logo

పాడవోయి ప్రగతి వందనం

మహనీయుల పోరాట ఫలితంగా మనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో కందనవోలులో ప్రగతి వెలుగులు ప్రకాశించాయి.

Published : 15 Aug 2022 02:02 IST

మహనీయుల పోరాట ఫలితంగా మనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో కందనవోలులో ప్రగతి వెలుగులు ప్రకాశించాయి. సాగు బాటలో పెనుమార్పులు వచ్చాయి. వైద్యం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. రాయలసీమ ప్రాంతానికి కర్నూలు సర్వజన వైద్యశాల పెద్ద దిక్కుగా మారింది. క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందుబాటులోకి రానుంది. అక్షరం మెరుగుపడింది.. ట్రిపుల్‌ ఐటీ, ఉర్దూ, రాయలసీమ, క్లస్టర్‌ వర్సిటీలతోపాటు ఎన్నో విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కందనవోలువాసులకు విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. సోలార్‌ పార్కు, శకునాల, ఉక్కు పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయి. పర్యాటకంగా జిల్లా దినదినాభివృద్ధి చెందింది.   ఆయా రంగాల్లో మరింత అభివృద్ధి పనులు చేపట్టాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ పాటుపడితే 25 దేశం మరింత ముందుకెళ్లడం ఖాయం. వందేళ్ల ప్రగతి భారతానికి స్వాగతం పలుకుదాం.

ఈనాడు - కర్నూలు

అక్షరం వెలగాలి
1951: 10.19 శాతం
2022: కర్నూలు (49.72 శాతం), నంద్యాల (56.28 శాతం)

బడి మానేస్తున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పశ్చిమాన కర్నూలులో వలసలు ఎక్కువగా ఉండటంతో చదువుకునే విద్యార్థులు సైతం తల్లిదండ్రులతో వలసబాట పడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించి ప్రత్యేకంగా సీజనల్‌ వసతి గృహాలు ఏర్పాటు చేస్తే కనీసం విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది.  అక్షరాస్యత శాతం మరింత పెంచొచ్చు.

ఉన్నతంగా ఆలోచించాలి
కళాశాలలు
1951: 06
2022: 102

ప్రభుత్వ పాఠశాలలు
1951: 1,974
2022: 2,800

నాడిపట్టాలి.. ధైర్యం నింపాలి
1951: 26 ఆస్పత్రులు (190 పడకలు)
2022: 110 ఆస్పత్రులు (2,600-3 వేల పడకలు)

నంద్యాల, ఆదోని వైద్య కళాశాలల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. క్యాన్సర్‌ ఆసుపత్రి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిశోధనలు జరగాలి. సర్వజన వైద్యశాలను 1,500 పడకల స్థాయికి పెంచాలి. పీజీ సీట్లను పెంచాల్సి ఉంది. సర్వజన వైద్యశాలలో క్యాత్‌ల్యాబ్‌ కొత్తది ఏర్పాటు చేయాలి.

పచ్చదనం  పరిఢవిల్లాలి
1951: 16,70,369(అటవీ విస్తీర్ణం) ఎకరాలు
2022: 3,39,669 హెక్టార్లు

అటవీ విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. అడవులను సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మరోవైపు వనమహోత్సవం పేరుతో ఏటా 50 లక్షల మొక్కలు నాటుతున్నారే తప్ప వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు.

మరింత పరిశ్రమించాలి
1951 : 63
2022 : 2,136

ప్రగతి మార్గం చూపాలి
1951 : 1 డిపో.. 3 బస్సులు
2022: 12 డిపోలు..960 బస్సులు

1951: 1 రైల్వే లైన్‌ (4 రైళ్లు)
2022: 2 రైల్వే లైన్లు (280 కి.మీ.లు)..

అందుబాటులో 90-110 రైళ్లు
రవాణా సౌకర్యం మెరుగు పడాలంటే ముందుగా రోడ్లు బాగుపడాలి. రహదారులను అభివృద్ధి సూచికలుగా పిలుస్తారు. అలాంటి రోడ్లు ప్రస్తుతం అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లకు నిధులు విడుదల చేసి బాగు చేయించడంతోపాటు ఏటా నిర్వహణ పనులు చేపడితే రవాణా మెరుగుపడుతుంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో బస్సులు ఎరగని పల్లెలు 200కుపైగా ఉన్నాయి. కేవలం రోడ్లు బాగోలేదన్న కారణంతో ఆ గ్రామాలకు బస్సులు నడపని పరిస్థితి. గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్‌ లైనింగ్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. నంద్యాల-శ్రీశైలం వైపు ప్రత్యేక లైను, మాయలూరులో స్టేషన్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు చేశారు. రాబోయే 25 ఏళ్లలో నంద్యాల స్టేషన్‌లో పిట్‌లైన్‌ (నిర్వహణ కోసం) ఏర్పాటు చేయాలి.  కడపలో ఆగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెక్స్‌ను నంద్యాల వరకు పొడిగిస్తే రవాణా మరింత మెరుగుపడుతుందని రైల్వే సభ్యుడు ఎన్‌ఎండీ జుబైర్‌ బాషా తెలిపారు.

రైతురాజ్యం రావాలి
వర్షపాతం
1951: 614 మి.మీ.లు
2022: కర్నూలు (522 మి.మీ.లు), నంద్యాల (784.1 మి.మీ.లు)

వ్యవసాయం
1951: 21,80,038 ఎకరాలు (పంటల సాగు విస్తీర్ణం)
2022: 9.06 లక్షల హెక్టార్లు  

రైతులకు ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లభించడం. దీనిని అధిగమించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీలే తప్ప అడుగులు పడటంలేదు. ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాల్సి ఉంది. రాయితీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం సకాలంలో అందాల్సి ఉంది. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతును వెంటనే ఆదుకోవాలి. సాగుకు సమాయత్తమయ్యే ముందే పంట రుణాలు అందించగలిగితే వడ్డీ వ్యాపారుల బారిన రైతులు పడరు. రానున్న 25 ఏళ్లలో రైతు బాగుండేలా ఏ ప్రభుత్వం వచ్చినా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.

వాడిన పాడిపరిశ్రమ
ప్రతి రైతు కుటుంబానికి పాడి పశువులే ఆధారం. పశుగ్రాసం కొరత, సరైన వైద్యం అందక వీటికి దూరమవుతున్నారు.  రాయితీపై కోళ్లు, పొట్టేళ్లు, పశువులను అందజేయడంతోపాటు రైతుల వద్దకే వైద్యం చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సంచార పశు వైద్యవాహనాలకు అడుగులు పడలేదు. ఇవి అధిగమిస్తే పాడి సిరులు కురిపిస్తుంది.
వరద  మళ్ల్లించాలి
* 1951: 03 మేజర్‌ ఇరిగేషన్‌
*2022: 14
*1951: 571 (మైనర్‌ ఇరిగేషన్‌)
* 2022: 384
* 1951: 06 (చెరువులు)
*2022: 92

గుండ్రేవుల జలాశయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5,400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి జలాశయాన్ని నిర్మిస్తే 20 టీఎంసీల వరద నీటిని నిల్వ చేసుకుని కేసీ కెనాల్‌ కింద ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందించవచ్చు. పశ్చిమ ప్రాంతంలో వేదవతి, ఆర్డీఎస్‌ పూర్తి చేస్తే వలసలు నివారించవచ్చు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని