logo

Super Star Krishna: నల్లమలలో నటశేఖరం

మహానంది-కృష్ణనంది పుణ్యక్షేత్రాల మధ్యలోని నల్లమల అడవిలో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన పలు సినిమాల చిత్రీకరణ జరిగింది.

Updated : 16 Nov 2022 09:28 IST

పలు సినిమాల చిత్రీకరణ

345 సినిమా పేర్లతో హీరో కృష్ణ చిత్రం

నంద్యాల గాంధీచౌక్‌, మహానంది, శ్రీశైలం ఆలయం, బనగానపల్లి, న్యూస్‌టుడే: మహానంది-కృష్ణనంది పుణ్యక్షేత్రాల మధ్యలోని నల్లమల అడవిలో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన పలు సినిమాల చిత్రీకరణ జరిగింది. 1970-71 ప్రాంతంలో ‘ఇల్లు-ఇల్లాలు’ సినిమా పాట చిత్రీకరణ ఇక్కడే చేశారు. ఈ సినిమా 1972 డిసెంబరులో విడుదలైంది. 1973 డిసెంబరు 28న విడుదలైన ‘మీనా’ సినిమాను నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన గాజుల పెద్దమల్లయ్య నందిని ఫిలిమ్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. నంద్యాల పట్టణానికే చెందిన ఆనాటి ఉపాధ్యాయులు పసుపులేటి హుస్సేన్‌ శెట్టి, జంబన్న, కరెంట్‌ తిరుపాలు కృష్ణ సినిమాల్లో రౌడీ పాత్రల్లో నటించారు. పోరాట సన్నివేశాలూ నంద్యాల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అదే విధంగా నంద్యాలకు చెందిన నిర్మాతలు ‘అత్తాకోడళ్లు’ సినిమాను సైతం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం నంద్యాలలోని నేషనల్‌ టాకీస్‌లో 100 రోజుల వేడుకలకు కృష్ణ వచ్చి నిర్మాతలతో కలిసి బహుమతులు అందించారు. 1991లో ‘రక్తతర్పణం’ చిత్ర నిర్మాణం శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ చిత్రంలో ఒక పాట చిత్రీకరణ ఇక్కడే జరిగింది.  సూపర్‌స్టార్‌ కృష్ణ కాంగ్రెస్‌ తరఫున నంద్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

సూపర్‌స్టార్‌కు చిత్ర నివాళి

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తూ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేశ్‌ వినూత్న రీతిలో నివాళి అర్పించారు. 345 సినిమా పేర్లతో కృష్ణ చిత్రపటాన్ని వేశారు. 14 అంగుళాల పొడవు, 10 అంగుళాల డ్రాయింగ్‌ షీట్‌పై మైక్రో పెన్నుతో ఎక్కడ గీతలు లేకుండా 3 గంటల పాటు శ్రమించి చిత్రాన్ని గీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని