logo

ఉన్నది పోయి ఉపాధి కరవై

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ మల్యాల రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన పొలాలు ఇప్పటికే శ్రీశైలం జలాశయం, కేసీ, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాలకు తీసుకున్నారు. తాజాగా హంద్రీ నీవా కాలువ విస్తరణలో భాగంగా మరో

Published : 07 Aug 2022 01:28 IST

ఎత్తిపోతల నిర్మించనున్న ప్రాంతం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ మల్యాల రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన పొలాలు ఇప్పటికే శ్రీశైలం జలాశయం, కేసీ, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాలకు తీసుకున్నారు. తాజాగా హంద్రీ నీవా కాలువ విస్తరణలో భాగంగా మరో ఆరు పంపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మరి కొంత భూసేకరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

హంద్రీలో మునిగిన మల్యాల

రాయలసీమ జిల్లాలను సాగు నీరు అందించాలన్న ఉద్దేశంతో కృష్ణా వరద జలాలు తరలించేందుకు నందికొట్కూరు మండలం మల్యాల గ్రామ సమీపంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని నిర్మించారు. గ్రామంలో 1958 ఎకరాల మేర పొలం ఉంటే జలాశయాలు, దానికి అనుబంధంగా తీసిన కాలువలకు 90 శాతం తీసుకున్నారు. గ్రామంలో 3,200 జనాభా ఉంది.. వీరిలో వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు 1,450 మంది వరకు ఉన్నారు. సాగు భూములు ప్రాజెక్టుల నిర్మాణం నిమిత్తం తీసుకోవడంతో ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

తాజాగా 350 ఎకరాల సేకరణకు నిర్ణయం

* సుజల స్రవంతి పథకానికి 350 ఎకరాలు సేకరించారు. ముచ్చుమర్రి లింక్‌ ఛానల్‌ కాలువ నిర్మాణంలో మరో 200 ఎకరాలు మునిగింది. గతంలో శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో ఇళ్లు, స్థలాలతోపాటు 600 ఎకరాలు ఆ గ్రామస్థులు కోల్పోయారు. కర్నూలు- కడప కాలువ నిర్మాణంలో 300 ఎకరాలు, పంపు హౌస్‌ విద్యుత్తు సరఫరా కేంద్రానికి 20 ఎకరాలు, నందికొట్కూరుకు మంచి నీటి సరఫరాకు 58 ఎకరాలు మొత్తం 1478 ఎకరాలు కోల్పోయారు.

* సుజల స్రవంతి పథకాన్ని ఆరు పంపులతో పంపు హౌస్‌, కాలువ విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణంలో మరో 350 ఎకరాలు కోల్పోనున్నారు. గ్రామానికి చెందిన 90 శాతం పొలాలను జలశయాల నిర్మాణాలకు ఇస్తే కేసీ నీరు తప్ప హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి చుక్క నీరు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఎకరా రూ.40 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం రూ.5 లక్షలు ప్రకటించడం దారుణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు.


ఇప్పటికే రోడ్డున పడ్డా

- షేక్‌షావలి, మల్యాల రైతు

వ్యవసాయమే జీవనాధారం. మా పొలాల్లో విస్తరణ పనులు చేపటొద్దు. ఇప్పటికే కొంత పొలాలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చాం. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. వాటినీ లాగేసుకోవాలని చూస్తున్నారు. పోరాటం చేస్తాం.


ప్రాజెక్టులకు ఇచ్చేశాం కదా

- గూడుసాహెబ్‌, మల్యాల రైతు

గ్రామానికి చెందిన పొలాలన్నీ ప్రాజెక్టులకు ఇచ్చేశాం. మా గ్రామానికి సంబంధించి 480 ఎకరాల పొలం మిగిలింది. విస్తరణలో మరో 350 ఎకరాలు పోతే 130 ఎకరాలే మిగులుతుంది. స్థానికంగా పొలం పనులు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. బతుకుదారి చూపించాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం ఏం బాగాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని