logo

నాడు-నేడు.. మారని తీరు

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రెండో విడతలో 1,084 పాఠశాలల అభివృద్ధికిగాను రూ.532.42 కోట్లు కేటాయించింది.

Published : 28 Nov 2022 03:08 IST

రెండో విడతకు 1,084 విద్యాలయాల ఎంపిక

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే : ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రెండో విడతలో 1,084 పాఠశాలల అభివృద్ధికిగాను రూ.532.42 కోట్లు కేటాయించింది. పలు కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో 468 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్కో గది నిర్మాణానికి రూ.12 లక్షలు వెచ్చిస్తున్నారు. పనులు చేపట్టిన పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా తరగతులు చూపకపోవడంతో చెట్లు, వరండాల్లోనే పిల్లలకు చదువు చెప్పాల్సి వస్తోంది.


మట్టిలో కూర్చోవాల్సిందే..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కల్లూరు అర్బన్‌ ఐజీబీసీ కాలనీలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో పనులు నాలుగైదు నెలలుగా సాగుతున్నాయి.. ఈ బడిలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. రూ.25.99 లక్షలు మంజూరయ్యాయి. నీటి సంప్‌ ఏర్పాటు, ఆర్వో ప్లాంట్‌, గ్రీన్‌ బోర్డులు, ప్రహరీ తదితరాలకు ఈ నిధులు వెచ్చించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. ఒక గదిలో సిమెంటు, స్టీల్‌, ఇతర నిర్మాణ సామగ్రి ఉంచారు. మరో తరగతి గదిలో బండలు కుంగిపోవడంతో ఫ్లోరింగ్‌ వేయాల్సి ఉంది. ఫలితంగా మట్టిపై కూర్చొని చదవాల్సి వస్తోంది.


వరండా చదువులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే : ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్‌ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు గదులు నిర్మించాలి. దీనికిగాను రూ.72 లక్షలు మంజూరయ్యాయి. ఈనెల 21న ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పనులు ప్రారంభం కాలేదు. సిమెంట్‌, ఇసుక, ఇతర సామగ్రి సమకూర్చలేదు. ప్రస్తుతం 1,100 మంది పిల్లలు చదువుతున్నారు. పది తరగతి గదులు, ఏడు రేకుల షెడ్లలో బోధన సాగుతోంది. విద్యార్థులకు మెట్ల కింద, వరండా, చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. గదుల నిర్మాణంపై సరైన స్పష్టత లేకపోవడంతో ఇంకా పనులు చేపట్టలేదు.


మందకొడిగా సాగుతున్నాయ్‌..

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ఓర్వకల్లు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి మనబడి నాడు-నేడు రెండో విడత పనులకుగాను రూ.77 లక్షలు మంజూరయ్యాయి. ప్రహరీతో పాటు అదనపు గది నిర్మాణం, మరుగుదొడ్లు తదితరాలు చేయాల్సి ఉంది. పనుల్లో పురోగతి కానరావడం లేదు. అదనపు తరగతి గది నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇసుకతోపాటు ఇతర సామగ్రి సకాలంలో అందుతున్నట్లు అధికారులు చెబుతున్నా పనుల్లో ఆ వేగం కానరావడం లేదు.


నాసిరకం ఇసుకతో నిర్మాణాలు

మద్దికెర, న్యూస్‌టుడే: అగ్రహారం ఉన్నత పాఠశాలలో 156 మంది పిల్లలు చదువుకుంటున్నారు. నాడు-నేడు రెండో విడత కింద రూ.1.13 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ 5 అదనపు గదులు నిర్మిస్తున్నారు. బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. వంట గది, సైకిల్‌ షెడ్డు, సంపు, విద్యుత్తు పనులు తదితరాలు చేపట్టారు. నాసిరకం ఇసుక వినియోగిస్తున్నారు.  


వేధిస్తున్న నిధుల కొరత..

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం బార్‌పేట హిందూ బాలుర పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ రూ.20 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిహేను రోజులుగా ఆగిపోయాయి. మొదటి దఫా కింద రూ.3 లక్షలు మంజూరవగా.. కొంతమేర చేపట్టారు. నిర్మాణ పనులకు ఒక్క సిమెంటు బస్తా కూడా రాకపోగా.. ఇతర పాఠశాల నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు. ప్రస్తుతం రెండో దఫా కింద వచ్చే నిధులు కేటాయిస్తేగానీ పనులు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం 53 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఓ తరగతి గదిలో ఫ్లోరింగ్‌ మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు    పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని