logo

తుంగా తీరం.. ఆధ్యాత్మిక సంబరం

రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన మహోత్సవాలు ఈరోజు నుంచి 16వ తేదీ వరకు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అధికారులు వసతి, ఉచిత భోజనం, దర్శనం, పరిమళ

Published : 10 Aug 2022 01:49 IST

నేటి నుంచి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

నూతనంగా నిర్మించిన మధ్వ మార్గ కారిడార్‌

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన మహోత్సవాలు ఈరోజు నుంచి 16వ తేదీ వరకు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అధికారులు వసతి, ఉచిత భోజనం, దర్శనం, పరిమళ ప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు, జ్ఞానకార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉత్సవాల సందర్భంగా రాత్రి ఉత్సవమూర్తి రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంబారి, గజ, సింహ, అశ్వంతో పాటు వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగించనున్నారు. 12న పూర్వారాధన, 13న మధ్యారాధన సందర్భంగా బృందావనానికి విశేషంగా ఫలపంచామృతాభిషేకం నిర్వహిస్తారు. 14న మహారథోత్సవం నిర్వహిస్తారు.

సాయంత్రం  సాంస్కృతిక పండగ

నిత్యం సాయంత్రం యోగీంద్ర వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బెంగళూరు, చెన్నై, నంజన్‌గూడ, హుబ్లీ, విజయవాడ, ఉడిపి, రాయచూరు, కర్నూలు, తిరుపతి, శివమొగ్గ ప్రాంతాల నుంచి నృత్య బృందాలు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శన నిర్వహించనున్నారు. అన్నమయ్య సంకీర్తనలు, వీణావాదన, ఓకల్‌, శ్రీనివాస కల్యాణం నృత్యరూపకం, దాసవాణి వంటి భక్తిగీతాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రైల్వే, బస్సు మార్గాల ద్వారా చేరుకోవచ్చు

కర్నూలు నుంచి బస్సు మార్గం ద్వారా కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయానికి చేరుకోవచ్చు. తుంగభద్ర రైల్వే మార్గం ద్వారా 14 కిలోమీటర్ల ప్రయాణించి  చేరుకోవచ్చు. కర్ణాటక నుంచి రాయచూరు మీదుగా   రావచ్చు. నాగులదిన్నె నది పూర్తి కావడంతో అక్కడి నుంచి తెలంగాణ వారు మంత్రాలయం చేరుకునేందుకు మార్గాలున్నాయి. బల్లారి నుంచి ఆదోని మీదుగా చేరుకోవచ్చు.

వసతి ఏర్పాటు

భక్తుల కోసం మఠం ఆధ్వర్యంలో వేయ్యికి పైగా వసతి గదులు ఉన్నాయి. భక్తులు నేరుగా వచ్చి బృందావన్‌ గార్డెన్ల వద్ద వసతిని పొందవచ్చు. మఠం నిర్ణయించిన సాధారణ అద్దెలతో విడిది పొందవచ్చు.

ఉచిత దర్శనం,  భోజనం..

మఠంలో ఉచిత దర్శనం, భోజనం లభిస్తోంది. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనం ఉచితంగానే ఉంటుంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది. నిత్యాన్నదానం ఉచితంగానే నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు, సాయంత్రం ఏడు నుంచి రాత్రి పదిగంటల వరకు ఉంటుంది. భక్తుల కోసం 4 లక్షలకుపైగా పరిమళ ప్రసాదాలను తయారు చేశారు. వీటిని ప్యాకెట్‌ రూ.25 చొప్పున మఠం ముందుభాగంలో విక్రయిస్తుంటారు.

ప్రారంభోత్సవాలు..

మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించిన నిర్మాణాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం పద్మనాభ, నరహరితీర్థ, హరికథామృతసార మ్యూజియం, పునఃనిర్మించిన బృందావన్‌గార్డెన్‌, బృహత్‌ రజత మండపం, రెనివేషన్‌ చేసిన రజత రథోత్సవం, తులసి గార్డెన్‌, రాఘవేంద్రస్వామి బృందావనానికి నవరత్న కవచం, మూల రాములకు బృహత్‌ రజత మంటపం తదితరాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ప్రారంభించనున్నారు. రూ.9 కోట్లతో మహాముఖద్వారం, మధ్య మార్గ కారిడార్‌లు ప్రారంభించనున్నారు.

ఎత్తు పెంచిన మఠం నది ఒడ్డున ఏర్పాటు చేసిన దుస్తులు మార్చుకునే తాత్కాలిక షెడ్డు


రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి

ప్రతి సంవత్సరం ఉత్సవాల సందర్భంగా రాఘవేంద్ర అనుగ్రహ అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంతి డీజీపీ రొద్దం ప్రభాకర్‌రావు (ప్రస్తుతం మఠం ఏవోగా పనిచేస్తున్నారు), దేవాదాయ శాఖ విశ్రాంత ఎండోమెంట జాయింట్‌ కమిషనర్‌ ఎల్‌మాధవశెట్టి(ప్రస్తుతం మఠం ఏఏవోగా పనిచేస్తున్నారు), కర్నూలుకి చెందిన న్యూరో సర్జన్‌ డాక్టర్‌ జీఆర్‌ చంద్రశేఖర్‌, కర్ణాటక హుబ్లీకి చెందిన కార్డియాలజీ స్పెషలిస్టు డాక్టర్‌ వీజీ నాడగౌడ, మఠం దాత ఎం.సోమశేఖర్‌, మంత్రాలయానికి చెందిన విద్వాన్‌ అర్చక కృష్ణాచార్‌, చెన్నైకి చెందిన విద్వాన్‌ ఆర్‌ కృష్ణమూర్తి శాస్త్రి, త్రివేంద్రానికి చెందిన విద్వాన్‌ కేఈ ధరణీధరన్‌, బెంగళూరికి చెందిన విద్వాన్‌ మలాగి రామాచార్‌, మైసూరికి చెందిన విద్వాన్‌ సీహెచ్‌ శ్రీనివాసమూర్తిలకు ఇవ్వనున్నారు.


చూడదగినవి..

మంత్రాలయానికి వచ్చిన భక్తులు సాధారణంగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను ముందుగా దర్శించుకుంటారు. ఆ తర్వాత రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల సేవలు, సంస్థాన పూజల్లో భాగంగా నిర్వహించే మూలరాముల పూజలు, రాత్రి రథోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వీటిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్మకం. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి స్వయంగా చెక్కిన వేంకటేశ్వర స్వామి శిల పాతూరులో ఉంది. అక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంగా నిర్వహిస్తారు. కర్ణాటక సరిహద్దుల్లో పంచముకి ఆంజనేయస్వామి, బిచ్చాలలో రాఘవేంద్రస్వామి శిష్యుడైన అప్పనాచార్‌ బృందావనం చూడదగిన ప్రాంతాలు. మఠంలో మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకునే విధంగా మఠానికి ఉత్తర ద్వారాన మ్యూజియం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు