logo

కోతకొచ్చినా.. కొనేవారేరీ

టమాటా పంట చేతికొచ్చింది. కోసి విక్రయిద్దామనుకుంటే అడిగే దిక్కులేదు. కూరగాయల సంత మార్కెట్‌ వద్దకు తీసుకెళ్లి అమ్ముదామంటే కిలో రూ.5 ధరైనా పలికే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేసిన టమాటా ఇప్పటికే పలు గ్రామాల్లో కోతకు రాగా, వర్షాధారం కింద వేసిన పంట మరో వారం,

Published : 14 Aug 2022 01:08 IST

మొదలుకాని టమాటా కొనుగోళ్లు

బోసిపోయిన పత్తి మార్కెట్‌యార్డు

ఖాళీగా పత్తికొండ మార్కెట్‌యార్డు ప్రాంగణం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: టమాటా పంట చేతికొచ్చింది. కోసి విక్రయిద్దామనుకుంటే అడిగే దిక్కులేదు. కూరగాయల సంత మార్కెట్‌ వద్దకు తీసుకెళ్లి అమ్ముదామంటే కిలో రూ.5 ధరైనా పలికే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేసిన టమాటా ఇప్పటికే పలు గ్రామాల్లో కోతకు రాగా, వర్షాధారం కింద వేసిన పంట మరో వారం, పదిరోజుల్లో కోతకు సిద్ధంగా ఉంది. వేలకువేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటకు ఆదిలోనే ధరలు వెక్కిరిస్తున్నాయి. పత్తికొండ ప్రాంతంలో టమాటాను అత్యధికంగా సాగు చేస్తారు. ప్రతి రైతూ తనకున్న పొలంలో కనీసం అర ఎకరా టమాటా సాగు చేయటం ఆనవాయితీ. ఈ ఖరీఫ్‌లో పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, ఆస్పరి ప్రాంతాల్లో సుమారు 2 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు చేశారు. కొనుగోళ్లు ప్రారంభమైతే రోజూ పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌కు 100 నుంచి 120 టన్నుల వరకు సరకు వస్తుంది. రైతుల పంటకోత, సరకు దిగుబడిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 13, 14వ తేదీల్లో పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో వేలాల ద్వారా కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మార్కెట్‌లో టమాటా కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

గ్రేడింగ్‌ చేసి పొలం వద్దే ఉంచిన టమాటాలు


మూడెకరాల్లో సాగు

- రమేశ్‌నాయక్‌, గుండుతండా

మూడెకరాల్లో టమాటా సాగు చేశా. పదిహేను రోజుల నుంచి కోత చేపడుతున్నాం. మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో కూరగాయల మార్కెట్‌వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. ఒకరిద్దరు వ్యాపారులే కొనుగోలు చేస్తుండటంతో ధర ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో త్వరితగతిన కొనుగోళ్లు ప్రారంభించాలి.


పొలంలోనే వదిలేస్తున్నాం

- సుభద్రమ్మ, మహిళా రైతు

రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేశా. పంట దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా సరకు కొనుగోలు చేయటం లేదు. దీంతో పండిన పంటను వదిలేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.


వ్యాపారులు ముందుకొస్తే ఏర్పాట్లు

- కార్నలీస్‌, మార్కెట్‌యార్డు కార్యదర్శి

పత్తికొండ మార్కెట్లో ఏటా టమాటాలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తాం. ఈసారి వేలాల విషయమై మా కార్యాలయానికి వ్యాపారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారు ఓ నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయం చెబితే వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని