logo

ఓపీక పరీక్షించిన ఈ-ఆసుపత్రి

ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ పేరుతో యూనిక్‌ ఐడీ కార్యక్రమం (ఆన్‌లైన్‌ వైద్యసేవలు) అమలు రోగులకు పరీక్ష పెట్టింది.   కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఆన్‌లైన్‌ వైద్య సేవలు  శనివారం ప్రారంభించారు.  

Updated : 27 Nov 2022 04:01 IST

సర్వజన ఆసుపత్రిలో రోగుల అవస్థలు  
వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ

ఓపీ కోసం రోగులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ పేరుతో యూనిక్‌ ఐడీ కార్యక్రమం (ఆన్‌లైన్‌ వైద్యసేవలు) అమలు రోగులకు పరీక్ష పెట్టింది.   కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఆన్‌లైన్‌ వైద్య సేవలు  శనివారం ప్రారంభించారు.  భవిష్యత్తులో రోగులకు దేశంలో ఎక్కడైనా వైద్యం అందించేలా ఈ-హాస్పటల్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా.. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. గతంలో ఓపీ చీటీ ఇచ్చేందుకు నిమిషం సమయం పట్టేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ పేరుతో సమగ్రంగా వివరాలన్నీ నమోదు చేస్తుండటంతో ఒక్కో ఓపీ చీటీ ఇచ్చేందుకు కనీసం ఎనిమిది నిమిషాలు పట్టింది. దీంతో రోగులు ఉదయం 7 నుంచి మధ్యాహ్న రెండు గంటల వరకు నిరీక్షించారు. ‘ఓపీ’కలేక చాలా మంది వెనుదిరిగారు.

కొరవడిన ముందస్తు ఏర్పాట్లు

ఈ-ఆసుపత్రిలో భాగంగా వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన కంప్యూటర్లతోపాటు సిబ్బందిని నియమించాలి. ఇవేమీ లేకుండానే.. ముందస్తు చర్యలు కానరాకుండానే ఆసుపత్రి కోఆర్డినేటర్‌ మురళీధర్‌రెడ్డి వస్తున్నారన్న ఉద్దేశంతో హడావుడిగా ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించారు. ఓపీ కౌంటరులో ఇద్దరే పనిచేస్తున్నారు. అదనంగా మరో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను పెట్టి శనివారం ఓపీలు ఇవ్వడం ప్రారంభించారు. రోగులు బారులుదీరడం.. వరుస ఎంతకీ కదలకపోవడతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం వరుసలో నిల్చున్నవారికి మధ్యాహ్నం ఓపీ అందింది. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. తీరా ఓపీ చీటీ తీసుకెళ్లగా వైద్యులు వెళ్లిపోవడంతో రోగులు నిరాశ చెందారు. వైద్యం చేయించుకునేందుకు వస్తే చివరికి ఉత్తి చేతులతో పంపారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

కంప్యూటర్లు ఇవ్వకుండానే..

ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవలు.. వైద్యులు.. ల్యాబ్‌లలో వివరాలు నమోదు చేసేందుకు సుమారు 280 కంప్యూటర్లు కావాల్సి ఉంటుందని అంచనా. అదనంగా కనీసం 20 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు కావాల్సి ఉంది. సర్వజన ఆసుపత్రిలో కేవలం 80 కంప్యూటర్లు రాగా.. వాటిని ఐపీ, ఓపీ వంటి వాటికి ఇచ్చారు. వివిధ ల్యాబ్‌లు, ఎక్స్‌రే విభాగం, వార్డులకు   అందించాల్సి ఉంటుంది. వీటిని ఇవ్వడం ద్వారా ఆయా విభాగాల్లోనివారు రోగికి సంబంధించిన నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవేమీ ఇవ్వకుండానే ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించడం గమనార్హం.


ఆన్‌లైన్‌ సేవలు

క్యూలో నిల్చోలేక కింద కూర్చొన్న మహిళలు, వృద్ధులు..

ఆసుపత్రికొచ్చే రోగులకు సంబంధించిన ఆధార్‌, చిరునామా, చరవాణి నంబరు తదితర వివరాలు నమోదు చేయడం ద్వారా ఐడీ నంబరు వస్తుంది. ఈ నంబరును ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళ్లిన సమయంలో చూపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ ఐడీ నంబరు నమోదు చేస్తే రోగి చరవాణికి ఓటీపీ నంబరు వస్తుంది. దీనిని నమోదు చేయడం ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వైద్యుడు తెలుసుకునే వీలుంటుంది.


డిజిటల్‌ హెల్త్‌ ఐడీతో వైద్య సేవలు

ఓపీ కౌంటర్‌లో సేవలను పరిశీలిస్తున్న ఆసుపత్రి
పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు

కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమల్లో భాగంగా  రోగికి యూనిక్‌ ఐడీ ద్వారా ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సర్వజన వైద్యశాలలో ఓపీకి వచ్చిన రోగులకు యూనిక్‌ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు అందించే ప్రక్రియను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేవలం ఓపీ, ఐపీ ప్రారంభించాం.. త్వరలో ఓపీ, ఐపీ నంబర్ల స్థానంలో బార్‌ కోడ్‌తో కూడిన కొత్త యూనిక్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకరరెడ్డి, ఈ-ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్‌ శివబాల తదితరులు పాల్గొన్నారు.


నరకయాతన అనుభవించా

- లక్ష్మి, కోడుమూరు

ఉదయం 10 గంటలకు ఓపీ కోసం వచ్చా. వరుసలో నిలబడలేక నా కుమారుడిని నిల్చోబెట్టా. మధ్యాహ్నం ఒంటి గంటకు ఓపీ చీటీ ఇచ్చారు. ఆ సమయంలో ఓపీలో వైద్యులు ఉంటారో.. లేరా తెలియని పరిస్థితి.. అసలే ప్లేట్‌లెట్లు తగ్గిపోయి నడవలేని పరిస్థితి. చివరికి అత్యవసర విభాగంలోకి వెళ్లాను.


ఉదయం నుంచి నిరీక్షిస్తే..

- శివరాముడు, రామళ్లకోట, వెల్దుర్తి

కాళ్ల నొప్పులతో ఆర్థోపెడిక్‌ విభాగంలో చూపించుకునేందుకుగాను ఓపీకి వచ్చా. ఉదయం నుంచి వరుసలో నిల్చుంటే మధ్యాహ్నం 12 తర్వాత ఓపీ చీటీ ఇచ్చారు.. ఓపీలో వైద్యులు చూసి పరీక్షలు రాసిచ్చారు.. మధ్యాహ్నం పరీక్షలు చేయించినా వైద్యులు ఉండరు.. మరోసారి ఓపీకి రావాల్సి వస్తుందని.. లేదంటే ప్రైవేటుకు వెళ్లాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని