logo

కొలువు మేళాలు లేక కలవరం

కర్నూలు జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలన్న లక్ష్యంతో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి అనుబంధ విద్యాలయంగా ఉన్న ఆర్‌యూను దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో కొత్తగా విశ్వవిద్యాలయంగా మార్చారు.

Updated : 29 Sep 2022 06:06 IST

ఆర్‌యూ పరిపాలన భవనం

న్యూస్‌టుడే, కర్నూలు(విద్యా విభాగం): కర్నూలు జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలన్న లక్ష్యంతో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి అనుబంధ విద్యాలయంగా ఉన్న ఆర్‌యూను దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో కొత్తగా విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుత ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆర్‌యూ విద్యార్థులకు కొలవుల మేళా అందని ద్రాక్షగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు జోరుగా నిర్వహిస్తున్నా ఆర్‌యూలో మాత్రం ప్రాంగణ ఎంపికలపై ఎలాంటి ఊసూ వినిపించడం లేదు. ఇక్కడే తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలన్న విద్యార్థుల కల కలగానే మిగిలిపోతోంది.

ప్రాంగణ ఎంపికలకు బయటికి వెళ్లాల్సిందే
ఆర్‌యూ క్యాంపస్‌లో పీజీ, బీటెక్‌లో సుమారు వెయ్యి మందికి విద్యార్థులు చదువుకుంటున్నారు. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు ప్రాంగణ ఎంపికలు జరగాల్సి ఉండగా 2017 నుంచి ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు సమాచారం. కొవిడ్‌ అనంతరం ఆన్‌లైన్‌ పద్ధతిలో ఒకసారి ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆర్‌యూలో బీటెక్‌ చివరి ఏడాదిలో సుమారు 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితోపాటు పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు సుమారు 500 మంది ఉన్నారు. బీటెక్‌ విద్యార్థులందరికీ ప్రాంగణ ఎంపికలు అవసరంకాగా పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఎంబీఏ, బీకాం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని నెలల కిందట ఆర్‌యూకు సమీపంలోని జి.పుల్లారెడ్డి, జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు వారు హాజరయ్యారు. బీటెక్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు తగిన ఉద్యోగాలు కల్పించడంలో ఆర్‌యూ నియామకాల అధికారులు విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థకు చెందిన జిల్లా కార్యాలయం ఆర్‌యూ క్యాంపస్‌లోనే ఉంది. స్థానికంగా ప్రభుత్వ శిక్షణ సంస్థ కేంద్రం ఉన్నా, ప్రాంగణ ఎంపికలు నిర్వహించడంలో అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో విరివిగా నిర్వహిస్తాం - రామకృష్ణ, ఆర్‌యూ నియామకాల అధికారి
ఆర్‌యూ క్యాంపస్‌లో కొవిడ్‌ కారణంగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించలేదు. కొవిడ్‌ అనంతరం ఉద్యోగమేళా నిర్వహించాం. దీనికి సంబంధించి ఫలితాలను ఆర్‌యూ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని విడుదల చేస్తాం. భవిష్యత్తులో విరివిగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించేందుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని