logo

హాజరు.. నమోదుకు బేజారు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదులో పారదర్శకత కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. గతంలో వినియోగిస్తున్న యాప్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించి స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌ 2.0 వెర్షన్‌ను వినియోగంలోకి తెచ్చింది.

Updated : 12 Aug 2022 06:56 IST

 కొత్త యాప్‌ తెచ్చిన విద్యాశాఖ  

ప్రధానోపాధ్యాయుల నిర్ధారణ తప్పనిసరి

విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్న ఉపాధ్యాయుడు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదులో పారదర్శకత కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. గతంలో వినియోగిస్తున్న యాప్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించి స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌ 2.0 వెర్షన్‌ను వినియోగంలోకి తెచ్చింది. విద్యార్థుల హాజరుకు సంబంధించి సమగ్ర సమాచారం తెలియడం కోసం ఇంటిగ్రేడెట్‌ యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు వినియోగించిన యాప్‌ స్థానంలో నవీకరించిన దానిని చరవాణుల్లో పొందుపర్చి ఈనెల 10 నుంచి విద్యార్థుల హాజరు నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొత్త వెర్షన్‌లో హాజరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
 *తాజా యాప్‌లో విద్యార్థుల హాజరును ప్రధానోపాధ్యాయులు నిర్ధారించాల్సి ఉంది. యూజర్‌ ఐడీతో పాటు కొత్తగా పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు సైతం త్వరలో ఇందులోనే తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

తప్పని తిప్పలు
కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో సర్వరు మొరాయించడంతో మొదటి రోజు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చరవాణులకు సిగ్నల్స్‌ అందకపోవడం, అంతర్జాలం సరిగా పనిచేయకపోవడం, సర్వర్‌ మొరాయింపు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చెంచు గూడేల్లో చరవాణులు పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెచ్చిన కొత్త వెర్షన్‌ అయినా సక్రమంగా పనిచేస్తుందో లేదోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాటిమాటికీ మార్పులు..
స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌లో ఇప్పటి వరకు పలుమార్లు మార్పులు, చేర్పులు చేశారు. మాటిమాటికీ వెర్షన్లు మార్చడం కొత్త నిబంధనలు పెట్టడంతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ 1.0 నుంచి 1.1, 1.2, 1.3, 1.4, 1.5 అంటూ ఆరు వెర్షన్లు అప్‌డేట్‌ చేశారు. తాజాగా 2.0 వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఉదయం 10.30 గంటలకే హాజరు పూర్తి చేయాలన్న నిబంధన పెట్టారు. ఆలస్యమైతే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని