logo

పెద్దపులికి ప్రాణసంకటం

పులుల ఖిల్లాగా పేరొందిన నల్లమలలో పులులకు ప్రాణసంకటం తప్పటం లేదు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు పన్నే ఉచ్చులు వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. అటవీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్లు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం

Updated : 10 Aug 2022 06:17 IST

పెద్దపులి కళేబరం (పాత చిత్రం)

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పులుల ఖిల్లాగా పేరొందిన నల్లమలలో పులులకు ప్రాణసంకటం తప్పటం లేదు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు పన్నే ఉచ్చులు వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. అటవీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్లు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వెస్ట్‌బీట్‌లో బుడుగుల వాగు సమీపంలో నల్లమలలో పులుల వరుస మరణాలు రక్షణ వ్యవస్థలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అధికారులు గోప్యంగా శవపరీక్ష నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 8వ తేదీ నంద్యాల జిల్లా వెలుగోడు రేంజ్‌లో మృతి చెందిన పెద్దపులి ఏప్రిల్‌లో అటవీ అధికారుల కెమెరా ట్రాప్‌లో కనిపించింది. ఉచ్చు నుంచి తప్పించుకున్న పెద్దపులి, ఆ ఉచ్చు మెడకు బిగుసుకుని జీవనపోరాటం చేసింది. అయితే అస్వస్థతకు గురై మృతి చెందిందా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగు దాటేటప్పుడు మృతి చెందిందా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. తెలుగుగంగ కాల్వలో ఇప్పటిదాకా రెండు, మూడు పులుల మృతదేహాలు కొట్టుకురావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా మృతిచెందాయా, ఉచ్చుల్లో చిక్కి మృతిచెందిన వాటిని అలా పడేస్తున్నారా అనేది తేలటం లేదు. ఈ ఏడాది మేలో బైర్లూటి రేంజ్‌, పెద్ద అనంతాపురం బీట్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందింది. పురుగులు పట్టి కుళ్లిపోయిన కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించి పోస్ట్‌మార్టం చేసి గోప్యంగా దహనక్రియలు నిర్వహించారు. గతేడాది నవంబరులో చలమరేంజ్‌ రుద్రవరం బీట్‌ పరిధిలోని టీజీపీ ఉపకాలువలో గుర్తించిన పులి మృతికి కారణాలు ఇంకా తేలలేదు. 2018లో శ్రీశైలం రేంజ్‌ పెచ్చెర్వు బీట్‌ నరమామిడి చెరువు ప్రాంతంలో ఓ పెద్ద పులి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రెండు పులుల మధ్య  జరిగిన ఆధిపత్య పోరాటంలో గాయపడిన పెద్ద పులి కోలుకోలేక మృతి చెందినట్లు వివరించారు.


ఉచ్చు వేసి ఊపిరి తీసి

ఉచ్చు వేయడంతోనే పెద్దపులి మృతి చెందినట్లు ఆత్మకూరు ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో విజ్ఞేష్‌ అపావ్‌ తెలిపారు. వెలుగోడు రేంజ్‌ బుడుగులవాగు ప్రాంతంలోని ఓ మత్స్యకారుడు  వాగుకు సమీపంలో సోమవారం సాయంత్రం పెద్దపులి ఉండటం చూశారన్నారు. కదలిక లేకపోవడంతో దగ్గరలోని బేస్‌క్యాంప్‌కు సమాచారం ఇచ్చారన్నారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి శ్రీనివాసులు, బృందం అక్కడకు వెళ్లారన్నారు. పరిశీలించి ఉచ్చులో చిక్కుకోవడంతోనే మృతి చెందినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారన్నారు. ఎన్‌టీసీఏ నిబంధనల మేరకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించామన్నారు. పులి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో నాలుగేళ్లలో 60 శాతం పులులు వృద్ధి చెందాయన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని