logo

నాడు-నేడు.. వసతులు సమకూరితే మేలు

ఇంటర్మీడియట్‌ నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వ్యక్తిగత విలువలు నేర్పించాలి. అప్పుడే వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు దోహదపడుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

Published : 03 Oct 2022 01:51 IST
జూనియర్‌ కళాశాలలకు నిధుల కేటాయింపు
అదనపు గదుల నిర్మాణం అవసరం

కర్నూలు (విద్యా విభాగం), ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వ్యక్తిగత విలువలు నేర్పించాలి. అప్పుడే వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు దోహదపడుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్నింటిలో వసతులు కరవయ్యాయి. ఈ నేపథ్యంలో మనబడి నాడు-నేడు రెండో విడతలో భాగంగా విద్యుత్తు, నీటి వసతి, మరుగుదొడ్లు, ప్రహరీ, బండ పరుపుతోపాటు చిన్నచిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడంతోపాటు వసతులు ఏర్పాటుచేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనైనా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు సమకూరుతాయని   విద్యార్థులు ఆశాభావం వ్యక్తం  చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు ఎయిడెడ్‌, ఆదర్శ, కేజీబీవీ, ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలు 69 వరకు ఉన్నాయి. వీటిల్లో 43 జూనియర్‌ కళాశాలలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రెండో విడత మనబడి నాడు-నేడు కింద రూ.31.09 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులు పూర్తి స్థాయిలో జరిగితే విద్యార్థులకు వసతులు సమకూరే అవకాశం ఉంది. ఈ 43 విద్యాలయాల్లో 16,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతులు సమకూరితే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.

తప్పని ఇబ్బందులు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అవసరమైన అదనపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల సహకారంతో పలు ప్రాంతాల్లో గదులు కట్టించినా పర్యవేక్షణ లేకపోవడంతో వసతులు సమకూరలేదు. మనబడి నాడు-నేడు కింద అదనపు గదుల ప్రస్తావన లేకపోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ వాటికి సైతం నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిధులతో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.


మరుగుదొడ్లు లేక..

నగరంలోని ప్రభుత్వ టౌన్‌ జూనియర్‌ కళాశాలలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో డీవీఈవో కార్యాలయం వెనుక ఉన్న పాత  బడిన మరుగుదొడ్డిని మూత్ర విసర్జనకు ఉపయోగించుకుంటున్నారు. ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తూనే ఉంది. ప్రస్తుతం కళాశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.29 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా సమస్యలు తీరుతాయో.. లేదో.. చూడాల్సి ఉంది.


ప్రహరీ కరవు

ఆళ్లగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు నూతన భవనం నిర్మించినప్పటికీ ప్రహరీ లేకపోవడంతో పందులు, పశువులు యథేచ్ఛగా కళాశాల ఆవరణలో తిరుగుతున్నాయి. పరిసరాలను అపరిశుభ్రం చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 192 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాలయాన్ని నాడు-నేడు కింద అభివృద్ధి చేసేందుకు రూ.78 లక్షలు మంజూరయ్యాయి.


నాణ్యతగా చేపట్టాలని సూచించాం
- జమీర్‌పాషా, డీవీఈవో, కర్నూలు

మనబడి నాడు-నేడు కింద ఉమ్మడి జిల్లాలో ఉన్న 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఎంపిక చేశాం. వీటిలో త్వరగా పనులు ప్రారంభించి నాణ్యతగా చేపట్టాలని సూచనలు జారీ చేశాం. అదనపు గదుల     విషయమై ప్రభుత్వానికి త్వరలో నివేదిక పంపనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని