logo

హక్కు పత్రాలు.. అవే తప్పిదాలు

సమగ్ర భూసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు (ఆర్వోఆర్‌లు) అందజేసే అంశం గందరగోళంలో పడింది. 2వ తేదీన వీటిని ఇచ్చేలా చర్యలు చేపట్టారు. పత్రాలు ముద్రించి జాబితాలు సిద్ధం చేశారు. ఇవ్వడమే తరువాయి అన్న దశలో చాలా మండలాలకు హక్కు పత్రాలు రాలేదు.

Published : 03 Oct 2022 01:57 IST

సా..గుతున్న సమగ్ర భూసర్వే ప్రక్రియ


భూ హక్కు పత్రాలను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సమగ్ర భూసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు (ఆర్వోఆర్‌లు) అందజేసే అంశం గందరగోళంలో పడింది. 2వ తేదీన వీటిని ఇచ్చేలా చర్యలు చేపట్టారు. పత్రాలు ముద్రించి జాబితాలు సిద్ధం చేశారు. ఇవ్వడమే తరువాయి అన్న దశలో చాలా మండలాలకు హక్కు పత్రాలు రాలేదు. కొన్ని మండలాలకు వచ్చినా తప్పులు దొర్లడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ సందిగ్ధంలో పడింది.

కార్యాచరణ రూపొందించి..

బ్రిటిషు కాలంలో నిర్వహించిన భూ ‘రీసర్వే’ ప్రకారమే ఇప్పటివరకు భూ వ్యవహారాలు, రెవెన్యూ రికార్డులు కొనసాగుతున్నాయి. కొన్ని తప్పిదాల కారణంగా వాటిలో తేడాలున్నాయి. ఈ క్రమంలో సమగ్ర భూసర్వే, రికార్డు స్వచ్ఛీకరణ పేరుతో రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 2020 డిసెంబరు 22న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని ప్రారంభించారు.

నోడల్‌ అధికారుల నియామకం

హక్కు పత్రాలను పరిశీలించి పొరబాట్లు గుర్తించడం, ఆర్వోఆర్‌లను మండలాలకు చేర్చేందుకు డీఆర్వో, సర్వే, భూరికార్డుల ఏడీలను నోడల్‌ అధికారులుగా నియమించారు. హక్కు పత్రాల పరిశీలనకు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహసీల్దార్లను నియమించారు. కొన్నిచోట్ల సమగ్ర సర్వే తూతూమంత్రంగా జరగడం, చాలాచోట్ల 9(2) నోటీసులు ఎందుకిస్తున్నామో చెప్పకుండా రైతుల సంతకాలు తీసుకోవడం, మరికొన్నిచోట్ల రైతులకు అసలు సమాచారం ఇవ్వకుండా మీ భూముల దస్తావేజులు, పట్టాదారు పాసు పుస్తకాలు పంపమని చెప్పి మిగతా ప్రక్రియను వాటి ఆధారంగా పూర్తి చేసేయడం, వ్యాలిడేషన్‌ కచ్చితంగా జరగలేదనే అభియోగాలు వినిపించినట్లుగానే, భూహక్కు పత్రాల్లోనూ తప్పులు దొర్లినట్లు సమాచారం.


63 గ్రామాల్లో సర్వే పూర్తి

ర్నూలు జిల్లాలో 13 మండలాల్లో తొలి విడతగా 63 గ్రామాల్లో సమగ్ర భూసర్వే ప్రక్రియ పూర్తైంది. పెద్దకడబూరు మండలంలో 14 గ్రామాలు, ఎమ్మిగనూరు 13, గోనెగండ్ల 8, కోసిగి 7, కౌతాళం 6, నందవరం 4, మంత్రాలయం 3, ఆలూరు 2, ఆస్పరి 2 తదితర మొత్తం 63 గ్రామాల్లో సర్వే అనంతరం, ఆర్‌ఎస్‌ఆర్‌ నంబర్ల ప్రకారం ఆర్వోఆర్‌లు పంపిణీ చేసేలా రంగం సిద్ధం చేశారు. సర్వే నంబర్ల స్థానాల్లో ఎల్‌పీఎం నంబర్లు వచ్చాయి. మరో 13 మండలాల్లో ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తి కాలేదు. నంద్యాల జిల్లాలో మొదట ప్రయోగాత్మకంగా ఒకటి.. ఆ తర్వాత మరో రెండు.. ప్రస్తుతం 8 కలిపి 11 గ్రామాల్లో సర్వే పూర్తైంది.

* ప్రప్రథమంగా కల్లూరు మండలం పందిపాడు.. ఆ తర్వాత ఆలూరు మండలం కాత్రికి, నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే చేపట్టారు.  


పలు పొరబాట్ల గుర్తింపు

* మొదటి విడతలో జిల్లాలో 63 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయ్యింది. అక్టోబరు 2న భూహక్కు పత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యపడలేదు. నవంబరులో పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి మొదటగా ఆరు గ్రామాల భూ హక్కు పత్రాలను ప్రభుత్వం జిల్లాకు పంపింది. అందులో ప్రయోగాత్మకంగా చేపట్టిన కల్లూరు మండలం పందిపాడు, ఆలూరు మండలం కాత్రికి గ్రామాలకు సంబంధించిన పత్రాలు రాలేదు.

భూహక్కు పత్రాలను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపి ఏమైనా తప్పులు దొర్లాయా అని జేసీ పరిశీలన చేయిస్తున్నారు. వచ్చిన ఆ కొన్ని హక్కు పత్రాల్లో కొన్నింటికి ఎల్‌పీఎం నంబర్లు రాలేదని, కొన్ని పుస్తకాల్లో చిత్రాలు  రాలేదని, అక్కడక్కడా తప్పులు దొర్లాయని గుర్తించారు. వాటిని ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ ఖాతా నంబరు, ఎల్‌పీఎం నంబరులో తప్పులు దొర్లాయో రాసుకుంటున్నారు. సరిచేసి మళ్లీ ముద్రించి పత్రాలు ఇవ్వనున్నారు.

* నంద్యాల జిల్లాకు భూహక్కు పత్రాలు ఇంకా రాలేదు. మూడు లేదా 11 గ్రామాలకు సంబంధించి హక్కు పత్రాలు రానున్నాయని   అధికారులు చెబుతున్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని