logo

అధికార పార్టీలో అలకలు

ఎమ్మిగనూరు పురపాలక పాలకవర్గంలో ముసలం పుట్టింది. ఉపాధ్యక్షుడు (వైస్‌ ఛైర్మన్‌) నజీర్‌ అహ్మద్‌ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వైస్‌ ఛైర్మన్‌ ధోరణిపై విసుగుచెంది ఈనెల 28న 15వ వార్డు కౌన్సిలర్‌ ఇసాక్‌ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు అందించారు.

Published : 30 Sep 2022 01:37 IST

ఎమ్మిగనూరు ఉపాధ్యక్షుడి తీరుపై పలువురు అసంతృప్తి
రాజీనామాకు సిద్ధపడిన 15వ వార్డు కౌన్సిలర్‌
కౌన్సిల్‌ సమావేశానికి 14 మంది సభ్యుల గైర్హాజరు

ఈనాడు - కర్నూలు : ఎమ్మిగనూరు పురపాలక పాలకవర్గంలో ముసలం పుట్టింది. ఉపాధ్యక్షుడు (వైస్‌ ఛైర్మన్‌) నజీర్‌ అహ్మద్‌ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. వైస్‌ ఛైర్మన్‌ ధోరణిపై విసుగుచెంది ఈనెల 28న 15వ వార్డు కౌన్సిలర్‌ ఇసాక్‌ తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు అందించారు. వారు బుజ్జగించడంతో రాజీనామా ఆలోచన విరమించుకున్నారు. ఇంతలోనే గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి వైకాపా కౌన్సిలర్లు సుమారు 14 మంది గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మిగనూరు పురపాలక పరిధిలో మంది 34 కౌన్సిలర్లు ఉండగా అందులో అధికార పార్టీకి చెందిన వారే 31 మంది ఉన్నారు. డాక్టర్‌ రఘును ఛైర్మన్‌గా, నజీర్‌ అహ్మద్‌ను వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. వైస్‌ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలన వ్యవహారాల్లో ఆయన పెత్తనం బాగా పెరిగింది. దీనిపై చాలా మంది కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నారు.

* మున్సిపాల్టీ పరిధిలో స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు, స్థల పంచాయితీలు, ఓ బార్‌ వ్యవహారంలోనూ భాగస్వామ్యం ఇవ్వడం వంటివి జీర్ణించుకోలేక కొందరు ఆది నుంచి గుర్రుగా ఉంటున్నారు.
* ఇతర వార్డుల్లోనూ వైస్‌ ఛైర్మన్‌ పెత్తనం చేయడం.. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం వంటి వాటితో అధికార పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. గతంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్‌ చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తన వార్డులో తాను సూచించిన పని ఏదీ జరగడం లేదు.. వైస్‌ ఛైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌ పెత్తనం పెరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పన్నులు ఎగ్గొట్టేందుకు
ఎమ్మెల్యే అండతో వైస్‌ ఛైర్మన్‌ తన బినామీలతో ఎమ్మిగనూరు మున్సిపాల్టీ పరిధిలో పలు సంతలకు సంబంధించి జకాయతీ వసూళ్ల వేలం దక్కించుకున్నారు. కొవిడ్‌ బూచిగా చూపించి సుమారు రూ.40 లక్షల డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. వాటిని రద్దు చేయాలంటూ గత కౌన్సిల్‌లో తీర్మానానికి పెట్టారు. బకాయిలు చెల్లించడానికి సదరు వేలం దక్కించుకున్న గుత్తేదారుడికి అధికారులు నోటీసులిచ్చారు. గుత్తేదారు బదులు వైస్‌ ఛైర్మన్‌ కుటుంబ సభ్యుల పేరుతో సుమారు రూ.9.34 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం. ఈ చెక్కు (నంబరు 079980) ఈ ఏడాది మార్చి 26వ తేదీ బౌన్స్‌ అయినట్లు తెలుస్తోంది.

69 గ్యాంగ్‌కు వత్తాసు
జకాయతీ వసూళ్లకు కొందరు యువకులను ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు 69 గ్యాంగ్‌ పేరుతో పట్టణంలో ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ గ్యాంగ్‌పై కేసు నమోదైంది. ఈ గ్యాంగ్‌కు వైస్‌ ఛైర్మన్‌, నియోజవర్గ ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని