logo

పథకం పన్నారు.. యువతను ముంచారు

ఆళ్లగడ్డ పట్టణం శ్రీలేఖ వీధికి చెందిన మిరపకాయల వ్యాపారి తన కుమారుడిని ఉద్యోగంలో చేర్పించేందుకు రూ.3 లక్షలు చెల్లించారు. దొర్నిపాడులో ఏర్పాటు చేసిన కార్యాలయానికి వెళ్తున్నారు.

Updated : 29 Sep 2022 06:09 IST

ఆళ్లగడ్డ పట్టణం శ్రీలేఖ వీధికి చెందిన మిరపకాయల వ్యాపారి తన కుమారుడిని ఉద్యోగంలో చేర్పించేందుకు రూ.3 లక్షలు చెల్లించారు. దొర్నిపాడులో ఏర్పాటు చేసిన కార్యాలయానికి వెళ్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం రూ.25 వేలు కాకుండా కేవలం రూ.9 తొమ్మిది వేలు రెండు నెలల పాటు చెల్లించారు. ఆ తర్వాత కార్యాలయం ఎత్తేశారు.

ఆళ్లగడ్డ పట్టణంలో ఓ బంగారు దుకాణ యజమాని తన కుమారుడికి ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు రూ.4 లక్షలు చెల్లించారు. దొర్నిపాడులో కార్యాలయం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. మొదటి నెల రూ.15 వేలు, రెండో నెల రూ.30 వేల వేతనం ఆయన ఖాతాలో జమైంది. గత రెండు నెలలూగా ఒక్క పైసా ఇవ్వడం లేదు. దొర్నిపాడులో కార్యాలయం అద్దె చెల్లించాలని ఈయనపై భవన యజమాని ఒత్తిడి చేస్తున్నారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతే లక్ష్యంగా చేసుకొని స్మార్ట్‌ విలేజ్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ రూ.కోట్లు దండుకుని బోర్డు తిప్పేసింది. దొర్నిపాడు, ఆళ్లగడ్డ కేంద్రంగా పదుల సంఖ్యలో ఆశావహులను మోసం చేశారు. ఉమ్మడి జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే ఏ సమస్య వస్తుందోనన్న భయంతో చాలా మంది బయటకు రావడం లేదు.

- న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

పథకాలు ప్రజలకు చేర్చాలంటూ
స్మార్ట్‌ విలేజ్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ పేరుతో సంస్థ ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో ఆరు నెలల కిందట కార్యాలయాలు ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించే లక్ష్యంగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు.. ఇందులో పని చేసే ఒక్కో ఉద్యోగికి రూ.25 వేలు, వారిపై పర్యవేక్షణ చేసే అధికారికి నెలకు రూ.30 వేల వేతనం ఇస్తామంటూ మధ్యవర్తుల ద్వారా ప్రచారం చేయించారు. సాధారణ ఉద్యోగానికి రూ.3 లక్షలు, పర్యవేక్షణ అధికారికి రూ.4 లక్షలు ముందుగా ఇస్తే కొలువు లేఖ (అపాయింట్‌మెంట్‌) ఇప్పిస్తామని నమ్మించారు.

ప్రముఖుల చిత్రాలతో ప్రచారం
మండల కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభించడం, కుర్చీలు, బల్లలు వేయడం, గోడలకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల చిత్రాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశారు. తొలి రెండు నెలలు సక్రమంగా వేతనాలు ఇచ్చారు. మరుసటి నెల నుంచి వేతనాలు ఇవ్వకుండా, కార్యాలయాల అద్దె చెల్లించకుండా మొండికేశారు. అనుమానం వచ్చి బాధితులు మధ్యవర్తులను సంప్రదించగా వారూ సరైన సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశారు. కార్యాలయ అద్దెలనూ అందులో చేరిన బాధిత ఉద్యోగులే చెల్లించాలంటూ యజమానులు ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో సుమారు 50 మంది బాధితులున్నట్లు తెలుస్తోంది.

మధ్యవర్తుల ద్వారా
ఉద్యోగులను నియమించే క్రమంలో యువతను నమ్మించేందుకు ఆకర్షణీయ ప్రచారం చేపట్టారు. ప్రొద్దుటూరులో ఈ సంస్థ ముఖ్యుడు ఆర్భాటంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉన్నట్లు నమ్మించడమేగాక, త్వరపడితేనే ఉద్యోగం వస్తుందన్న భావన కలిగించారు. మధ్యవర్తులను నియమించుకుని ఉద్యోగం కచ్చితంగా ఇప్పించి నెల నెలా జీతాలు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేసి రూ.కోట్ల ఎగరేసుకుని పోయారు. ప్రస్తుతం డబ్బులు ఇప్పించిన మధ్యవర్తులూ బాధితుల జాబితాలో చేరిపోయారు. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ముగ్గురు మధ్యవర్తులున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని దొర్నిపాడు ఎస్సై తిరుపాల్‌, ఆళ్లగడ్డ పట్టణ సీఐ జీవన్‌బాబులు పేర్కొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని