logo

దైవకార్యానికి కఠోర దీక్ష

జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు గత నెల 30న కంకణధారణ కార్యక్రమంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. దసరా అమావాస్య వస్తుందంటే మండలంలోని హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తుల్లో నిష్ఠ, నిబద్ధత నెలకొంటుంది.

Published : 02 Oct 2022 01:56 IST

బన్ని ఉత్సవాలు ముగిసే వరకు నిష్ఠ, నిబద్ధత

ప్రత్యేకత చాటుకుంటున్న మూడు గ్రామాల వాసులు

- న్యూస్‌టుడే, హొళగుంద

నెరణికిలో కొలువైన ఉత్సవమూర్తులు

జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు గత నెల 30న కంకణధారణ కార్యక్రమంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. దసరా అమావాస్య వస్తుందంటే మండలంలోని హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తుల్లో నిష్ఠ, నిబద్ధత నెలకొంటుంది. ఆ మూడు గ్రామాల భక్తులు కులమతాలకు అతీతంగా కఠోర దీక్షకు శ్రీకారం చుడతారు.

* హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దసరా బన్ని ఉత్సవాలు ప్రారంభానికి ముందే ఆయా గ్రామాల ప్రజలు మద్యం, మాంసం, ఇతర అంశాలకు దూరంగా ఉండటంతోపాటు కటిక నేలపైనే నిద్రపోతారు. బన్ని ఉత్సవాలు ముగిసే వరకు గ్రామస్థులెవరూ 15 రోజుల పాటు కాళ్లకు చెప్పులు సైతం ధరించరు. ఉత్సవమూర్తులను తిరిగి దక్కించుకోవడానికి తామంతా ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఏ ప్రలోభాలనూ దరిచేరనివ్వకుండా దైవకార్యమే ప్రధాన లక్ష్యమని విశ్వసిస్తారు. నెరణికిలో కొలువై ఉండే స్వామివారి ఉత్సవమూర్తులు దేవరగట్టుకు తరలించడంతోపాటు వాటిని బన్ని ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామానికి చేర్చే వరకు ప్రజలంతా ఈ కట్టుబాట్లు పాటిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.


భక్తులెవరూ కొట్టుకోరు

- రవి, నెరణికి

దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో మా మూడు గ్రామాలకు చెందిన భక్తులెవరూ కర్రలతో కొట్టుకోరు. ఉత్సవాలు ప్రారంభానికి ముందే ప్రజలంతా మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో వారిలో మంచి, చెడు ఆలోచించే విజ్ఞత వస్తుంది. కొంతమంది తాగి వచ్చి ఉద్దేశపూర్వకంగా కొట్టుకోవడం వల్ల బన్ని జైత్రయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంటోంది. మేము ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేస్తున్నాం.


తాగొచ్చిన కొందరి వల్లేఇబ్బందులు

- మరిమల్ల, నెరణికి

దశాబ్దాలుగా పెద్దలు పాటించిన ఆచారాలకు కట్టుబడి మూడు గ్రామాల ప్రజలు నడుచుకుంటున్నాం. బన్ని ఉత్సవాల్లో ఆయా గ్రామాల భక్తులెవరూ కర్రలతో కొట్టుకోరు. ఇతర ప్రాంతాల నుంచి తాగొచ్చిన కొందరి వల్ల ఇబ్బందులు తప్పటం లేదు. ఫలితంగా మా మూడు గ్రామాల భక్తులకు చెడ్డపేరు వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు