logo

గుండెలో గుబులు

కల్లూరు మండలం చెట్లమల్లాపురానికి చెందిన 35 ఏళ్ల రమేశ్‌ ఆరు నెలల కిందట గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌తో కాలు, చేయి పడిపోయి సర్వజన వైద్యశాలలో చేరారు.

Published : 29 Sep 2022 03:42 IST

సర్వజన వైద్యశాలలో మూతపడిన క్యాథ్‌ల్యాబ్‌
ప్రైవేటుకు పంపిస్తున్న   వైద్యులు
నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

* కల్లూరు మండలం చెట్లమల్లాపురానికి చెందిన 35 ఏళ్ల రమేశ్‌ ఆరు నెలల కిందట గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌తో కాలు, చేయి పడిపోయి సర్వజన వైద్యశాలలో చేరారు. పొగ, మద్యం అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే ‘గుండె’లో అలజడి మొదలైంది. గతంలో వైద్యచికిత్స తీసుకున్నా సోమవారం గుండెనొప్పి రావడంతో కార్డియాలజీ విభాగంలోని ఐసీయూలో చేరారు.
* కర్నూలు నగరానికి చెందిన 45 ఏళ్ల షాకీర్‌బాషా గుండెనొప్పితో రెండ్రోజుల కిందట కార్డియాలజీ విభాగంలో చేరారు. ఐదేళ్ల క్రితం గుండెజబ్బు బారినపడి సర్వజన ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నారు. ఏడాదిపాటు ఔషధాలు వాడిన తర్వాత నాలుగేళ్లు మానేశారు. ఇప్పుడు యాంజియోగ్రామ్‌ చేయాల్సి వచ్చింది. రక్తనాళాలు పూడుకుపోయాయి.. పరిస్థితిని బట్టి స్టెంట్‌ లేదా సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లెక్కలు పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సుమారు 25 వేల మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి నెలా కొత్తగా 70 నుంచి 100 మంది వరకు ఉండటం కలవరపెడుతోంది. గతంలో 50 ఏళ్ల దాటిన వారికే ఎక్కువగా గుండెపోటు వచ్చేది. ప్రస్తుతం 35 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్నవారూ దీని బారిన పడుతున్నారు.  

ఏడాదిగా అందని వైద్యం
* సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ విభాగంలో సుమారు ఐసీయూ పడకలు 10, సాధారణ పడకలు 40, మొత్తం 50 పడకలున్నాయి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి, కర్ణాటక రాష్ట్రాల నుంచి బాధితులు వస్తుంటారు. ఈ విభాగంలో ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్‌మిల్‌ పరీక్షలతోపాటు క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రామ్‌, స్టెంట్లు వేసేవారు. ఏడాదిగా క్యాథ్‌ల్యాబ్‌ పనిచేయక విశ్వభారతి ఆసుపత్రిలో యాంజియోగ్రామ్‌, స్టెంట్లు వేస్తున్నారు.
* ప్రభుత్వం క్యాథ్‌ల్యాబ్‌ మంజూరు చేసి ఏడాది కావొస్తున్నా టెండర్‌ దశలోనే ఉంది. కార్డియాలజీ వైద్యులు కేవలం వైద్యం చేసి బయట యాంజియోగ్రామ్‌, స్టెంట్లు వేస్తున్నారు.

ప్రైవేటుకు వెళ్లాల్సిందే
* సర్వజన ఆసుపత్రిలో కార్డియోథోరాసిక్‌ సర్జరీ విభాగంలో ప్రస్తుతం ఒక ఆచార్యుడు, ఇద్దరు సహాయకులు ఉన్నారు. కొవిడ్‌ తరువాత ఈ ఏడాదిలో సుమారు 50కు మించి గుండె శస్త్రచికిత్సలు జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ క్యాథ్‌ లేకపోవడం.
* 2022లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఆరోగ్యశ్రీ కింద ఉమ్మడి జిల్లాలో గుండె శస్త్రచికిత్సలు, యాంజియోగ్రామ్‌, స్టెంట్లు కలిపి 5,662 చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో 826, ప్రైవేటు ఆసుపత్రుల్లో 4836 గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేశారు.

కొవిడ్‌ తర్వాత అధికం - డాక్టర్‌ చంద్రశేఖర్‌, కార్డియాలజీ విభాగాధిపతి  
గుండె సమస్యలపై అవగాహన అవసరం. కొవిడ్‌ తర్వాత ఈ సమస్యలు మరింత అధికమయ్యాయి. గుండెపోటు రాకుండా ఉండడానికి నడక, యోగా, ధ్యానం, శాకాహారం కొంతవరకు మేలు చేస్తాయి. గుండెజబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఆహారంపై నియంత్రణ అవసరం. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం, ధూమపానం, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి. కొవ్వు ఉండే పదార్థాలు, మసాలా వస్తువులు ఎక్కువగా తీసుకోకూడదు. రోజూ గంటపాటు నడక, యోగా, ధ్యానం చేయాలి. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.

యాంజియోగ్రామ్‌కు బయటకు వెళ్లా - ఖాదర్‌ బాషా, పాతపట్టణం, కర్నూలు
వారం క్రితం ఛాతిలో నొప్పి వచ్చి కార్డియాలజీ విభాగంలో చేరా. ఇక్కడ అన్ని పరీక్షలు చేసిన తర్వాత యాంజియోగ్రామ్‌ చేయాలని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. యాంజియోగ్రామ్‌ స్టెంట్లు వేయడానికి ఇక్కడే క్యాథ్‌ ల్యాబ్‌  ఏర్పాటు చేయాలి. ఇక్కడ వైద్యులు సరిగా పట్టించుకోరనే చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts