logo

సేవలన్నీ అక్కడే

పరిపాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు జిల్లాల పునర్‌ విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ తొలి వారం నుంచే కొత్త జిల్లా పాలన ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తి అయిన ఐదు నెలలు గడిచినా ఇంకా పలు శాఖలకు సిబ్బంది విభజన, కార్యాలయాలు ఏర్పాటు జరగలేదు.

Published : 27 Sep 2022 03:42 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: పరిపాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు జిల్లాల పునర్‌ విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ తొలి వారం నుంచే కొత్త జిల్లా పాలన ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తి అయిన ఐదు నెలలు గడిచినా ఇంకా పలు శాఖలకు సిబ్బంది విభజన, కార్యాలయాలు ఏర్పాటు జరగలేదు. శాశ్వత భవనాలు, అవసరమైన నిధులు మౌలిక సదుపాయాల కల్పన ఊసే లేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లా స్వరూపం మారినా ఇంకా కొన్ని పనులు పాతజిల్లా కేంద్రం నుంచే సాగుతున్నాయి. కీలక సేవలు, సమాచారం సర్దుబాటు అంశాల్లో కర్నూలు పైనే ఆధారపడాల్సి వస్తోంది. కీలకశాఖ అయినా రెవెన్యూకు సంబంధించి ఇంకా వేలాది దస్త్రాలు కర్నూలులోనే ఉండిపోయాయి. కొన్ని శాఖల విభజన కొలిక్కి రాకపోవడంతో కర్నూలు పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రజలకు వ్యయప్రయాసలు తప్పడం లేదు.

సమగ్ర శిక్ష అంతా మిథ్య

సమగ్రశిక్ష కార్యాలయం జిల్లాలో ఏర్పాటు జరిగినప్పటికీ పర్యవేక్షణ అంతా కర్నూలు సమగ్రశిక్ష అభియాన్‌ పీడీ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. కస్తూర్బా విద్యాలయాల పర్యవేక్షణ పాత జిల్లా కేంద్రం నుంచే సాగుతోంది. వయోజన విద్య పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి. పర్యాటకశాఖ కార్యాలయం ఏర్పాటు చేయకపోగా నంద్యాల డీపీఆర్వోకే పర్యాటక శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయం కర్నూలులోనే కొనసాగుతోంది. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, ఇండస్ట్రీస్‌ ఆఫ్‌ జీఎం కార్యాలయాలు రాలేదు.

వీటి పరిస్థితేమిటి?

ఆరోగ్యశ్రీ, సైనిక సంక్షేమం, విజిలెన్స్‌, అవినీతి నిరోధక శాఖ, ఇంటర్‌ బోర్డు, స్టెప్‌ తదితర శాఖల విభజన జరగలేదు. ప్రస్తుతం ఈ శాఖల పర్యవేక్షణ అంతా కర్నూలు కేంద్రంగానే కొనసాగుతోంది. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయాలు ఏర్పాటు జరిగినా సిబ్బంది  లేరు.

అటవీ కార్యాలయం రాలేదు

జిల్లాలో నల్లమల , ఎర్రమల కొండలు డోన్‌, బనగానపల్లి నియోజకవర్గాల్లో ఉన్నాయి. 3.45 లక్షల హెక్టార్ల పొడవునా నల్లమల అడవుల విస్తీర్ణం ఉన్నా ఇక్కడ సీఎఫ్‌వో కార్యాలయం ఏర్పాటు కాలేదు. అటవీ కార్యాలయాల పర్యవేక్షణ అంతా కర్నూలు సీఎఫ్‌వో కార్యాలయమే నిర్వహిస్తుంది.

ఆచూకీ లేని ‘గనులశాఖ’

జిల్లాలోని బనగానపల్లి, డోన్‌ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నాపరాళ్లు, ఇనుప ఖనిజం, లైమ్‌స్టోన్‌, క్వార్ట్జ్‌ గనులున్నాయి. బనగానపల్లిలో ఏడీ కార్యాలయం ఉంది. గనులశాఖ డీడీ కార్యాలయం కర్నూలులో ఉంది. కొత్త జిల్లాలో అధికారులను నియమించి కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తే గనులపై పర్యవేక్షణ పెరిగి అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా ఉంచే అవకాశం ఉంది.

ఉపాధి కల్పన కార్యాలయం ఎక్కడ

నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకునే ఉపాధి కల్పన కార్యాలయం కర్నూలులోనే ఉంది. పేరు, వయస్సు, ఉపాధి శిక్షణ ఇతర వివరాలకు పొరుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధి కల్పన నిరుద్యోగుల కోసం అందుబాటులోని సౌకర్యాలు, సదుపాయాలు తెలుసుకోవాలంటే కర్నూలుకు వెళ్లాల్సి రావడంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని