logo
Published : 17 Aug 2022 03:03 IST

ప్రజాప్రతినిధులకు దక్కని హామీ

జడ్పీ సమావేశం తీరుపై జడ్పీటీసీ సభ్యుల అసంతృప్తి


సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు

కర్నూలు నగరం (జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుని, తీర్మానాలు చేయాల్సిన జడ్పీ సర్వ సభ్య సమావేశం మంగళవారం మొక్కుబడిగా ముగిసింది. మూడు శాఖలపై రెండు గంటలపాటు చర్చించారు. సభ్యులకు హామీలు, నిధులపై స్పష్టత ఇవ్వకుండగానే అయిందనిపించేశారు.

నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 2.20 వరకు జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయం, జలవనరులు, వైద్య, ఆరోగ్య శాఖపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఇంజినీర్లు సలహా ఇస్తున్నారు..

కొందరు ఇంజినీర్లు సలహాలు ఇవ్వడంతో జల్‌జీవన్‌ ప్రాజెక్టు కింద మంజూరైన పనులను గుత్తేదారులు రద్దు చేసుకుంటున్నారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ.. ‘ఇలాంటి సలహాలు కూడా ఇస్తున్నారా..’ అని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలు తగ్గడంతో కొందరు రద్దు చేసుకుంటున్నారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఇంజినీర్లు వివరించారు.
ఈ సమావేశంలో జేసీ రామ్‌సుందర్‌రెడ్డి, జడ్పీ నూతన సీఈవో నాసరరెడ్డి, పూర్వ సీఈవో వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కనీసం గుర్తింపు ఇవ్వండి

జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై ఏడాది కావస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు లేదని, నిధులు, విధులు ఏమీ లేవని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంతవరకు శిక్షణ కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎంపీపీలకు నెలకు రూ.8 వేల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉందని, తమకు ఏదీ లేదన్నారు.

సి.బెళగల్‌ ఆదర్శ పాఠశాలలో రూ.6 లక్షల మేర ఉన్న విద్యుత్తు బిల్లు చెల్లించకపోవడంతో సరఫరా ఆపేశారని, ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మునెప్ప విన్నవించగా వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని విద్యుత్తు శాఖ ఎస్‌ఈని మంత్రి ఆదేశించారు.

మా సమస్యలివీ..

వరదరాజస్వామి గుడి ప్రాజెక్టు కింద కాల్వలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో జపాన్‌ నిధులు విడుదలయ్యాయని, వీటి పురోగతిపై అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌ రెడ్డి కోరారు.

తుగ్గలి మండలం బొందిమడుగుల వద్ద వంతెన కూలిపోయిందని, ఫలితంగా సమీప 5 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యుడు పులికొండ నాయక్‌ విన్నవించగా వెంటనే ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు.

మిడుతూరులో స్టాఫ్‌ నర్సు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురం ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని, పేరుకే 24 గంటల ఆస్పత్రిగా ఉందని వసతలు కల్పించాలని జడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్‌గౌడ్‌ విన్నవించారు.


తుంగభద్ర జలాలు వినియోగించుకుందాం

ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను మరింత అభివృద్ధికి చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని, తుంగభద్ర జలాలు వృథా కాకుండా ఎగువలో భారీ జలాశయానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పెద్దఎత్తున ప్రవహిస్తుండటంతో  శ్రీశైలం డ్యాంకు భారీ వరద వస్తోందని, జిల్లాలోని జలాశయాలను పూర్తిస్థాయిలో నింపుకొని భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా జలవనరులశాఖ ఇంజినీర్లు ప్రణాళికలు చేసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కుల నీరు తరలించే ప్రక్రియ వచ్చే ఏడాదికి పూర్తవుతుందని, అవుకు రెండో టెన్నల్‌ పనులు కొనసాగుతున్నాయని ఇంజినీర్లు వెల్లడించారు.


ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే..

చిప్పగిరి నుంచి మద్దికెరకు మంచినీరు విడుదల చేయాల్సి ఉండగా అనధికారికంగా మరో ప్రాంతానికి తరలిస్తున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎవరి అనుమతి లేకుండా నీటిని తరలించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఇంజినీరుపై చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు సూచించారు.

భారీ వర్షాలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితోపాటు పలువురు జడ్పీటీసీ సభ్యులు కోరారు.

గోస్పాడు మండలం ఒంటెలగల గ్రామంలో మిర్చి పంట దెబ్బతిందని, పంట నమోదులో తప్పుగా రాయడంతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జానగూడెం, ఎరమఠం, సిద్ధేశ్వరం గ్రామాల్లో విద్యుత్తు వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆర్థర్‌ పేర్కొన్నారు. మంత్రి బుగ్గన స్పందించి వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి విద్యుత్తు వసతి కల్పించాలని ఎస్‌ఈని ఆదేశించారు.

కొత్తపల్లి మండలంలో భూమి ఒకరిపేరున ఉంటే ఆన్‌లైన్‌లో మరొకరికి పేరు ఉంటోందని, ఫలితంగా రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఎమ్మెల్యే ఆర్థర్‌ చెప్పారు. ఇదే అంశాన్ని గతంలో పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని జడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌ రెడ్డి తెలిపారు.


సీపీడబ్ల్యూఎస్‌ పథకాలపై దృష్టి సారించండి

మంత్రి బుగ్గన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రాధాన్యమివ్వాలని, ప్రధానంగా సీపీడబ్ల్యూఎస్‌ పథకాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫిల్టర్‌ బెడ్స్‌ ఉన్న ప్రాంతాల్లో మంచినీటిని శుద్ధి చేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని నివేదికలు సిద్ధం చేయాలని ఎస్‌ఈలు మనోహర్‌, నాగేశ్వరరావును ఆదేశించారు. జగనన్న కాలనీల్లో త్వరలోనే నీటి సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు ద్వారా మంజూరైన పనులు, టెండర్ల ఒప్పందాలు తదితర వాటిపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు.


ఆస్పత్రుల్లో నియామకాలకు ప్రకటన ఇస్తాం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మరింతగా మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. నాడు-నేడు పథకం ద్వారా నిధులు వెచ్చించామని, ఏ స్థాయిలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది నియమించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లా కలెక్టరు కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 48 వేల ఇళ్లు మంజూరు చేశామని, జగనన్న కాలనీల్లో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నాడు-నేడు కింద తొలి దశలో రూ.537 కోట్ల వ్యయంతో 1,300 పాఠశాలల్లో పనులు చేసినట్లు పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరు మన్‌జీర్‌ జిలానీ మాట్లాడుతూ కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో చెంచులకు భూములు ఇచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్నామని, అర్హులైనవారికి అసైన్‌మెంట్‌ భూమి పంపిణీ చేస్తామన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని