logo
Published : 13 Aug 2022 00:39 IST

ప్రాణం తీసిన ఈత సరదా

నీటికుంటలో పడి మృతి చెందిన మహేష్‌ (పాతచిత్రం)

మిడుతూరు, న్యూస్‌టుడే : సరదాగా నీటికుంటలో దిగిన చిన్నారులు లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. వారిలో ఓ బాలుడు మృత్యుఒడికి చేరగా.. మరో బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన మిడుతూరు మండలంలోని కలమందలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటరమణ దంపతుల కుమార్తె సంగీత (13), అదే మండలంలోని ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన పానుగంటి పాలయ్య, శాలమ్మ కుమారుడు పానుగంటి మహేష్‌ (12) కలమందలపాడు గ్రామంలో ఇటీవల జరిగిన మొహర్రం కార్యక్రమాలు చూసేందుకు తమ బంధువుల ఇంటికి వచ్చారు. శుక్రవారం కుటుంబ సభ్యులు దుస్తులు ఉతికేందుకు గ్రామ సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు. వారితో పాటు మహేష్‌, సంగీత వెళ్లారు. అక్కడ ఇద్దరూ సరదాగా నీటిలోకి దిగారు. లోతు అధికంగా ఉండటంతో ఈత రాక మునిగిపోయారు. గమనించిన బంధువైన రవణమ్మ నీటిపై తేలుతున్న సంగీత తల వెంట్రుకలను పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే మహేష్‌ నీటిలో మునిగి మృతి చెందాడు. స్పృహ కోల్పోయిన సంగీతను హుటాహుటిన కర్నూలు వైద్యశాలకు తరలించారు. మహేష్‌ తల్లి శాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతీశంకర్‌ వెల్లడించారు.


ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి

మరో నలుగురికి గాయాలు

వీపనగండ్ల (మిడుతూరు), న్యూస్‌టుడే : మిడుతూరు మండలం వీపనగండ్ల సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా, మరో నలుగురు మహిళలు గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని కోటా వీధికి చెందిన పలువురు మహిళ కూలీలు రోజూ ఆటోలో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. శుక్రవారం వీపనగండ్లలోని ఓ రైతు పొలంలో పనిచేసేందుకు తొమ్మిది మంది ఆటోలో వస్తున్నారు. గ్రామ సమీపంలో చోదకుడు నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మహిళల్లో చాకలి శశికళ (35) అక్కడికక్కడే మృతి చెందారు. కొండా లలిత, ఎరుకలి సుజాత, ఎరుకలి సత్తెమ్మ, హుసేన్‌బీ గాయపడ్డారు. బాధితులను అంబులెన్స్‌లో నందికొట్కూరు వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతీశంకర్‌ తెలిపారు.


తండ్రితో కొట్లాడి యువకుడి ఆత్మహత్య

మహానంది , న్యూస్‌టుడే : మహానంది మండలం నందిపల్లె వద్ద పసుపుల యూసుఫ్‌ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో ఇతను రైలు కింద పడినట్లు రైల్వే కానిస్టేబుల్‌ మద్దయ్య తెలిపారు. వారం క్రితం తండ్రి ఇమామ్‌తో గొడవ పడి అవ్వాతాతగారి ఊరు గోపవరం వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని