logo

నాపరాయి మందగమనం

కరోనా ప్రభావం.. ఆ తర్వాత కంటెయినర్ల కొరత.. ప్రస్తుతం పెరిగిన సముద్ర రవాణా ఛార్జీలు.. నాపరాయి పరిశ్రమను ఒడుదొడుకులకు గురిచేస్తోంది. ప్రస్తుతం 3 వేల కంటెయినర్ల ఉత్పత్తులు గుట్టుల్లా పేరుకుపోయాయి.

Published : 30 Sep 2022 01:37 IST

బేతంచెర్లలో భారీగా పేరుకుపోయిన ఉత్పత్తులు
పనుల్లేక ఉపాధి కోల్పోతున్న కార్మికులు

ఈనాడు - కర్నూలు, బేతంచెర్ల - న్యూస్‌టుడే: కరోనా ప్రభావం.. ఆ తర్వాత కంటెయినర్ల కొరత.. ప్రస్తుతం పెరిగిన సముద్ర రవాణా ఛార్జీలు.. నాపరాయి పరిశ్రమను ఒడుదొడుకులకు గురిచేస్తోంది. ప్రస్తుతం 3 వేల కంటెయినర్ల ఉత్పత్తులు గుట్టుల్లా పేరుకుపోయాయి. బేతంచెర్ల నుంచి ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూరప్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఏటా 1,200 నుంచి 1,500 కంటెయినర్లలో తరలిస్తుంటారు. స్థానికంగా, ఇతర రాష్ట్రాల్లో విక్రయాలు లేకపోవడంతో ఇతర దేశాలకు ఎగుమతులు మందగించడం, రవాణా ఛార్జీలు భారీగా పెరగడం వంటి కారణాలతో పరిశ్రమలు మూసివేసే పరిస్థితి నెలకొంది.

ఎన్నూరుకు వెళ్లడం దూరాభారం
* బేతంచెర్ల నుంచి నల్ల నాపరాయిని మొదట కృష్ణపట్నం ఓడరేవు (పోర్టు)కు తరలించి అక్కడి నుంచి నిర్దేశించిన ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. కృష్ణపట్నం నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న అదానీ సంస్థలు బల్క్‌ కార్గోపై దృష్టి సారించి కంటెయినర్ల కార్గో మూమెంట్‌ తగ్గించేశారు. ఇక్కడికి వచ్చే కంటెయినర్ల కార్గోలను ఎన్నూరు పోర్టుకు మళ్లిస్తున్నారు.
* బేతంచెర్ల నుంచి కృష్ణపట్నంకు 250 కి.మీ., ఎన్నూరు పోర్టుకు 400 కి.మీ ఉంటుంది. దూరం ఎక్కువగా ఉండటంతో ఒక్కో కంటెయినర్‌కు రూ.15 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

కార్మికుల ఉపాధిపై ప్రభావం
* ఎగుమతులు మందగించడం కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడి పరిశ్రమల్లో పని చేసేందుకు బిహార్‌, ఉత్తరఖాండ్‌, ఉత్తర్‌పదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ నుంచి కార్మికులు వచ్చారు. వీరికి నిత్యం రూ.700-రూ.1,000 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రూ.300 ఇవ్వడమే గగనమవుతోంది. కార్మికులను వారి  రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
* కృష్ణపట్నం నుంచి కంటెయినర్‌ కార్గో నడపాలని పోర్ట్స్‌ అథార్టీ, కాపెక్సిల్‌ ఎక్స్‌పోర్ట్‌ బోట్‌ కౌన్సిల్‌లో విన్నవించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు బేతంచెర్ల ఎగుమతిదారుడు, కాపెక్సిల్‌ సభ్యులు ఎం.ప్రేమ్‌ స్వరూప్‌ తెలిపారు.

పెరిగిన రవాణా ఛార్జీలు
లాజిస్టిక్‌తోపాటు సముద్ర రవాణా ఛార్జీలు ఆకాశాన్నంటాయి. యూఎస్‌కు గతంలో ఒక కంటెయినర్‌ తరలించడానికి 4-5 వేల డాలర్లు ఉండగా, ప్రస్తుతం మూడు రెట్లు పెరిగి 12 వేల డాలర్లకు చేరింది. అలాగే యూరప్‌కు గతంలో 1500-2 వేల డాలర్లు ఉండగా, ఇప్పుడు 5-6 వేల డాలర్లు ఛార్జీ వేస్తున్నారు. ఆస్ట్రేలియాకు కృష్ణపట్నం పోర్టు నుంచి గతంలో ఒక కంటెయినర్‌ రవాణాకు వెయ్యి డాలర్లు ఉండగా, ప్రస్తుతం 4-5 వేల డాలర్లకు పెంచేశారు.

ఖాళీ కంటెయినర్లు లేక
సరకు రవాణాకు కంటెయినర్ల కొరత వేధిస్తోంది. కొవిడ్‌ సమయంలో చాలా వరకు పోర్టుల్లో నిలిచిపోయాయి. ప్రస్తుతం రద్దీ పెరిగింది. ఎగుమతి నిమిత్తం సరకులు తీసుకెళ్లిన కంటెయినర్లు తిరిగి రావడానికి సమయం పడుతోంది. పండ్లు, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగిపోవడంతో కంటెయినర్లు దొరకడం లేదు.


సగం సంపాదన పోయింది - సుధాకర్‌, పత్తికొండ

నాపరాయి పరిశ్రమల్లో ఉపాధి పొందేందుకు ఏడేళ్ల కిందట కుటుంబంతో వచ్చా. పరిశ్రమలో డబుల్‌ కట్టర్‌ పాలిష్‌ చేస్తే నిత్యం రూ.700-900 వరకు వచ్చేది. నా భార్యకూ రూ.500-600 వరకు ఇస్తారు. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆరు నెలలుగా ఉపాధి దెబ్బతింది. యజమానులు పని కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. దసరా నేపథ్యంలో చిన్నచిన్న పనులు కల్పిస్తున్నారు. తక్కువ బండలు పాలిష్‌కు వస్తుండటంతో ఇద్దరికి కలిపి రూ.600 రావడమే గగనమవుతోంది.


నడిపించడం కష్టంగా ఉంది - గుండ్ల గోపాల్‌, యజమాని
నా పరిశ్రమలో 50 మంది వరకు కార్మికులు పని చేస్తారు. 2020 అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు కంటెయినర్ల కొరత ఉంది. సముద్ర రవాణాకు ఉపయోగించే కంటెయినర్‌ యూఎస్‌డీ (బాడుగ) రూ.600-వెయ్యి డాలర్లకు ఉండేది. ప్రస్తుతం 7-8 వేల డాలర్లకు పెరిగింది. గతంలో నెలకు 20-25 కంటెయినర్ల సరకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం నెలకు 2-3 లారీలు ఎగుమతి చేయడమే గగనమైంది. ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని