logo

ఆరోగ్య విజయీ భవ

అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన రోజు ఇది. దశాయుధ పోరాటం కావడంతో విజయదశమి అన్నారు. దశ దుర్గుణాలను సంహరించినందుకు ఈ పేరు వచ్చింది.

Published : 05 Oct 2022 02:32 IST

దశ దుర్గుణాలను సంహరించేద్దాం

ఈనాడు - కర్నూలు

అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన రోజు ఇది. దశాయుధ పోరాటం కావడంతో విజయదశమి అన్నారు. దశ దుర్గుణాలను సంహరించినందుకు ఈ పేరు వచ్చింది. బద్దకం, మితిమీరిన ఆహారం తీసుకోవడం.. వ్యాయామానికి దూరం కావడం.. మద్యం, ధూమపానం, బెట్టింగ్‌-పేకాట వంటి వ్యసనాలు, సామాజిక మాధ్యమాల్లో గడపటం, తోటివారితో దురుసుగా ప్రవర్తించడం తదితర దుర్గుణాలకు చెక్‌ పెట్టేందుకు ఓ లక్ష్యం పెట్టుకుందాం. ప్రధానంగా ఆరోగ్య విజయాన్ని సాధించేందుకు దసరా పండగ నుంచే తొలి అడుగు వేద్దాం.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో రోజువారీగా తీసుకునే క్యాలరీలు బాగా పెరిగాయి. చాలామంది తమకు నచ్చింది ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇచ్చి కదలకుండా కూర్చొని ఆరగించేశారు. చాలామంది మైదానాలకు, వ్యాయామానికి దూరమయ్యారు. ప్రస్తుతం చిన్న పనిమీద బయటకు వెళ్లాలన్నా ద్విచక్రవాహనం లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నడకను పూర్తిగా మరిచారు. కొవిడ్‌తో రెండేళ్లు కొత్త దుస్తులకు దూరంగా ఉన్న చాలామంది, దసరా పండగకు పెద్ద సంఖ్యలో షాపింగ్‌లు చేస్తున్నారు. ఈ సమయంలో అందరూ అవాక్కవుతున్న విషయం ఏమిటంటే కొత్త దుస్తులకు సంబంధించి అందరి కొలతలు మారిపోయాయి.

ఎంత మేరకు అవసరమంటే....
రోజువారీ అవసరాలకు ఆరోగ్యకర వ్యక్తికి 2,600-2,800 కిలో క్యాలరీల వరకు, మహిళలకైతే 2,200-2,400 వరకు సరిపోతాయి.  కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి చోట్ల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. జంక్‌ఫుడ్‌ లేనిదే రోజు గడవడం లేదు. ఉమ్మడి జిల్లాలో చాలామంది 3 వేల నుంచి 4 వేల క్యాలరీలు ఒంట్లోకి పంపిస్తున్నారు. దసరా పురస్కరించుకుని పిండి వంటలు, మిఠాయిలతో మరిన్ని క్యాలరీలు ఒంట్లోకి వెళ్లనున్నాయి.

ఎప్పటికప్పుడు సరిచేయకపోతే?
అదనపు క్యాలరీలను ఎప్పటికప్పుడు సరిచేయకపోతే శరీరంలో వేర్వేరు భాగాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదముంది. బొజ్జ పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడతాయి. చాలా మంది సమయం కేటాయించక.. మరికొందరు బద్దకంతో వ్యాయామాన్ని వాయిదా వేస్తున్నారు. ఫలితంగా టైప్‌-2 మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చాలామంది మధుమేహం, రక్తపోటు బారిన పడినట్లు వారు చెప్పారు. కర్నూలు సర్వజన వైద్యశాలకు ప్రతి సోమవారం 2 వేలకుపైగా ఓపీ వస్తుండగా వీరిలో 40 శాతానికిపైగా జనం మధుమేహం, ఊబకాయం సమస్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని