్‌

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : ఇంజినీరుగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ఎంటెక్‌ పూర్తిచేసిన యువకుడు.. తన నిర్ణయం మార్చుకుని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా సొంతంగా సన్నద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో 539వ ర్యాంకు రావడంతో ప్రస్తుతం చెన్నైలో అసిస్టెంట్‌ డీజీఎఫ్టీగా పనిచేస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే మళ్లీ సివిల్స్‌ రాశారు. మే నెలలో ప్రకటించిన ఫలితాల్లో 469వ ర్యాంకు సాధించి.. ఐపీఎస్‌ శిక్షణకు ఎంపికయ్యారు నంద్యాలకు చెందిన శశిశేఖర్‌.

* నంద్యాల పట్టణం సాయిబాబానగర్‌కు చెందిన వసంతలక్ష్మి, సాంబశివ శ్రీనివాసరావు దంపతుల కుమారుడు వైవీఆర్‌ శశిశేఖర్‌ ఐపీఎస్‌ శిక్షణకు ఎంపికయ్యారు. శశిశేఖర్‌ పదో తరగతి స్థానిక కేశవరెడ్డి పాఠశాలలో చదివి రాష్ట్రస్థాయిలో టాఫర్‌గా నిలిచారు. ఇంటర్‌ నంద్యాలలో పూర్తిచేశారు. అనంతరం చెన్నైలో బీటెక్‌, ఎంటెక్‌ చదివారు. ఎంటెక్‌ తర్వాత ఆరు నెలల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు. సివిల్స్‌ రాయలన్న లక్ష్యంతో ఆ ఉద్యోగం మానుకున్నారు. శిక్షణ తీసుకోకుండానే చెన్నైలో అద్దెగదిలో ఉంటూ సిద్ధమయ్యారు. 2019లో మొదటి ప్రయత్నంలో 539వ ర్యాంకు సాధించారు. దీని ఆధారంగా చెన్నైలోనే అసిస్టెంట్‌ డీజీఎఫ్టీ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తూనే రెండోసారి సివిల్స్‌ రాశారు. ఈసారి 469వ ర్యాంకు సాధించడంతో ఐపీఎస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

అమ్మ కష్టంతో అందలం..

శశిశేఖర్‌ తండ్రి 2010లో మృతి చెందారు. అమ్మ వసంతలక్ష్మి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే శశిశేఖర్‌ను ఎంటెక్‌, కుమార్తెను ఎంబీబీఎస్‌ చదివించారు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న కుమారుడిని ప్రోత్సహించారు. బంధువులు, సహోద్యోగులు, శశిశేఖర్‌ స్నేహితులు సహకారం అందించారని వసంతలక్ష్మి తెలిపారు. తన కుమారుడి కష్టానికి తగిన ఫలితం వచ్చిందన్నారు. మరోసారి సివిల్స్‌ రాసి ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ సాధించేందుకు శశిశేఖర్‌ సిద్ధమవుతున్నట్లు ఆమె చెప్పారు.


మనీషా రెడ్డి

ఐపీఎస్‌ శిక్షణకు మనీషారెడ్డి

మహానంది, న్యూస్‌టుడే : మహానంది మండలం నందిపల్లెకు చెందిన మనీషారెడ్డి ఐసీఎస్‌ శిక్షణకు ఎంపికయ్యారు. గత మేలో వెల్లడైన సివిల్స్‌ ఫలితాల్లో ఈమె తొలి ప్రయత్నంలోనే 154వ ర్యాంకు సాధించారు. తాజాగా ఐపీఎస్‌ శిక్షణకు ఎంపికయ్యారు. ముస్సోరి జరిగే ఆరు నెలల శిక్షణకు హాజరవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు మనీషా తాత వంగాల సాగేశ్వరరెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని