logo

ఈ-పంట.. నమోదుకు తంట

కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 4.10 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 3 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఎక్కువ మంది పత్తి సాగు చేశారు. వేరుసెనగ, కంది, మిరప, ఉల్లి తదితర ఇతర పంటలను రైతులు వేశారు. నంద్యాల జిల్లా పరిధిలో సాధారణ సాగు 2.28 లక్షల

Published : 08 Aug 2022 03:31 IST

 నెలాఖరుదాకా నమోదుకు అవకాశం 

 ఇప్పటివరకు ముందుకు పడని అడుగులు

ప్రయోగాత్మకంగా వివరాలు నమోదు చేస్తూ..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 4.10 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 3 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఎక్కువ మంది పత్తి సాగు చేశారు. వేరుసెనగ, కంది, మిరప, ఉల్లి తదితర ఇతర పంటలను రైతులు వేశారు. నంద్యాల జిల్లా పరిధిలో సాధారణ సాగు 2.28 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 1.19 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఈ.పంట నమోదు పక్కాగా.. పారదర్శకంగా జరగాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. వంద శాతం పంట నమోదు జరిగేలా చూడాలని.. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి.
రెండు రోజుల్లో యాప్‌ వస్తుంది - పీఎల్‌ వరలక్ష్మి, డీఏవో
ఈ.పంట నమోదును ఈసారి పకడ్బందీగా నిర్వహించనున్నాం. సాగులో ఉన్న పంటల వివరాలను యాప్‌లో నమోదు చేయిస్తాం. ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. ఎక్కడా తప్పులు జరగకుండా.. పంట సాగు చేసిన ప్రతి రైతు నష్టపోకుండా పంట నమోదు పక్కాగా జరుగుతుంది.

భూమి ఎక్కువ.. సిబ్బంది తక్కువ
కర్నూలు మండలం రేమట గ్రామ పరిధిలో 2 వేల హెక్టార్ల వరకు పంటలు సాగవుతున్నాయి. ఇంత పెద్ద గ్రామానికి ఒకే ఒక్క గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) ఉన్నారు. ఇతను ఒక్కడే పంట వివరాలు నమోదు చేయాలంటే రెండు నెలలకుపైగా సమయం పడుతుంది. మూడు వారాల వ్యవధిలో సాధ్యమయ్యే పనికాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అదే మండలం బి.తాండ్రపాడులో వెయ్యి హెక్టార్లలోపే సాగు భూమి ఉంది. కానీ అక్కడ ఎంపీఈవో, వీఏఏ ఉన్నారు. తక్కువ సాగు భూమి ఉన్నచోట ఇద్దరు.. ఎక్కువ భూమి ఉన్నచోట ఒక్కరే ఉన్నారు.
అవగాహన కార్యక్రమాలేవీ..
ఈ-క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ వచ్చిన తర్వాత వీఏఏలు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగినై గ్రామ పరిధిలోని సర్వే నంబర్లన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. వివరాలు సిద్ధం చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేసిన పంట పొలాలను సందర్శించాలి. కాగా ఈ.పంట నమోదు చేపట్టేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఒక్క సమావేశం నిర్వహించలేదు. గ్రామస్థాయిలో వీఏఏ, వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్లకు పంట నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు.
అపార నష్టమే..
జులై నెలాఖరు నుంచి కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీటి మునకకు గురయ్యాయి.. 4 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు పంట నష్టం జరిగింది. ఈ నష్టం విలువ రూ.25 కోట్లకుపైగా ఉందని ప్రాథమిక అంచనా వేశారు. వర్షాలు ఇలాగే పడితే పంట నష్టం పెరిగే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా పంట నమోదుకు అడుగులు పడలేదు.  
అందుబాటులో రాక..
ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ఈ.క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించామని, ఆగస్టు 1 నుంచి నెలాఖరులోగా పంటల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. వారం రోజులవుతున్నా ఇప్పటివరకు రాష్ట్ర వ్యవసాయశాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు.
* జులై నెలాఖరులో ప్రయోగాత్మకంగా ఈ.కర్షక్‌ యాప్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. ఈ ఏడాది వెబ్‌ల్యాండ్‌ లింక్‌తో ఈ.కర్షక్‌ యాప్‌ను ఎన్‌ఐసీ అధికారులు సిద్ధం చేశారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు, చిప్పగిరి మండలం ఏరూరు, ఆదోని మండలం నాగలాపురం, తుగ్గలి మండలం రామకొండ, మంత్రాలయం మండలం కాచాపురం గ్రామాల్లో వ్యవసాయాధికారులు ఈ.పంట నమోదుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేశారు. రెవెన్యూ గ్రామాలకు సంబంధించి వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సర్వే నంబర్లలో సగం కూడా డౌన్‌లోడ్‌ కాలేదు. వీఏఏలు లాగిన్‌ అయ్యేందుకు వెళ్తే సర్వర్‌ సమస్యలు తలెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని