logo

అశ్వాలపై విశ్వాసం.. విశేష సంప్రదాయం

‘‘మద్దికెరను పాలించిన యాదవరాజులు విజయదశమి రోజున మూడు వర్గాలకు చెందిన వారు గుర్రాలపై సంప్రదాయ దుస్తులతో మంది, మార్బలం ఆయుధాలతో వెంటరాగా వేడుకగా ఊరేగింపు నిర్వహిస్తారు. మజరా గ్రామమైన బొజ్జనాయునిపేట గ్రామంలో వారు నిర్మించుకున్న బోగేశ్వరాలయంలో స్వామి

Published : 08 Aug 2022 03:31 IST

 ఏటా గుర్రాల పార్వేట  పోషణపై ఆసక్తి

గుర్రాల పోషణలో యాదవరాజ వంశీకులు

‘‘మద్దికెరను పాలించిన యాదవరాజులు విజయదశమి రోజున మూడు వర్గాలకు చెందిన వారు గుర్రాలపై సంప్రదాయ దుస్తులతో మంది, మార్బలం ఆయుధాలతో వెంటరాగా వేడుకగా ఊరేగింపు నిర్వహిస్తారు. మజరా గ్రామమైన బొజ్జనాయునిపేట గ్రామంలో వారు నిర్మించుకున్న బోగేశ్వరాలయంలో స్వామి వారికి విశేష పూజల అనంతరం అక్కడి నుంచి పోటీలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీల్లో మద్దికెరలోని పార్వేట మిట్టను ఎవరు ముందుగా చేరుకుంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. అనంతరం వారు గ్రామం నడిబొడ్డున నిర్వహించే గుర్రాల సవారీని తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తారు’’.
మద్దికెర, న్యూస్‌టుడే: పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం.. నేటికీ కొనసాగిస్తున్నారు. అశ్వాలను పోషిస్తూ.. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుతూ వస్తున్నారు. ఏటా దసరా ఉత్సవాల్లో గుర్రాల పార్వేట వేడుకలు నిర్వహిస్తూ అనాదిగా వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా కాపాడుతున్నారు.  రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎంతో వేడుకగా జరిగే దసరా గుర్రాల పార్వేట వేడుకల సమయంలో వినియోగించేందుకు అవసరమైన గుర్రాలు పెంచుకునేందుకు మూడు వర్గాల వారు ఎంతో ఆసక్తి చూపుతారు. చిన్ననగరి, పెద్దనగరి, వేమనగారి వర్గీయులు ఒక్కో వర్గం వారు కనీసంగా నాలుగు అశ్వాలు పెంచుకుంటున్నారు. ఇలా మూడు వర్గాల వారు 12కు పైగా గుర్రాలను ఎంతో ఇష్టంగా వాటిని పోషిసస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పోటీల సమయంలో కాళ్లు విరిగి అవి మృతిచెందిన ఘటనలూ లేకపోలేదు. బొజ్జనాయునిపేట నుంచి మద్దికెరకు 3 కి.మీ. దూరం ఉంది. దారి సరిగా లేకపోవటంతో గుర్రాలతో పాటు, వాటిపై సవారీ చేసే వారు సైతం గాయపడి క్షతగాత్రులుగా మిగిలారు.
వీరంతా మద్దికెరలోని చిన్న నగరికి చెందిన యాదవరాజ వంశీకులు. వీరికి పూర్వీకుల నుంచి ఇళ్లలోనే గుర్రాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వేడుకల్లో వీటిపై వారి కుటుంబీకులు ఊరేగింపు నిర్వహిస్తూ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీని కోసం వారే స్వయంగా ఎంతో శ్రద్ధతో వీటిని పెంచుకుంటున్నారు. అవసరమైతే బయటి నుంచి అశ్వాలు తెచ్చుకుని పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు కాస్త సాహసంతో కూడినవనే చెప్పాలి.

గుర్రం విలువ రూ.80 వేలు
మద్దికెరలో ఆ కుటుంబాల వారు గుర్రాలను పెంచుకునేందుకు మేలురకం వాటినే కొనుగోలు చేస్తారు. ఆపై వాటి కోసం రోజు వారీ ఖర్చు కూడా అధికమే అంటూ నిర్వాహకులు చెపుతున్నారు. ఒక్కో గుర్రం విలువ కనీసంగా రూ.80 వేల వరకు ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వీటిని పెంచేందుకు వారు వెనుకాడడం లేదు.
ఇది ఆనవాయితీగా వస్తోంది
- కృష్ణమూర్తి, చిన్ననగరి, మద్దికెర
మా కుటుంబాలకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయితీని కొనసాగించేందుకు అశ్వాలు అవసరం. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంప్రదాయం పాటిస్తున్నాం. వాటిపై ఉన్న మక్కువతో ఏళ్ల తరబడి గుర్రాలను పోషిసున్నాం. మా కుటుంబాల్లో పిల్లలు సైతం వీటిని అధిరోహించేలా శిక్షణ పొందుతున్నారు. ఇటీవలే వీటితో వ్యవసాయం చేయవచ్చని ఆ దిశగా వాటికి శిక్షణ ఇచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని