logo

శుభ్రంగా మింగేస్తున్నారు

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. శుభ్రత కోసం ప్రతి నెలా రూ.అర లక్షకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యార్డు ఆవరణమంతా చెత్త దిబ్బలతో నిండిపోయింది.

Updated : 25 Nov 2022 03:36 IST

షెడ్ల మధ్యలో డంపింగ్‌ యార్డును తలపించేలా వ్యర్థాలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. శుభ్రత కోసం ప్రతి నెలా రూ.అర లక్షకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యార్డు ఆవరణమంతా చెత్త దిబ్బలతో నిండిపోయింది. విపణికి వచ్చే ఆదాయానికంటే ఖర్చు అధికంగా ఉండటం గమనార్హం. చెత్త తొలగించే పేరుతో పెద్దఎత్తున నిధులు పక్కదారి పడుతున్నాయి.

న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్‌

ఏటా రూ.600 కోట్ల వ్యాపారం

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు కర్నూలు, నంద్యాల, తెలంగాణ రాష్ట్రం గద్వాల, వనపర్తి, కర్ణాటక రాష్ట్రం నుంచి రైతులు పంట ఉత్పత్తులు తీసుకొస్తారు. సీజన్‌లో నిత్యం 600 నుంచి 1,000 మంది వరకు అన్నదాతలు వస్తుంటారు. ఇక్కడ ఏటా రూ.600 కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారు. ఏటా రూ.4- కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు సెస్‌ రూపంలో ఆదాయం సమకూరుతోంది.

పొంతన లేని ఖర్చులు

వ్యవసాయ మార్కెట్లో వివిధ పనుల పేరుతో పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేసిన డబ్బులకు.. పొంతన లేని లెక్కలు చూపిస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారు. మిస్లేనియస్‌ కింద ఆరు నెలలకు రూ.3.58 లక్షలు, అన్‌ఫోర్సిన్‌ ఖర్చుల కింద రూ.7.10 లక్షలు.. మొత్తం రూ.10.68 లక్షలు ఖర్చు చేసేయడం గమనార్హం. తక్షణమే చేయాల్సిన పనులకు సంబంధించి ఆ నిధులు వెచ్చించినట్లు అధికారులు చెబుతున్నారు.

కమిషనర్‌ ఆదేశాలు బుట్టదాఖలు

* కర్నూలు పెద్దమార్కెట్లో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.. ఛీ.. కంపు కొడుతోంది. చెత్తను తరలించేందుకు నగర పాలక సంస్థకు బాధ్యతలు అప్పగించాలని ఈ ఏడాది జూన్‌ 6న కర్నూలు మార్కెట్‌ యార్డు సందర్శనకు వచ్చిన మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

* మార్కెట్లో చెత్తాచెదారాలు, కుళ్లిన కూరగాయలు, ఇతరత్రా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. గుట్టలుగా పేరుకుపోయి చెత్త దిబ్బల మధ్య ఉల్లి, మిరప తదితర క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రైతులు, హమాలీలు, కూలీలు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు.. ఇలా అందరూ ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి నెలా టన్నుల సంఖ్యలో చెత్త ఉత్పత్తి అవుతోంది. దానిని ఉల్లి, మిరప షెడ్ల మధ్యలో గుట్టలుగా వేస్తున్నారు.

రక్షణ కోసం 35 మంది నియామకం

* మార్కెట్‌లోకి పందులు, పశువులు వస్తుండటంతో పంట ఉత్పత్తులు, కూరగాయలకు పెద్దఎత్తున నష్టం జరుగుతోంది. విపణిలో 35 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండి పందులను తరలించలేరా అంటూ కమిషనర్‌ తన పర్యటన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఈ నేపథ్యంలో కేవలం పందులు, పశువులను పాత, కొత్త మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కమిషనర్‌ ఆదేశాలమేరకు పాలకవర్గం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. గత ఆగస్టు నుంచి 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.10,500 చెల్లిస్తున్నారు.

* ఇంతమందిని నియమించినా విపణిలోకి పందులు, పశువులు యథేచ్ఛగా వస్తూనే ఉండటం గమనార్హం. రక్షణ సిబ్బందికి ప్రతి నెలా రూ.1.50 లక్షలకుపైగా వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. ‘‘ చెత్తను బయటకు తరలించేందుకు నగరపాలక సంస్థతో పలుమార్లు మాట్లాడాం.. సంబంధిత అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదని’’ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి గోవిందు పేర్కొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts