logo

పండగకు పంచదార లేనట్లే

అక్టోబరులో వరుసగా దసరా, దీపావళి, మిలాద్‌ ఉన్‌ నబీ పండగలు వస్తాయి. ఇంటికొచ్చే బంధువులకు పిండి వంటలు, తీపి పదార్థాలు పెట్టడం కష్టమే.. ఎందుకంటే రేషన్‌ దుకాణం ద్వారా పంచదార, కందిపప్పు అందే పరిస్థితులు కనిపించడం లేదు.

Published : 29 Sep 2022 03:42 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: అక్టోబరులో వరుసగా దసరా, దీపావళి, మిలాద్‌ ఉన్‌ నబీ పండగలు వస్తాయి. ఇంటికొచ్చే బంధువులకు పిండి వంటలు, తీపి పదార్థాలు పెట్టడం కష్టమే.. ఎందుకంటే రేషన్‌ దుకాణం ద్వారా పంచదార, కందిపప్పు అందే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ సరకుల్లో భారీగా కోత విధిస్తుండటంతో పేదలపై తీవ్ర భారం పడుతోంది. ‘‘ కందిపప్పు, పంచదార రాష్ట్రంలో లభ్యత లేకపోవడంతో అక్టోబరులో సరఫరా చేయలేకపోతున్నాం.. జిల్లా కోటా రాగానే అందిస్తామని’’ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ షర్మిల తెలిపారు.

నిల్వలు లేక వెనకడుగు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పంచదార, కందిపప్పు పంపిణీ చేయలేదు. అక్టోబరులో అందించాలంటే ముందుగా డీలర్లు డీడీలు తీయాలి. అందుకు వారు ముందుకొచ్చినా నిల్వలు లేక వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. రేషన్‌ దుకాణాలకు ఈ నెల 22 నుంచి బియ్యం చేరవేస్తున్నారు. వాటిని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు అందజేస్తారు.

బయట కొనాల్సిందే
సాధారణ రోజుల్లో ఒక్కో కార్డుదారులకు అరకిలో చొప్పున రాయితీ పంచదార ఇస్తుండగా పండగల వేళ కిలో చొప్పున అందిస్తారు. గత కొంత కాలంగా ఇవ్వడం లేదు. రేషన్‌ దుకాణంలో అరకిలో పంచదార రూ.17కి కార్డుదారులకు ఇవ్వగా బహిరంగ మార్కెట్లో అర కిలో రూ.20- 25కు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. రేషన్‌ దుకాణాల్లో కిలో కందిపప్పు  రూ.67కు ఇస్తారు. బయట మార్కెట్లో రూ.110 నుంచి రూ.125కు లభిస్తోంది.

ఉచిత బియ్యం పంపిణీకి మంగళం
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రేషన్‌ కార్డుదారులకు రెండు మాసాలకు సరిపడా కూపన్లు ఇచ్చిన విషయం విధితమే. ఒక్కో కార్డుదారుడికి ఐదు కిలోల చొప్పున ఉమ్మడి జిల్లాలో 11.88 లక్షల మంది కార్డుదారులకు సగటున 17,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేశారు. ఈ నెలతో ఆ కూపన్లు అయిపోయాయి. ఉచిత బియ్యం పంపిణీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని