logo

రబీ విత్తనంలో కోత

అక్టోబరు ఒకటి నుంచి రబీ సీజన్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికీ విత్తనాల సేకరణ, సరఫరా ప్రక్రియ వేగవంతం కాలేదు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన పప్పుశనగ, వేరుసెనగ విత్తనాలు తెప్పించాలని అధికారులు నిర్ణయించారు.

Published : 30 Sep 2022 01:37 IST

అక్టోబరు ఒకటి నుంచి  సీజన్‌
పప్పుశనగ విత్తన రాయితీ 25 శాతానికి కుదింపు
సన్న, చిన్నకారు రైతులపై భారం

ఏపీ సీడ్స్‌ సంస్థ గోదాములో పప్పుశనగ సంచులు

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే : అక్టోబరు ఒకటి నుంచి రబీ సీజన్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికీ విత్తనాల సేకరణ, సరఫరా ప్రక్రియ వేగవంతం కాలేదు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన పప్పుశనగ, వేరుసెనగ విత్తనాలు తెప్పించాలని అధికారులు నిర్ణయించారు. సీజన్‌ ప్రారంభంకానుండటంతో రాయితీ విత్తనం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం కానరావడం లేదు.

43,706 క్వింటాళ్లకు ప్రతిపాదనలు
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 3.20 లక్షల హెక్టార్లు కాగా అందులో అత్యధికంగా పప్పుశనగ 1.63 లక్షల హెక్టార్లు, జొన్న 33 వేలు, వరి 25 వేలు,  వేరుసెనగ 22,961, మొక్కజొన్న 10 వేలు, మినుము 38 వేలు, ఉల్లి 3,700, పొగాకు 
500 హెక్టార్లుగా ఉంది.
* రబీ సీజన్‌కు సంబంధించి అన్ని రకాలు కలిపి 43,706 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం అందుబాటులో ఉండే 10 వేల క్వింటాళ్ల పప్పుశనగను ఎక్కువగా సాగు చేసే మండలాలకు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలని ఈనెల 16న జరిగిన జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో వ్యవసాయాధికారులను కర్నూలు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. రబీలో ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలను సైతం పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.

ఖరారు కానీ ధరలు
* అక్టోబరు 1వ తేదీ నుంచి రబీ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు రైతులకు రాయితీపై ఇచ్చే విత్తనాల ధరలను ఇంత వరకు ఖరారు చేయలేదు. పప్పుశనగను 25 శాతం రాయితీపై, వేరుసెనగ విత్తన కాయలను 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయాధికారులకు ఆదేశాలు వచ్చాయి. క్వింటా ధర ఎంత.. రాయితీ పోనూ రైతు నాన్‌ సబ్సిడీ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ఆదేశాలు రాలేదు.
* బహిరంగ మార్కెట్‌లో పప్పుశనగ క్వింటా రూ.5,000 లోపు ఉంది. వేరుసెనగ క్వింటా రూ.7,000-రూ.7,500 ధర పలుకుతోంది. రాయితీ తగ్గడంతో రైతులకు విత్తనాలు, పెట్టుబడి భారం కానుంది.

ముందస్తుగా అందించాలన్నా...
జిల్లాలో అందుబాటులో ఉన్న 10 వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాన్ని ఆయా మండలాలకు ముందస్తుగా సరఫరా చేయాలని ఆదేశించి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు 2 వేల క్వింటాళ్లు కూడా ఆయా మండలాలకు చేరలేదు. మొదట 20 కిలోల విత్తనం ఇవ్వాలని నిర్ణయించారు.. ఆ తర్వాత దానిని 25 కిలోలకు పెంచారు. ఉమ్మడి జిల్లాకు సరిపడే విత్తనం ఏపీ సీడ్స్‌ దగ్గర అందుబాటులో లేదన్న విమర్శలున్నాయి. రెండు జిల్లాలకు కలిపి 17,300 క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉందని చెబుతున్నారు తప్ప ఆయా మండలాలకు అందులో సగం కాదు కదా.. 1,600 క్వింటాళ్లే ముందస్తు పొజిషన్‌ చేయడంపై నిర్దేశించిన లక్ష్యం మేరకు విత్తనం లేదని తేటతెల్లమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు