logo

నిర్వహణ తీరు.. తారుమారు

ఉమ్మడి జిల్లాలో కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి వరకు 84 కి.మీ.ల మేర 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో పలు లోపాలున్నా అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ రహదారిపై అమకతాడు

Published : 08 Aug 2022 03:31 IST

 జాతీయ రహదారిపై వాహనదారులకు కష్టాలు

డోన్‌, వెల్దుర్తి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి వరకు 84 కి.మీ.ల మేర 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో పలు లోపాలున్నా అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ రహదారిపై అమకతాడు వద్ద టోల్‌ గేటు ఉంది. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దశాబ్దం దాటినా..
గతంలో 7వ నంబరు జాతీయ రహదారిగా ఉన్న దీనిని నాలుగు వరుసలుగా మార్చేందుకు 2007లో పనులు మొదలై 2010లో పూర్తయ్యాయి. ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారిగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఐదేళ్లకోసారి లేయర్‌ వేయాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణం పూర్తై 12 ఏళ్లయినా ఒక్కసారి కూడా లేయర్‌ వేయలేదని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది నుంచి కొన్నిచోట్ల మాత్రమే లేయర్‌ వేశారు. అదీ 40 కి.మీ. మేర లేయర్‌ వేసినట్లు అధికారులు చెబుతున్నారు.

దూపాడు వద్ద భారత్‌ గ్యాస్‌ సమీపంలో రహదారి పగుళ్లు ఇచ్చింది. ఇక్కడే వాహనాలు అటు, ఇటు

వెళ్లేందుకు కూడలి ఉంది. ఇలాంటి చోటే రహదారిపై గుంతలు ఉండటం గమనార్హం.

బ్లాక్‌ స్పాట్లు గుర్తించినా..
జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్నచోట.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. రహదారి పక్కన, మధ్యలో స్టిక్కరింగ్‌ వేయాల్సి ఉంటుంది. వేగ నిరోధకాలుగా తెలుపు రంగుతో లైన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్నిచోట్ల అవి లేవు. వేసినచోటా నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇటీవల వెల్దుర్తి, కర్నూలు వద్ద ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఎన్‌హెచ్‌ 44పై ప్రమాదాలు జరిగితే వెంటనే క్షతగాత్రులను తరలించేందుకు రెండు అంబులెన్సులు ఉండాలి. ఈ మొత్తం రహదారికి ఒకటి మాత్రమే ఉండటం గమనార్హం.

పెద్దటేకూరు వద్ద రహదారికి కొన్నిచోట్ల మరమ్మతులతో మమ అనిపించారు. బొమ్మిరెడ్డిపల్లె సమీపంలోనూ

దెబ్బతింది. మధ్యలో గుంతలు పడ్డాయి.

త్వరలోనే అన్ని పనులు చేయిస్తాం
- శ్రావణ్‌కుమార్‌, మేనేజర్‌, ఎన్‌హెచ్‌ 44
జాతీయ రహదారిపై కొన్నిచోట్ల లేయర్‌ పనులు పూర్తి చేశారు. గతంలో ఉన్న గుత్తేదారు స్థానంలో కొత్తవారు వచ్చారు. వారు త్వరలోనే లేయర్‌ పనులు మొదలుపెడతారు. రహదారిపై గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయించాం. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ఎక్కడైనా గుంతలున్నా మళ్లీ పనులు చేయిస్తాం. పనిచేయని సిగ్నల్‌ లైట్లకు మరమ్మతులు చేపడుతాం.
నిర్మాణంలోనే లోపాలు

* రహదారి నిర్మాణంలో లోపాల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్‌ నుంచి దొరపల్లె గ్రామానికి జాతీయ రహదారి మీదుగా వెళ్లేందుకు కిలోమీటరుకుపైగా దూరం వెళ్లి అక్కడ తిరిగి రావాల్సి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. దొరపల్లె వంతెన వద్ద నుంచి నాలుగైదు గ్రామాలకు వెళ్లేందుకు కూడలి లేకపోవడంతో డివైడర్‌ను దాటి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
* డోన్‌ నుంచి వెల్దుర్తిలోకి వెళ్లాలంటే రహదారి దాటాలి. ఇక్కడ అప్పట్లోనే వంతెనలు ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందులు తప్పేవని ప్రజలు చెబుతున్నారు. కర్నూలులోనూ పలుచోట్ల మొదట్లో కూడళ్ల వద్ద వంతెనలు లేకపోవటంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
* జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడినచోట మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా రహదారి దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయాలి. కానీ చాలాచోట్ల గుంతలు పడి, పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డా పట్టించుకున్నవారే లేరు.

వెల్దుర్తి సమీపంలోని చెరుకులపాడు కూడలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సిగ్నల్‌ లైటు ఉన్నా పనిచేయడం లేదు. అల్లుగుండు సమీపంలోనూ.. తాటిమాను  కొత్తూరు సమీపంలోనూ సిగ్నల్‌ లైట్లు పనిచేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని