logo

నగరానికొచ్చి.. నగలు దోచి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నిత్యం కర్నూలు నగరానికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకుంటున్న ఆ యువకుడిని చూసి ఊళ్లోవాళ్లంతా కష్టజీవి అనుకున్నారు.

Published : 29 Sep 2022 03:42 IST

28 చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
రూ.33 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

షేక్‌ నూరుల్లా నుంచి స్వాధీనం చేసుకున్న నగలు పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఇతర అధికారులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నిత్యం కర్నూలు నగరానికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకుంటున్న ఆ యువకుడిని చూసి ఊళ్లోవాళ్లంతా కష్టజీవి అనుకున్నారు. ఒళ్లొంచి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని భావించారు. చివరికి ఆ యువకుడు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసి అవాక్కయ్యారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఆ నిందితుడిని కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు.
* జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, కర్నూలు డీఎస్పీ కె.వి.మహేశ్‌, సీఐ శేషయ్య బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన షేక్‌ నూరుల్లా చిన్నప్పుడే పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పాలిష్‌బండల కటింగ్‌ పని నేర్చుకుని వచ్చాడు. నిత్యం కర్నూలుకు వచ్చి పని చేసుకుని స్వగ్రామానికి వెళ్లేవాడు. కొంతకాలం తర్వాత చరవాణిలో ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడ్డాడు.
* 2020 కరోనా సమయంలో డబ్బు కోసం ఓ ఇంట్లో చోరీ చేశాడు. అలా మెల్లగా చోరీలకు తెగించాడు. పనికి వెళ్తున్నట్లు రోజూ ఇంటి నుంచి బైకుపై బయలుదేరి కర్నూలు వస్తాడు. తాళం వేసిన ఇళ్లను పరిశీలించి చోరీలు చేసేవాడు. సొంత ఊళ్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడిపేవాడు. అతణ్ని చూసినవారంతా కష్టపడి పనిచేసుకుంటున్నాడని భావించేవారు. ఏడాది క్రితం నూరుల్లా వివాహం చేసుకున్నాడు. ఇటీవల కర్నూలు నగర శివారులోని ఓ ఇంట్లో చోరీకి యత్నించటంతో అతని వ్యవహారం వెలుగుచూసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 28 చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. రూ.33 లక్షల విలువ చేసే బంగారు నగలను నూరుల్లా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని