logo

అధికారంలో ఆధిపత్య పోరు

అధికార పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది.

Updated : 25 Nov 2022 11:35 IST

బాలనాగిరెడ్డి మార్పుతో బహిర్గతం

ఈనాడు - కర్నూలు: అధికార పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. ఇసుక, మద్యం, భూ దందాలు, పదవులు.. ఇలా ప్రతిదాంట్లో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఇద్దరేసి నాయకులుండటం.. వారి మధ్య సఖ్యత కుదరడం లేదు.

కర్నూలులో నువ్వా.. నేను

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాల మధ్య మూడున్నరేళ్లుగా వర్గ పోరు నడుస్తోంది. తాజాగా దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.  జిల్లాలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఎస్వీ మోహన్‌రెడ్డి ఓ హోటల్‌ అధినేత పేరుతో ఉపగుత్తకు దక్కించుకున్నారు. ఈ విషయం కోడుమూరు, కర్నూలు, పాణ్యం, మంత్రాలయం నియోజకవర్గాల నేతలకు మింగుడు పడలేదు. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేరోదారిలో వెళ్లారు. ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదాలు, సభలు, సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణలలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు.

ఎమ్మిగనూరులో ఏం జరిగింది

వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వయసు మీదపడటంతో ఆ సీటు మాకిస్తే గెలుచుకొస్తామంటూ కొందరు అమరావతి స్థాయిలో పావులు కదుపుతున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన కుమారుడిని పోటీలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరులో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ భూ పంచాయితీలు, సెటిల్‌మెంట్లు తన కుమారుడు ధరణీరెడ్డితోనే చేయిస్తున్నారు. నందవరంలో ఓ వర్గాన్ని తయారు చేశారు. ఇవన్నీ స్థానికంగా బలం పెంచుకోవడానికేనని తెలుస్తోంది. బాలనాగిరెడ్డి కుటుంబం మద్దతు తీసుకోవాలని 2019 ఎన్నికల సమయంలో జగన్‌ కోరారు. ఓటమి అయినా.. గెలుపైనా తనదే బాధ్యతంటూ చెన్నకేశవరెడ్డి తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి నడుస్తోంది. చేనేతలు ఎక్కువగా ఉన్నారు.. కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రయత్నాలు చేస్తున్నారు.

కోడుమూరులో కొట్లాట....

కోడుమూరు సమన్వయకర్త కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్‌ మధ్య విభేదాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుధాకర్‌కు టిక్కెట్‌ ఇస్తే పార్టీకి పని చేయలేమని కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరుకు చెందిన వైకాపా నాయకులు జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. వారంతా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వర్గం కావడం గమనార్హం. కోడుమూరు పట్టణంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గడప-గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, కొందరు ఎంపీటీసీలు ఎమ్మెల్యేతో తిరగలేదు.

ఎమ్మెల్సీ కోసం పావులు

అవుకు ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మరణంతో పదవీ కాలం నాలుగు నెలలు మిగిలిపోయింది. ఈ పదవి భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మికి ఇచ్చే అవకాశాలున్నా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. అయితే తర్వాత వచ్చే ఎమ్మెల్సీ పదవి కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మాజీ జడ్పీ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు సాగిస్తుండగా, శిల్పా వర్గం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

బైరెడ్డి... ఆర్థర్‌

నందికొట్కూరు సమన్వయకర్త, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గాల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బైరెడ్డి వర్గం పట్టణంలో ఎమ్మెల్యే వెంట నడవలేదు. మార్కెట్‌ ఛైర్మన్‌ పదవి సిద్ధార్థరెడ్డి ఒకరిని ఎంపిక చేయగా ఎమ్మెల్యే తన వర్గానికి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని