logo

తెలదొరలను తరిమిన తెర్నేకల్‌

1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తెల్లదొరలను తెర్నేకల్‌ వాసులు తరిమికొట్టారు. 130 ఏళ్ల కిందట 1801లో బ్రిటిష్‌ వారిని ఎదురించిన కారణంగా గ్రామానికి చెందిన ముత్తుకూరు గౌడప్ప, కరణం శంకరయ్య, గ్రామ రెడ్డి అంకిరెడ్డిలను ఊరి వాకిలికి ఉరితీశారు.

Updated : 14 Aug 2022 05:43 IST

సిపాయిల తిరుగుబాటుకు ముందే పోరు

గ్రామంలో ముత్తుకూరు గౌడప్ప విగ్రహం

దేవనకొండ, న్యూస్‌టుడే: 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తెల్లదొరలను తెర్నేకల్‌ వాసులు తరిమికొట్టారు. 130 ఏళ్ల కిందట 1801లో బ్రిటిష్‌ వారిని ఎదురించిన కారణంగా గ్రామానికి చెందిన ముత్తుకూరు గౌడప్ప, కరణం శంకరయ్య, గ్రామ రెడ్డి అంకిరెడ్డిలను ఊరి వాకిలికి ఉరితీశారు.

ఫిరంగులతో కోట ధ్వంసం

తెర్నేకల్‌ వాసులు బ్రిటిష్‌ సేనలను తరిమికొట్టిన ఘటన బ్రిటిష్‌ వైస్రాయి విలియం థాక్రేకు కోపం తెప్పించింది. వెంటనే ఆదోని నుంచి 1,000 మంది సైనికులను గ్రామానికి పంపించారు. 15 రోజుల పాటు పోరాటం చేసినా గ్రామ కోటను దాటలేకపోయారు. చేసేది లేక బళ్లారి నుంచి ఫిరంగులు తెప్పించాలని ఆదేశించారు.. అయితే ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో బ్రిటిష్‌ అధికారులు తమ కుటిల రాజనీతితో పక్క గ్రామాల పెద్దలను ప్రలోభాలకు గురిచేసి కోట గోడల రహస్య తలుపులను బద్దలు కొట్టారు.

ప్రాణ త్యాగం చేసిన వనితలు

చివరికి గ్రామంలోకి ప్రవేశించిన బ్రిటిష్‌ సేనలు గ్రామస్థులను కాల్చివేశారు. మహిళలపై దాడులకు పాల్పడ్డారు. బిట్రిష్‌ వారి చేతుల్లో చావడం ఎందుకంటూ కొందరు బావుల్లోకి దూకి ప్రాణత్యాగం చేశారు. ముత్తుకూరు గౌడప్ప, కరణం శంకరయ్య, గ్రామరెడ్డి అంకిరెడ్డి ముగ్గురిని బంధించిన బ్రిటీష్‌వారు గ్రామంలోని ఊరు వాకిలి ఎదుట ఉరి తీశారు. తెర్నేకల్‌ గ్రామంలో ఇప్పటికీ ఊరువాకిలి, గుడ్డెన బావి, కుక్కలబావి తదితరులు అప్పటి పోరాట పటిమను గుర్తుకు తెస్తున్నాయి.

ముగ్గురిని ఉరి తీసింది ఇక్కడే

శిస్తుపై గళమెత్తిన గ్రామస్థులు

రాయలసీమ ప్రాంతంలో 1801లో కరవు తాండవం చేస్తోంది. ప్రజలంతా శిస్తు చెల్లించాలని అప్పటి అధికారి శ్రీనివాస్‌ పల్లె వాసులను ఆదేశించారు. పంటలే లేనప్పుడు శిస్తు ఎలా చెల్లించాలని గ్రామ పెద్దలు ముత్తుకూరు గౌడప్ప, కరణం శంకరయ్య, గ్రామరెడ్డి అంకిరెడ్డిలు ప్రశ్నించారు. శిస్తులు చెల్లించకపోతే కఠినంగా శిక్షిస్తామని బ్రిటిష్‌ వారు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కదంతొక్కిన యువకులు.. మహిళలు

శిస్తు చెల్లించకపోవడంతో తెర్నేకల్‌పై బ్రిటిష్‌ సైనికులు 1801లో దాడికి దిగారు. గ్రామానికి చెందిన యువకులు బాణాలు, బాకులు, విల్లు, వడిసెలు తీసుకొని యుద్ధానికి సన్నద్ధం అన్నారు. మేము సైతం అంటూ మహిళలు కారం, వేడి నూనె సిద్ధం చేసుకొని ప్రతిదాడికి దిగి సైనికులను తరిమికొట్టారు. ప్రాణభిక్ష పెట్టమని అధికారి శ్రీనివాసులు ముత్తుకూరు గౌడప్ప కాళ్లపై పడటంతో వదిలేశారు.


రాట్నమే స్వరాజ్య సాధనం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీజీకీ జై.. దేశనాయకులకు స్వాగతం.. రాట్నమే స్వరాజ్య సాధనం అంటూ కర్నూలు నగరం నినదించింది. జాతీయనిధికి విరాళాల సేకరణలో భాగంగా మహాత్మాగాంధీ 1921 సెప్టెంబరు 30న జిల్లాలో పర్యటించారు. డోన్‌ మీదుగా కర్నూలు చేరుకున్న మహాత్ముడికి నగర వాసులు జయజయధ్వానాలతో స్వాగతం పలికారు. తుంగభద్ర ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ‘‘ ఆంగ్లేయ ప్రభుత్వాన్ని పారదోలి.. భారతీయులతో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. సత్యం, అహింసలే ఆయుధంగా పోరాటంలో పాల్గొనాలి.. విదేశీ వస్త్ర బహిష్కరణ గురించి వివరించారు. సభ తర్వాత జిల్లాలో స్వదేశీ ఉద్యమం చురుగ్గా సాగింది.. ఖద్దరు నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు.

చేనేత సహకార సంఘం ఏర్పాటు

కర్నూలులో 1924లో ఖద్దరు బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఏర్పాటైంది. గాంధీజీ పిలునందుకున్న మాచాని సోమప్ప సహకార సంస్థ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఎమ్మిగనూరులో ఏర్పాటైన సంఘం అనతి కాలంలోనే దేశంలో అతిపెద్ద సంఘంగా పేరు పొందింది. రెండువేల మంది కుటుంబాల వరకు ఉపాధి పొందడమే కాకుండా రెండువేల మగ్గాలపై చేనేత వస్త్రాలు తయారు చేసేవారు. ఇక్కడ రూపొందించిన చేనేత అంగీలు, లుంగీలు, తువాలలు, పంచలు, ఇతర వస్త్రాలు దేశంలో దితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ఆనాటి యోధులు ప్రశించారు. ప్రస్తుతం 236 చేనేత మగ్గాలపై నూలు వస్త్రాలు వడుకుతున్నారు. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి.

ఖద్దరు నిధికి విరివిగా విరాళాలు

మహాత్ముడి పిలుపునందుకున్న జిల్లా వాసులు ఆ దిశగా అడుగులేశారు. చాగలమర్రి, శిరివెళ్ల, అళ్లగడ్డ, ఉయ్యలవాడ, నంద్యాల, అయ్యలూరు, పాణ్యం, కర్నూలు, నాగలాపురం, ప్యాలకుర్తి, దేవనకొండ, పత్తికొండ, ఆదోని, ప్రాంతాల్లో ఖద్దరు నిధికి విరాళాలు సేకరించారు. కె.నాగలాపురంలో ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. ఆదోనిలో చరఖాలను ఉచితంగా పంపిణీ చేశారు.


నూలు దుస్తులతో బడికి

- డాక్టర్ పంపన్న, ఎమ్మిగనూరు

నాకు 93 ఏళ్లు వచ్చాయి. 1946-47లో పదోతరగతి చదువుతున్న సమయంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. విద్యార్థులంతా తెల్లని నూలు దుస్తులు ధరించి బడికి రావాలని మా పాఠశాల డ్రిల్‌ టీచర్ సూచించారు. ఎమ్మిగనూరు సహకార సంఘం రూపొందించిన తెల్లరంగు అంగి, టోపీ ధరించి వచ్చే వాళ్లం.


గొంతులన్నీ ఏకం.. త్రివర్ణ వందనం

వంద మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్ధుల ర్యాలీ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. నారాయణ విద్యావిహార్‌ ఆధ్వర్యంలో వంద మీటర్ల పొడవాటి మువ్వన్నెల జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో జానకిరామ్‌ జెండా ఊపి ర్యాలీ ప్రాంభించారు.  గంజి రాజశేఖర్‌, గంజి మోహన్‌కుమార్‌,   మోమిన్‌ షబాన, ఎస్సై హుసేన్‌బాషా పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే ఆత్మకూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు