logo

చికెన్ వ్యర్థం కోట్లు పలుకుతోంది

చికెన్‌ వ్యర్థాల వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది. దీనిని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుందని ఇటీవల జరిగిన నగర పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక ప్రస్తావించారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా చికెన్‌ వ్యర్థాలు  చేపల చెరువుల్లో

Updated : 24 Sep 2022 03:55 IST

అనుమతుల్లేకుండా  తరలింపు

ప్రజాప్రతినిధులకు వాటాలు

- న్యూస్‌టుడే,  కర్నూలు నగరపాలక సంస్థ

కోడిమాంసం వ్యర్థాలు

చికెన్‌ వ్యర్థాల వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది. దీనిని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుందని ఇటీవల జరిగిన నగర పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక ప్రస్తావించారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా చికెన్‌ వ్యర్థాలు  చేపల చెరువుల్లో వేయడంతోపాటు మరికొన్నింటిలో వాడుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్‌ పెరగడంతో దీన్ని కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు. పసిగట్టిన ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుని అనధికారిక అనుమతులు ఇస్తున్నారు.

చేపల చెరువులకు తరలింపు

* కర్నూలు నగరంలో 52 వార్డుల్లో ఆరు లక్షలకుపైగా జనం నివసిస్తున్నారు. 500కుపైగా చికెన్‌ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. నిత్యం సుమారు 15 టన్నుల లైవ్‌ కోళ్లు, ఆదివారం 30 టన్నుల వరకు లైవ్‌ కోళ్లు ఆయా కేంద్రాల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెలా 500 టన్నుల వరకు లైవ్‌ కోళ్లు కర్నూలు నగరానికి దిగుమతి అవుతున్నాయి.

* దుకాణాల్లో చికెన్‌ విక్రయించగా మిగిలిన చర్మం, పేగులు, కాళ్లు తదితర వ్యర్థాలు రాత్రి వేళ ఓ ముఠా గుట్టుగా వాహనాల్లో తీసుకెళ్తోంది.వీటిని తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ చేపల చెరువుల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని గ్రేడింగ్‌ చేసి చేపలకు ఆహారంగా వేస్తున్నట్లు తెలుస్తోంది.

తరలించేందుకు ‘పోటీ’ పడుతున్నారు

కిలో లైవ్‌ కోడి నుంచి 300 గ్రాముల వరకు వ్యర్థాలొస్తాయి. కర్నూలు నగరంలో ప్రతి నెలా 500 టన్నులకుపైగా లైవ్‌ కోళ్లను దిగుమతి చేస్తున్నారు. వీటి ద్వారా 150 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని తీసుకెళ్తున్న ఒక్కో వ్యాపారి నిత్యం రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్జిస్తున్నారు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో చాలా మంది ఇందులోకి ప్రవేశిస్తున్నారు. చికెన్‌ వ్యర్థాలు తీసుకోవడానికి ‘పోటీ’ పడుతున్నారు. వ్యర్థాలు ఉచితంగా ఇస్తున్నందుకు చికెన్‌ విక్రయదారులకు ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు డబ్బులు ముట్టచెబుతున్నారు. వ్యర్థాలు తమకే ఇవ్వాలని.. ఇతరులకు ఇవ్వకూడదంటూ ముందస్తుగా అడ్వాన్స్‌లు ఇస్తుండటం గమనార్హం.

నగర పాలక ఆదాయానికి గండి

* నగరపాలక అధికారులు.. వ్యర్థాలే కదా.. అనుకున్నారో ఏమో కానీ.. వీటి నుంచి పెద్దఎత్తున ఆదాయం వస్తోంది. వ్యాపారులు ఏటా రూ.కోటికిపైగా లాభాన్ని ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయమంతా గత కొన్నేళ్లుగా పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఫలితంగా నగరపాలక ఆదాయానికి గండి పడుతోంది.

* వ్యర్థాలను తరలించే వ్యాపారులంతా కలిసి ఓ ప్రజాప్రతినిధికి రూ.10 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఇచ్చిన అనుమతిని రద్దు చేసి టెండర్లు పిలిస్తే నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరుతుందని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని