logo

నైపుణ్యంతోనే లక్ష్య సాధన

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నైపుణ్యంతో విద్యనభ్యసించినప్పుడే లక్ష్య సాధనను సులువుగా చేరుకోవచ్చని జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య రంగ జనార్ధన్‌ పేర్కొన్నారు. నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ డేను ఛైర్మన్‌

Published : 12 Aug 2022 02:58 IST

జేఎన్‌టీయూ వీసీ రంగ జనార్ధన్‌ను సన్మానిస్తున్న జి.పుల్లయ్య తదితరులు

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నైపుణ్యంతో విద్యనభ్యసించినప్పుడే లక్ష్య సాధనను సులువుగా చేరుకోవచ్చని జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య రంగ జనార్ధన్‌ పేర్కొన్నారు. నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ డేను ఛైర్మన్‌ మోహన్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. కానీ స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. ఇలాంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించాలని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సూచించారు. 2018-19లో చేరి  ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్సు, ఈసీఈ విభాగాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన ధరణి కుమార్‌రెడ్డి కళాశాల టాపర్‌గా, బ్రాంచి, యువత టాపర్‌గా నిలిచి మూడు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి.పుల్లయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.శ్రీనివాసరావు, టీసీఎస్‌ గ్లోబల్‌ హెడ్‌ చక్రవర్తి, సీటీఎస్‌ హెడ్‌ చంద్రశేఖర్‌, జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ భవాని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎంతో సంతోషంగా ఉంది  - ధరణి కుమార్‌రెడ్డి
ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 9.55 జీపీఏ సాధించి బ్రాంచి, యువత, కళాశాల టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. మాది జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామం. నాన్న వెంకటసుబ్బారెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉత్తమ మార్కులు సాధించడంతోపాటు రెండు నెలల కిందట జరిగిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో విప్రో కంపెనీలో ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం వచ్చే ఉద్యోగం సాధించా.


కుటుంబానికి అండగా ఉంటా   - డి.శేఖర్‌
సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 9.34 జీపీఏ సాధించా. నాన్న శ్రీనివాస్‌ ఎలక్ట్రీషియన్‌ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయన పడిన కష్టమే నేడు.. నేను అందుకున్న బంగారు పతకం. రెండు నెలల కిందట జరిగిన ప్లేస్‌మెంట్‌లో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించా. ఇన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బంది పడినా ప్రస్తుతం కుటుంబానికి అండగా నిలుస్తా.


బంగారు పతకం రావడం సంతోషకరం
- ఎ.సురేష్‌, బేతంచెర్ల

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో 8.91 జీపీఏతో బ్రాంచి టాపర్‌గా రాణించి బంగారు పతకం అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం విప్రోలో ఉద్యోగం వచ్చింది. భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నాన్న రామకృష్ణ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన కష్టపడి చదివించడంతో ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా.


ఎంతో గర్వంగా ఉంది  

- ఇ.లహరి, కర్నూలు
కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌ బ్రాంచిలో 9.31 జీపీఏతో బ్రాంచి టాపర్‌గా రాణించా. అధ్యాపకుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో బంగారు పతకం సాధించినందుకు గర్వంగా ఉంది. బాలికల విభాగంలోనూ బ్రాంచి టాపర్‌గా నిలిచి బంగారు పతకం అందుకోవడం ఆనందంగా ఉంది. ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ.6.2 లక్షల వేతనం వచ్చే ఉద్యోగం వచ్చింది. నాన్న చంద్రశేఖర్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నా వేతనం కుటుంబానికి తోడైతే కష్టాల నుంచి బయటపడతాం.


ఫలితం దక్కింది  - ఎం.సాయిప్రకాష్‌ రెడ్డి, సూగూరు
చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల వాతావరణం, ఇంజినీరింగ్‌ కళాశాలలోని వాతావరణం వేరేగా ఉంటుంది. ఇంజినీరింగ్‌లో చేరిన సమయంలో రాణిస్తానో లేదో అనే భయం ఉండేది. అధ్యాపకులు, మిత్రుల సహకారంతో ఈసీఈ బ్రాంచిలో 9.27 జీపీఏ తెచ్చుకుని బ్రాంచి టాపర్‌గా నిలిచా. ఇది కష్టానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నా. నాన్న హనుమంతరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మంచి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇంకా.. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని