భూ హక్కు పత్రం.. తప్పుల మయం
ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష పథకం ముందుకు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సర్వే పూర్తైనా ఇప్పటివరకు హక్కు పత్రాలు అందలేదు.
15 రోజుల్లో పంపిణీ సాధ్యమేనా?
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం
1. మహా యజ్ఞంలా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం అమలు చేస్తున్నాం. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 15 రోజుల్లో భూ యజమానులకు హక్కు పత్రాలను పంపిణీ చేస్తాం.
- ఈనెల 23 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.
2. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే 15 రోజుల్లో హక్కు పత్రాల పంపిణీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.వచ్చిన పత్రాల్లో తప్పులు దొర్లాయి. వాటిని సరిచేసి రెండోసారి హక్కు పత్రాలు ముద్రించి జిల్లాకు పంపించాలి. వాటిని యజమానులకు అందజేయాలి.. ఈ ప్రక్రియ కొనసాగడానికి కచ్చితంగా నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
పందిపాడు గ్రామ సచివాలయం వద్ద హద్దు రాళ్ల కుప్ప
ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష పథకం ముందుకు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సర్వే పూర్తైనా ఇప్పటివరకు హక్కు పత్రాలు అందలేదు. వచ్చిన వాటిలో తప్పులు ఉండటంతో తిరిగి వెనక్కి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. 2020 డిసెంబరు 21న కల్లూరు మండలం పందిపాడులో పైలెట్ ప్రాజెక్టు కింద భూముల రీసర్వే చేపట్టారు. సర్వే పూర్తి చేశారు. ఈ గ్రామంలో ఏడు వందల సర్వే నంబర్లు ఉండగా 520 ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయి. సుమారు 326 ఖాతాలు ఉన్నాయి. సర్వే పూర్తై ఏడాదవుతున్నా ఇప్పటివరకు ఒక్క రైతుకు భూ హక్కు పత్రం పంపిణీ చేయలేదు. భూ వివాదాలు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. కొందరు రైతుల భూముల్లో హద్దు రాళ్లు పాతలేదు. రీసర్వే సంపూర్ణంగా పూర్తయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూ వివాదాలు, కోర్టు కేసులు తదితర వాటికి మొబైల్ కోర్టులను ఏర్పాటుచేసి పరిష్కరిస్తామని చెప్పినా... ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టలేదు.
పరిశీలిస్తున్న అధికారులు
77 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో కల్లూరు మండలం పందిపాడు, ఆలూరు మండలం కాత్రికి, నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వే పూర్తయ్యింది. మూడు గ్రామాలకు హక్కు పత్రాలు రాలేదు.
* కర్నూలు జిల్లాలో 472 రెవెన్యూ గ్రామాలు ఉండగా, నంద్యాల జిల్లాలో 441 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 913 రెవెన్యూ గ్రామాలకుగాను 77 గ్రామాల్లోనే సమగ్ర భూముల రీ సర్వే పూర్తైంది. భూ దస్త్రాల స్వచ్ఛీకరణ పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయి.. 80 శాతం పీవోఎల్‌ఆర్ పనులు చివరి దశకొచ్చాయి. భూ దస్త్రాల స్వచ్ఛీకరణ పూర్తయితేనే రీ సర్వే పనులు చేపట్టేందుకు వీలుంటుంది.
* నంద్యాల జిల్లాలో 11 గ్రామాల్లో రీసర్వే పూర్తయినప్పటికీ.. అక్కడా హక్కు పత్రాల పంపిణీ ప్రారంభానికి నోచుకోలేదు. సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి అరకొరగా పత్రాలొచ్చాయి. వాటిని పరిశీలించి తప్పులను గుర్తించి నివేదికలు పంపారు. శాశ్వత హక్కు పత్రాలు రాలేదు.
పత్రాలు దోషాలమయం
* దేవనకొండ మండలంలో పొట్లపాడు, తిమ్మాపురం, పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు, తారాపురం గ్రామాలు మినహా 62 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాలు పాక్షికంగా వచ్చాయి. సెప్టెంబరు 30న 1,200, అక్టోబరు 2న 15,223 పత్రాలు వచ్చాయి. కర్నూలు కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆయా మండలాల రెవెన్యూ అధికారులతోపాటు, ఇతర మండలాల అధికారులతో వీటిని పరిశీలన చేయించారు. వచ్చిన పత్రాల్లో 80 శాతం వరకు తప్పులు ఉన్నట్లు గుర్తించారు. సీసీఎల్‌ఏ రూపొందించిన నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు అప్‌లోడ్ చేశారు. వీటిని తిరిగి ముద్రించి పంపలేదు.
* అక్టోబరు, నవంబరు నెలల్లో ఇప్పటి వరకు కలిపి మొత్తం 37,397 హక్కు పత్రాలు కర్నూలు జిల్లాకు వచ్చాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన మండలాలకు ప్రస్తుతం పంపారు. సర్వే పూర్తయిన గ్రామాలన్నింటికీ కలిపి సుమారు 70 వేలకు పైగా హక్కు పత్రాలు రావాల్సి ఉంది. అందులో సగం వరకే రావడం గమనార్హం.
గుర్తించినా సరిదిద్దలేదు
భూ హక్కు పత్రాల్లో జండర్ (పురుషుడి స్థానంలో మహిళ, మహిళ స్థానంలో పురుషుడి ఫొటోలు, పేర్లు తప్పుగా రావడం), పత్రాల్లో ముద్రించిన పేర్లలో తప్పులు, యూపీఐ నంబరు, విస్తీర్ణంలో తేడాలు, చిరునామాలో తప్పులు, చరవాణి, ఆధార్ సంఖ్యలు తప్పుగా వచ్చాయి. ఎల్‌పీఎం నంబర్లు, మ్యాపులు లేకుండా కొన్ని పత్రాలు ముద్రించారు. వీటిని సమగ్రంగా పరిశీలించి మళ్లీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సీసీఎల్‌ఏకు పంపాలి.. సీసీఎల్‌ఏ నుంచి మళ్లీ ముద్రించిన తర్వాత జిల్లాకు పంపుతారు.. మొదటిసారిగా తప్పులు గుర్తించి పంపిన వాటికే ఇప్పటివరకు దిక్కు లేకుండా పోయింది..
ఎప్పుడిస్తారో..
- పూల ఆంజనేయులు
మాది కల్లూరు మండలం పందిపాడు. గతేడాది చివరి నాటికి భూముల రీసర్వే పూర్తైందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూ వివాదాలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. పొలాల మధ్య హద్దు రాళ్లు కొన్నిచోట్ల పాతాల్సి ఉంది. భూ విస్తీర్ణంలో తేడాలున్నాయి. భూ హక్కు పత్రాలు ఇంత వరకు పంపిణీ చేయలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?