logo

ఠాణాలో ఇంటి దొంగలు

పోలీసు శాఖ గోప్యత పట్టుతప్పుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై శాఖాపరంగా తనిఖీల వివరాలు ముందుగా ఉప్పందుతున్నాయి. అంతర్గత నిర్ణయాలు.. ఉన్నతాధికారుల ఆదేశాలు బహిర్గతమవుతున్నాయి. మూడ్రోజుల కిందట జరిగిన కానిస్టేబుల్‌ హత్యకు ఇవే

Published : 10 Aug 2022 01:49 IST

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొందరు ఖాకీల అండ

ఈనాడు - కర్నూలు, న్యూస్‌టుడే నంద్యాల నేరవిభాగం: పోలీసు శాఖ గోప్యత పట్టుతప్పుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై శాఖాపరంగా తనిఖీల వివరాలు ముందుగా ఉప్పందుతున్నాయి. అంతర్గత నిర్ణయాలు.. ఉన్నతాధికారుల ఆదేశాలు బహిర్గతమవుతున్నాయి. మూడ్రోజుల కిందట జరిగిన కానిస్టేబుల్‌ హత్యకు ఇవే దారి తీసి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కానిస్టేబుల్‌ హత్యకు ఇవే కారణమా

నంద్యాలలో రౌడీషీటర్ల కదలికలు, సుపారీలు, పంచాయితీల్లో రాజీ కుదుర్చుతున్న వారి సమాచారం డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌ ద్వారా ఉన్నతస్థాయికి చేరినట్లు బయటకు పొక్కడమే హత్యకు కారణమైందా అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాల సమాచార సేకరణలో సదరు కానిస్టేబుల్‌ కీలక పాత్ర పోషించేవారు.

జిల్లా బాస్‌ హెచ్చరించినా

కానిస్టేబుల్‌ హత్యకు మూడ్రోజుల ముందు పోలీస్‌బాస్‌ కారుకు బొమ్మలసత్రం వద్ద ఓ మందుబాబు అడ్డుగా వచ్చినట్లు సమాచారం. రోడ్లపైకి మందు బాబులు వస్తుంటే మీరేం చేస్తున్నారంటూ సెట్‌ కాన్ఫరెన్సులో పోలీసు బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ రోడ్లపై తనిఖీలు పెరగాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కానిస్టేబుల్‌ హత్యకు గురికావడం చూస్తే విధుల్లో ఖాకీల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది.

స్థిరాస్తి వ్యాపారంపైనే దృష్టి

కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకు పోలీసు సిబ్బంది స్థిరాస్తి వ్యాపారంలో మునిగిపోయారు. నంద్యాలలో లూప్‌లైన్‌ పోస్టింగ్‌ ఇచ్చినా చాలంటూ సిబ్బంది నేతలతో పైరవీలు చేస్తున్నారంటే స్థిరాస్తి వ్యాపారమే కారణంగా తెలుస్తోంది.   నంద్యాల ఆసుపత్రిలోని అవుట్‌ పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ స్థిరాస్తి వ్యాపారంపై ప్రధాన దృష్టి సారించి విధులను నిర్లక్ష్యం చేయడంతో వేటు వేశారు.

ఇవిగో ఉదాహరణలు

* ‘‘ పోలీసు సిబ్బంది తనిఖీలకు వస్తున్నారు.. సరకు దాచిపెట్టుకోవాలని’’ నంద్యాల జిల్లా కేంద్రంలో రెండో పట్టణ ఠాణా కానిస్టేబుల్‌ గుట్కా వ్యాపారికి చరవాణిలో చెప్పిన ఆడియో 2021 ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ సంభాషణ పోస్టు చేసిన ఓ యూట్యూబ్‌ విలేకరి కానిస్టేబుల్‌ను డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. డబ్బులివ్వని కారణంగా ఆ ఆడియోను వైరల్‌ చేయడంతోపాటు పోలీస్‌ బాస్‌కు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్‌పై వేటు పడింది. పగ పెంచుకున్న కానిస్టేబుల్‌ డబ్బులిస్తామని ఆ విలేకరిని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి హత్య చేయడం గతేడాది చర్చనీయాంశంగా మారింది.

* ఏడాదిన్నర కిందట మట్కాపై పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో దొరికిన చరవాణి వాట్సప్‌లో పోలీసు గ్రూపు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆరాతీస్తే మట్కా బీటర్‌ కుమార్తె నంద్యాల మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ గ్రూపులో ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు మట్కాపై రైడింగ్‌ అని ఇచ్చే సందేశం గ్రూపులో రాగానే బీటర్లు అప్రమత్తం అవుతున్నట్లు గుర్తించారు. బీటర్‌ కుమార్తెను గ్రూపులో యాడ్‌ చేసిన అడ్మిన్లుగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లపై అప్పట్లో వేటు పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని