logo

మహాత్మా మన్నించు

గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలకమైంది. ఈ వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది సర్పంచులు, ప్రజాప్రతినిధులు. గ్రామీణాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది

Published : 02 Oct 2022 01:56 IST

సర్పంచుల ఆవేదన

పడకేసిన పల్లె ప్రగతి

నిధుల్లేక ఏం చేయలేకపోతున్నామని గాంధీ విగ్రహానికి విన్నవిస్తున్న సర్పంచులు (పాత చిత్రం)

గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలకమైంది. ఈ వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది సర్పంచులు, ప్రజాప్రతినిధులు. గ్రామీణాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది

- మహాత్మా గాంధీ

గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సర్పంచులు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలపాలని పిలుపు ఇస్తున్నట్లు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు.

పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకం. కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీలు పన్నుల రూపంలో సమీకరించుకున్న సాధారణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంది. దీంతో పంచాయతీ ఖజానాలో అణా పైసా లేదు. చేసేది లేక సర్పంచులు నిధులకు భిక్షాటన చేస్తున్నారు. మండల సభలో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు విన్నవిస్తున్నారు. స్పందన లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. పల్లెల్లో వీధి దీపం వెలగడం లేదు.. మంచినీటి ట్యాంకుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది.. మురుగు పేరుకుపోయి దోమలు జనాల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయని పల్లె ప్రథమ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జనం ఏకమై జలం తెచ్చుకుని

ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్లలో మందలూరు రహదారిలోని బీసీ కాలనీలో నీటి సమస్య ఏర్పడింది. బోరు మరమ్మతులకు గురికావడంతో వారం రోజుల నుంచి నీటి సరఫరా కావడం లేదు. ఆ కాలనీలోని 30 కుటుంబాలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేయలేక గ్రామ సర్పంచి చేతులెత్తేశారు. దీంతో సమస్య పరిష్కరించుకునేందుకు కాలనీవాసులంతా ఏకమయ్యారు. గుర్రప్ప యాదవ్‌, ప్రభాకర్‌, సురేష్‌, సుబ్బన్న, శేషయ్య, నాగరాజు, రాముడు, లింగమయ్యతోపాటు మరికొందరు చందాలు సేకరించి బోరుకు మరమ్మతులు చేయించారు.

పల్లె ఖాతాల్లో సున్నా నిధులు

ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీ ఆర్థిక సంఘ ఖాతాల్లో నిధులు సున్నా కాగా, పన్నుల రూపంలో (సాధారణ నిధులు ) వసూలు చేసిన అరకొర నిధులున్నాయి. వీటితో ఏం చేయలేకపోతున్నాం..  నిధులు మంజూరు చేయాలని ఇటీవల కొలిమిగుండ్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికినంద్యాల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు విన్నవించారు.

సొంతంగా రూ.కోటి ఖర్చు

ఆదోని మండలం పెద్దహరివాణానికి రూ.16 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సర్పంచి రామన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 7 సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, మట్టి రోడ్లు నిర్మించారు. ఉపాధి హామీ, పంచాయతీ నిధుల అనుసంధానంతో చేపట్టిన ఈ పనుల విలువ అక్షరాలా రూ.కోటి వరకు ఉంటుంది. ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదు.  నెలకు రూ.2 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన మండల పరిషత్‌ సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పు తెచ్చి.. సమస్య తీర్చి

గోనెగండ్ల మండలం అగ్రహారం పంచాయతీకి రూ.40 లక్షలొచ్చాయి. వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మంచినీటి సమస్య తీర్చాలని ప్రజలు ఒత్తిడి చేయడంతో సర్పంచి రంగారెడ్డి రూ. 5 లక్షలు అప్పు  తీసుకొచ్చి పనులు చేయించారు.

విధిలేక స్థలం విక్రయం

కోడుమూరు మండలం లద్దగిరి పంచాయతీ పరిధిలో సుమారు రూ.30 లక్షల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం తీసుకుంది. దీంతో పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పన కష్టతరమైంది. తాగునీరు అందడం లేదని గ్రామస్థులు స్పందనలో ఏకరవు పెట్టారు. చేసేది లేక సర్పంచి హనుమంతు కర్నూలులో తనకున్న నాలుగు సెంట్ల స్థలాన్ని విక్రయించి  సమస్యలు పరిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని